గంభీర్ కోచ్ కాదు.. జస్ట్ మేనేజర్ : కపిల్ దేవ్

by Muthe.Rajitha |

భారత మాజీ కెప్టెన్‌, 1983 వరల్డ్‌కప్ విజేత కపిల్‌ దేవ్‌ టీమిండియా హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

గంభీర్ కోచ్ కాదు.. జస్ట్ మేనేజర్ : కపిల్ దేవ్
X

దిశ, వెబ్ డెస్క్ : భారత మాజీ కెప్టెన్‌, 1983 వరల్డ్‌కప్ విజేత కపిల్‌ దేవ్‌ టీమిండియా హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌(ICC) శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న కపిల్ దేవ్... ప్రస్తుత క్రికెట్‌లో హెడ్‌ కోచ్‌ పాత్ర ట్రెడిషనల్‌ కోచింగ్‌ కంటే ప్లేయర్‌ మేనేజ్‌మెంట్‌పైనే ఎక్కువగా ఉండాలని అన్నారు. "ఈ రోజుల్లో కోచ్ అనే పదాన్ని చాలా లూజ్‌గా వాడుతున్నారు. గంభీర్‌ అసలు కోచ్‌ కాదు, జట్టుకు మేనేజర్‌ మాత్రమే. స్కూల్‌, కాలేజీల్లో నేర్పేవాళ్లే నిజమైన కోచ్‌లు. ఇంటర్నేషనల్‌ స్థాయిలో ఆటగాళ్లు ఇప్పటికే స్పెషలిస్ట్‌లు.

లెగ్‌ స్పిన్నర్‌కు, వికెట్‌ కీపర్‌కు గంభీర్‌ ఎలా కోచింగ్‌ ఇస్తాడు?" అని వ్యాఖ్యానించారు. మేనేజర్‌గా ఆటగాళ్లను ప్రోత్సహించడం, వారిలో నమ్మకం నింపడం, మానసిక సౌకర్యం కల్పించడమే ముఖ్యమని కపిల్ అన్నారు. ఫామ్‌లో లేని ప్లేయర్‌లకు అండగా నిలవడం కెప్టెన్‌, మేనేజర్‌ బాధ్యత అని తెలిపారు. గంభీర్ ఇకపై ఈ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించాలని కోరారు. దక్షిణాఫ్రికాతో సొంత దేశంలో 0-2 టెస్ట్‌ సిరీస్‌ ఓటమి తర్వాత గంభీర్‌పై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో కపిల్‌ వ్యాఖ్యలు మరోసారి సంచలనం రేపాయి.

Next Story