Asian Athletics Championships 2023: తెలుగమ్మాయికి రెండో పతకం..

by Disha Web Desk 13 |
Asian Athletics Championships 2023: తెలుగమ్మాయికి రెండో పతకం..
X

బ్యాంకాక్ : థాయిలాండ్‌లో జరుగుతున్న ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్ల జోరు చివరి రోజు కూడా కొనసాగింది. ఆదివారం ఒకే రోజు 13 పతకాలు సాధించారు. తెలుగమ్మాయి, విశాఖకు చెందిన యర్రాజి జ్యోతి ఈ టోర్నీలో తన ఖాతాలో మరో పతకం చేర్చుకుంది. మహిళల 100 మీటర్ల హార్డిల్స్‌లో జ్యోతి ఇప్పటికే స్వర్ణం కైవసం చేసుకోగా.. తాజాగా 200 మీటర్ల రేసులో రజతం గెలుచుకుంది. 23.13 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. టోర్నీలో ఆమె అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన చేసింది. అలాగే, మహిళల 20 కిలోమీటర్ల రేసు వాక్‌లో ప్రియాంక(1:34:24 సెకన్లు) రెండో స్థానంలో నిలిచి రజత పతకం గెలుచుకోగా.. పురుషుల 20 మీటర్ల రేస్ వాక్‌లో వికాస్ సింగ్(1:29:32 సెకన్లు) కాంస్యం సాధించాడు.

అలాగే, పురుషుల 5,000 మీటర్ల రేసు ఈవెంట్‌లో గుల్‌వీర్ సింగ్ (13:48.33 సెకన్లు) మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్ దక్కించుకున్నాడు. పురుషుల 4x400 మీటర్ల రిలే ఈవెంట్‌లో అమోజ్ జాకబ్, ముహమ్మద్ అజ్మల్, మిజో కురియన్, రమేశ్ రాజేశ్‌లతో కూడిన జట్టు(3:01.80 సెకన్లు) రజతం కైవసం చేసుకోగా.. రెజోనా, ఐశ్వర్య, జ్యోతిక, సుభాలతో కూడిన మహిళల జట్టు(3:33.73 సెకన్లు) కాంస్యం సాధించింది. పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్‌లో భారత అథ్లెట్ మను 81.01 మీటర్ల ప్రదర్శనతో రజతం కొల్లగొట్టాడు. అలాగే, మహిళల షాట్‌పుట్‌లో అభా కతువా 18.06 మీటర్ల పర్సనల్ బెస్ట్ ప్రదర్శనతో రజతం గెలుచుకోగా.. మరో భారత అథ్లెట్ మన్‌ప్రీత్ కౌర్ 17 మీటర్ల ప్రదర్శనతో కాంస్యం దక్కించుకుంది.

పురుషుల 800 మీటర్ల ఈవెంట్‌లో క్రిష్ణన్ కుమార్ (1:45.88 సెకన్లు), మహిళల ఈవెంట్‌లో చందా (2:01.58 సెకన్లు) సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు. అలాగే, 5000 మీటర్ల రేసులో పారుల్ చౌదరి రజతం కైవసం చేసుకుంది. ఆమె 15:52.35 సెకన్లలో గమ్యాన్ని చేరుకుని రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటికే 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ ఈవెంట్‌లో స్వర్ణం గెలిచిన ఆమెకు టోర్నీలో ఇది రెండో పతకం. ఇదే ఈవెంట్‌లో మరో భారత అథ్లెట్ అంకిత 16:03.33 సెకన్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెలుచుకుంది. భారత్ మొత్తం 27 పతకాలతో మూడో స్థానంలో నిలిచి టోర్నీని ఘనంగా ముగించింది.

Next Story