టీ20 ప్రపంచకప్‌లో దుమ్ములేపిన ఇషాన్ కిషన్.. ICC ర్యాంకింగ్స్ నంబర్ వన్ రేసులో మనోళ్లే

by Kema Shiva Kumar |

ICC టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఇషాన్ కిషన్ దూసుకెళ్తున్నారు. రెండు స్థానాలు ఎగబాకి ఏకంగా రెండో స్థానానికి చేరుకున్నాడు.

టీ20 ప్రపంచకప్‌లో దుమ్ములేపిన ఇషాన్ కిషన్.. ICC ర్యాంకింగ్స్ నంబర్ వన్ రేసులో మనోళ్లే
X

దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచకప్ 2026లో అద్భుత ఫామ్‌ను కొనసాగించిన టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపారు. తాజా ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఇషాన్ రెండు స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరుకున్నారు. ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న మరో భారత బ్యాటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma)కు, ఇషాన్‌కు మధ్య కేవలం 4 పాయింట్ల తేడా మాత్రమే ఉండటం విశేషం.

నంబర్ వన్ రేసులో మనోళ్లే..

ప్రపంచకప్‌లో నిలకడగా రాణించిన ఇషాన్ కిషన్ 871 రేటింగ్ పాయింట్లతో తన కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంకును కైవసం చేసుకున్నారు. ప్రస్తుతం అభిషేక్ శర్మ 875 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, ఇషాన్ రెండో స్థానంలో నిలిచారు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ చరిత్రలో టాప్-2 స్థానాల్లో ఇద్దరు భారత ఆటగాళ్లు ఉండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ 25 బంతుల్లోనే 54 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ టోర్నీలో మొత్తం 317 పరుగులు చేసిన ఇషాన్, తన దూకుడుతో ర్యాంకింగ్స్‌లో పైకి దూసుకొచ్చారు. మరోవైపు, ఫైనల్‌లో 52 పరుగులు చేసిన అభిషేక్ శర్మ తన నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నారు.

మెరుగుపడిన సంజూ ర్యాంకు

ప్రపంచకప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన సంజూ శామ్సన్ ఏకంగా 18 స్థానాలు ఎగబాకి 22వ ర్యాంకుకు చేరుకున్నారు. ఇతర భారత బ్యాటర్లలో తిలక్ వర్మ 6, సూర్యకుమార్ యాదవ్ 7 ర్యాంకులతో టాప్-10లో కొనసాగుతున్నారు. ఇక బౌలింగ్ విభాగంలో భారత్‌కు స్వల్ప నిరాశ ఎదురైంది. అగ్రస్థానంలో ఉన్న మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) తన నంబర్ వన్ ర్యాంకును కోల్పోయారు. ఆఫ్ఘనిస్తాన్ స్పిన్ దిగ్గజం రషీద్ ఖాన్ మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు.

Next Story