IPL 2026 : ఎలక్షన్ ఎఫెక్ట్.. ఆలస్యంగా ఐపీఎల్-2026 ప్రారంభం?.. ఎప్పటి నుంచి స్టార్ట్ అంటే?

by Harish |   (  Updated:2026-02-27 19:05:36  IST  )

IPL 2026 : ఎలక్షన్ ఎఫెక్ట్.. ఆలస్యంగా ఐపీఎల్-2026 ప్రారంభం?.. ఎప్పటి నుంచి స్టార్ట్ అంటే?
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2026పై పలు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు ప్రభావం చూపనున్నాయి. ముందుగా అనుకున్న తేదీ కంటే రెండు రోజులు ఆలస్యంగా సీజన్ ప్రారంభంకానున్నట్టు తెలుస్తోంది. మొదట మార్చి 26 నుంచి లీగ్ ప్రారంభించాలని బీసీసీఐ ప్లాన్ చేసింది. అధికారికంగా ఇంకా ప్రకటించకపోయినా డిసెంబర్‌ 15న ఐపీఎల్ వేలం ముగిసిన తర్వాత ఫ్రాంచైజీలకు ఈ విషయాన్ని తెలియజేసింది. అయితే, అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు ఐపీఎల్-2026కు అంతరాయం కలిగించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.

కోల్‌కతా, చెన్నయ్, గువహతి వంటి ఐపీఎల్ వేదికలు పై రాష్ట్రాల్లో ఉన్నాయి. దీంతో మార్చి 26 నుంచి కాకుండా 28వ తేదీ నుంచి ఐపీఎల్ ప్రారంభించాలని బీసీసీఐ డిసైడ్ అయినట్టు క్రికెట్ వర్గాల నుంచి సమాచారం. అదే జరిగితే మరి ముందుగా అనుకున్నట్టు మే 31వ తేదీననే ఫైనల్ జరుగుతుందా?లేదా ఫైనల్‌ను కూడా రెండు రోజులు వెనక్కి జరుపుతారా? అన్నది చూడాలి. వచ్చే వారం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం కానుంది. ఈ మీటింగ్‌లో షెడ్యూల్‌‌ను ఫైనల్ చేయనున్నట్టు తెలుస్తోంది. గతంలో కూడా పలు ఐపీఎల్ సీజన్లపై ఎన్నికలు ఎఫెక్ట్ చూపించాయి. 2009, 2014, 2019, 2024 సీజన్లలో దేశంలో సాధారణ ఎన్నికలు లేదా అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఐపీఎల్ షెడ్యూల్‌‌ను రెండు దశల్లో ప్రకటించారు. ఈ సారి కూడా అదే తరహాలో షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉన్నట్టు క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల కమిషన్ ప్రకటించే ఎలక్షన్ తేదీల ప్రకారం షెడ్యూల్ రూపొందించనున్నట్టు చెబుతున్నారు.

Next Story