- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPL 2026 : వివాదంలో చిక్కుకున్న ముంబై ఇండియన్స్.. ఆ రూల్‌ను దుర్వినియోగం చేసిందంటూ విమర్శలు

దిశ, స్పోర్ట్స్ : ముంబై ఇండియన్స్ వివాదంలో చిక్కుకుంది. గురువారం చెన్నయ్ సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. అయితే, ఆ మ్యాచ్‌లో ఎంఐ గాయపడిన సాంట్నర్ స్థానంలో శార్దూల్ ఠాకూర్‌ను ‘కంకషన్ సబ్‌స్టిట్యూట్’గా తీసుకోవడం వివాదాస్పదమైంది. కంకషన్ రూల్‌ను ముంబై దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.అసలేం జరిగిందంటే..సీఎస్కే ఇన్నింగ్స్‌లో బుమ్రా వేసిన 17వ ఓవర్‌లో కార్తిక్ శర్మ భారీ షాట్ ఆడగా.. సాంట్నర్ డైవ్ చేసి మరి అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. అయితే, ఆ సమయంలో సాంట్నర్ భుజానికి గాయమైంది. దీంతో అతను మైదానం వీడగా.. కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా శార్దూల్ ఠాకూర్‌ను మైదానంలోకి రప్పించింది. అయితే, ఈ మార్పు వివాదానికి దారితీసింది. ఐపీఎల్ రూల్స్ ప్రకారం.. తలకు, మెడకు గాయమైతేనే కంకషన్ సబ్‌స్టిట్యూట్‌ను తీసుకోవచ్చు. గాయం తీవ్రతను వైద్యులు నిర్ధారించిన తర్వాతే సబ్‌స్టిట్యూట్‌కు మ్యాచ్ రిఫరీ ఆమోదించాల్సి ఉంటుంది. సాంట్నర్‌కు భుజానికి గాయమైతే కంకషన్ సబ్‌స్టిట్యూట్‌ను ఎందుకు తీసుకున్నారన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఎంఐ కంకషన్ రూల్‌ను దుర్వినియోగం చేసిందని విమర్శిస్తున్నారు.
సాంట్నర్ తలకు, మెడకు కూడా గాయమైంది : మహేల జయవర్ధనె
కంకషన్ సబ్‌స్టిట్యూట్ చర్చకు దారితీయడంతో ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేల జయవర్ధనె స్పందించాడు. సాంట్నర్‌కు మొదట తలకు, మెడకు గాయమైందని వెల్లడించాడు. ఆ తర్వాత భుజానికి గాయమైందని చెప్పాడు. కంకషన్ సబ్‌స్టిట్యూట్‌కు తాము అభ్యర్థించామని, సరైన కారణం చెప్పడంతోనే మ్యాచ్ రిఫరీ, అంపైర్ శార్దూల్‌కు అనుమతి ఇచ్చారని తెలిపాడు. అయితే,డ్రెస్సింగ్ రూంలో సాంట్నర్ భుజానికి ఐస్ ప్యాక్ పెట్టుకోవడం గమనార్హం. శార్దూల్ రాక ముంబైకి పెద్దగా ఉపయోగపడలేదు. చేజింగ్‌లో అతను 12 బంతులు ఎదుర్కొని 6 రన్సే చేసి అవుటయ్యాడు. ఆ మ్యాచ్‌లో ముంబై 103 పరుగుల తేడాతో ఓడిపోయి ఐపీఎల్‌లోనే భారీ ఓటమిని చవిచూసింది.






