హైటెన్షన్ మ్యాచ్‌లో అర్జెంటీనాను ఓడించిన భారత్

by Harish |
హైటెన్షన్ మ్యాచ్‌లో అర్జెంటీనాను ఓడించిన భారత్
X

దిశ, స్పోర్ట్స్ : ఎఫ్‌ఐహెచ్ ప్రొ హాకీ లీగ్‌ టోర్నీల్లో భాగంగా ఐరోపా పర్యటనను భారత పురుషుల హాకీ జట్టు విజయంతో ఆరంభించగా.. మహిళల జట్టు ఓటమితో మొదలుపెట్టింది. పురుషుల టోర్నీలో బుధవారం ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనాను భారత్ షూటౌట్‌లో ఓడించింది.

మొదట నిర్ణీత సమయంలో ఇరు జట్లు 2-2తో సమంగా నిలిచాయి. మన్‌దీప్ సింగ్, ఉపాధ్యాయ్ లలిత్ కుమార్ చెరో గోల్ చేయడంతో భారత్ 2-1తో ఆధిక్యంలో నిలిచి విజయం సాధించేలా కనిపించింది. అయితే, ఆఖరి నిమిషంలో అర్జెంటీనా ప్లేయర్ డొమెనె థామస్ గోల్ చేసి మ్యాచ్‌ను షూటౌట్‌కు మళ్లించాడు. షూటౌట్‌లో 5-4 తేడాతో భారత్ నెగ్గింది. షూటౌట్‌లో రెండేసి గోల్స్‌తో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, సుఖ్‌జీత్ సింగ్‌తోపాటు ప్రత్యర్థి గోల్స్‌ను తిప్పికొట్టిన గోల్ కీపర్ శ్రీజేశ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. శుక్రవారం బెల్జియంతో తలపడనుంది.

మరోవైపు, మహిళల టోర్నీలో భారత జట్టు 0-5 తేడాతో అర్జెంటీనా చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా మొదటి నుంచి ఆధిపత్యం ప్రదర్శించగా.. భారత జట్టు ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. గురువారం బెల్జియంతో ఆడనుంది.

Next Story