తొలి రోజు జైశ్వాల్‌దే.. డబుల్ సెంచరీ దిశగా యువ ఓపెనర్

by Dishanational3 |
తొలి రోజు జైశ్వాల్‌దే.. డబుల్ సెంచరీ దిశగా యువ ఓపెనర్
X

దిశ, స్పోర్ట్స్ : తొలి టెస్టు‌లో అనూహ్య ఓటమి పొందిన టీమ్ ఇండియా సిరీస్‌లో పుంజుకునేందుకు రెండో టెస్టులో మంచి పునాది పడింది. యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ అజేయ భారీ శతకంతో కదం తొక్కిన వేళ రెండో టెస్టును టీమ్ ఇండియా మెరుగ్గా ఆరంభించింది. కీలక ప్లేయర్లు నిరాశపర్చినప్పటికీ జైశ్వాల్ జట్టుకు అండగా నిలవడంతో తొలి రోజు భారత్‌దే ఆధిపత్యం. విశాఖపట్నం వేదికగా శుక్రవారం భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లను కోల్పోయి 336 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ అజేయ సెంచరీతో రాణించాడు. 257 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్స్‌లతో 179 పరుగులు చేశాడు. కెప్టెన్ రోహిత్(14), శుభ్‌మన్ గిల్(34), శ్రేయస్ అయ్యర్(27) స్వల్ప స్కోరుకే మైదానం వీడారు. రజత్ పాటిదార్(32), అక్షర్ పటేల్(27)లది అదే పరిస్థితి. అయితే, ఓపెనర్ యశస్వి జైశ్వాల్ కీలక ఇన్నింగ్స్ ఆడి తొలి రోజు జట్టు ఆలౌట్ కాకుండా అడ్డుగా నిలిచాడు. ఓపెనర్‌గా వచ్చిన అతను తొలి రోజు చివరి వరకూ క్రీజులో ఉన్నాడు. అతనితోపాటు అశ్విన్(5 బ్యాటింగ్)తో క్రీజులో ఉన్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో రెహాన్ అహ్మద్, షోయబ్ బషీర్ రెండేసి వికెట్లు తీయగా.. జేమ్స్ అండర్సన్, టామ్ హార్ట్లీ చెరో వికెట్ పడగొట్టారు.

శుభారంభం దక్కలే

టాస్ ఓడి ముందుగా తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్‌కు శుభారంభం దక్కలేదు. కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ(14) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. ఆచితూచి ఆడుతున్న అతను అరంగేట్రం బౌలర్ షోయబ్ బషీర్ బౌలింగ్‌లో క్యాచ్ అవుటయ్యాడు. దీంతో 40 పరుగులకే భారత్ తొలి వికెట్ కోల్పోయింది. క్రీజులోకి వచ్చిన శుభ్‌మన్ గిల్(34) కూడా మరోసారి నిరాశపరిచాడు. తన స్థాయి ప్రదర్శన ఇవ్వడంలో విఫలమయ్యాడు. ఇక, శ్రేయస్ అయ్యర్‌(27)ది అదే పరిస్థితి. క్రీజులో పాతుకపోయినట్టే కనిపించిన అతను టామ్ హార్ట్లీ బౌలింగ్‌లో వికెట్ పారేసుకున్నాడు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ గైర్హాజరులో కీలక పాత్ర పోషించాల్సిన స్టార్ ప్లేయర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.

స్టార్లు నిరాశపర్చిన వేళ.. జైశ్వాల్ అండగా

యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్‌గా వచ్చిన అతను తొలి రోజు ఆట ముగిసే వరకూ అజేయంగా నిలిచి జట్టును ఆధిపత్య స్థితిలో నిలబెట్టాడు. రోహిత్, గిల్ అయ్యర్ స్వల్ప స్కోరుకు వెనుదిరిగినప్పటికీ.. వారితో కలిసి జైశ్వాల్ విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. అయ్యర్‌తో కలిసి అత్యధికంగా 90 పరుగులు జత చేశాడు. గత మ్యాచ్‌లో తనను అవుట్ చేసిన జోరూట్‌తోపాటు టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, రెహాన్ అహ్మద్‌లను జైశ్వాల్ సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలోనే షోయబ్ బషీర్ బౌలింగ్‌లో వరుసగా ఓ సిక్స్, ఫోర్ కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అతను.. ఆ తర్వాత గేర్ మార్చాడు. 89 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా.. మరో 62 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. టామ్ హార్ట్లీ బౌలింగ్‌లో భారీ సిక్స్ బాది శతకం పూర్తి చేయడం విశేషం. టెస్టుల్లో అతనికి ఇది రెండో శతకం. మరోవైపు, జైశ్వాల్‌ను అవుట్ చేసేందుకు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ ప్రయత్నాలు ఫలించలేదు. క్రీజులో పాతుకపోయిన అతను ఇంగ్లాండ్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు. అరంగేట్ర బ్యాటర్ రజత్ పాటిదార్(32), అక్షర్ పటేల్(27)లు సైతం జైశ్వాల్‌కు చక్కటి సహకారం అందించారు. మరోవైపు, హోం గ్రౌండ్‌లో తొలి టెస్టు ఆడుతున్న శ్రీకర్ భరత్(17) నిరాశపరిచాడు. చివరి సెషన్ ఆఖర్లో ఇంగ్లాండ్ బౌలర్లు కాస్త పట్టు సాధించారు. రజత్ పాటిదార్, అక్షర్ పటేల్, శ్రీకర్ భరత్ వికెట్లు సాధించారు. అయితే, అశ్విన్(5 బ్యాటింగ్)తో కలిసి జైశ్వాల్ తొలి రోజు ఆటను ముగించాడు.

స్కోరుబోర్డు

భారత్ తొలి ఇన్నింగ్స్ : 336/6(93 ఓవర్లు)

యశస్వి జైశ్వాల్ 179 బ్యాటింగ్, రోహిత్(సి)ఓలీ పోప్(బి)షోయబ్ బషీర్ 14, గిల్(సి)ఫోక్స్(బి)అండర్సన్ 34, శ్రేయస్ అయ్యర్(సి)ఫోక్స్(బి)టామ్ హార్ట్లీ 27, రజత్ పాటిదార్(బి)రెహాన్ అహ్మద్ 32, అక్షర్ పటేల్(సి)రెహాన్ అహ్మద్(బి)షోయబ్ బషీర్ 27, శ్రీకర్ భరత్(సి)షోయబ్ బషీర్(బి)రెహాన్ అహ్మద్ 17, అశ్విన్ 5 బ్యాటింగ్; ఎక్స్‌ట్రాలు 1.

వికెట్ల పతనం : 40-1, 89-2, 179-3, 249-4, 301-5, 330-6

బౌలింగ్ : జేమ్స్ అండర్సన్(17-3-30-1), జోరూట్(14-0-71-0), టామ్ హార్ట్లీ(18-2-74-1), షోయబ్ బషీర్(28-0-100-2), రెహాన్ అహ్మద్(16-2-61-2)


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed