రెండో రోజూ భారత్‌దే ఆధిపత్యం.. మెరిసిన కేఎల్ రాహుల్, జడేజా

by Dishanational5 |
రెండో రోజూ భారత్‌దే ఆధిపత్యం.. మెరిసిన కేఎల్ రాహుల్, జడేజా
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో తొలి టెస్టుపై టీమ్ ఇండియా పట్టు సాధించింది. ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఈ టెస్టులో రెండో రోజూ భారత్‌దే ఆధిపత్యం. తొలి రోజు బౌలర్లు సత్తాచాటి ప్రత్యర్థిని మోస్తరు స్కోరుకే పరిమితం చేయగా.. శుక్రవారం బ్యాటర్లు రాణించడంతో భారత్ విజయానికి అడుగులు పడ్డాయి. యశస్వి జైశ్వాల్‌తోపాటు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీలతో మెరవడంతో శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్ 175 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది. మొదటి రోజు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. ఓవర్‌నైట్ స్కోరు 119/2తో రెండు రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 421 పరుగులు చేసింది. తొలి రోజు దూకుడు ఆటతీరు కనబర్చిన యశస్వి జైశ్వాల్ ఆరంభంలోనే అవుటవ్వగా.. కేఎల్ రాహుల్(86), రవీంద్ర జడేజా(81 బ్యాటింగ్) సత్తాచాటారు. రాహుల్ సెంచరీకి చేరువలో అవుటవ్వగా.. జడేజా శతకం దిశగా వెళ్తున్నాడు. జడేజాతోపాటు అక్షర్ పటేల్(35 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. శ్రీకర్ భరత్(41), శ్రేయస్ అయ్యర్(35) పర్వాలేదనిపించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో టామ్ హార్ట్లీ, జోరూట్ చెరో రెండు వికెట్లు తీయగా.. జాక్ లీచ్, రెహాన్ అహ్మద్ తలా ఒక వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం దిశగా వెళ్తున్న టీమ్ ఇండియా మూడో రోజే విజయాన్ని ఖాతాలో వేసుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. టీమ్ ఇండియా గెలుపును అడ్డుకోవడం ఇంగ్లాండ్‌ శక్తిమించి పోరాటం చేయాల్సిందే.

రాణించిన రాహుల్

రెండో రోజు ఆరంభంలో భారత్‌ కాస్త తడబడింది. ఓవర్‌నైట్ బ్యాటర్లు యశస్వి జైశ్వాల్(80), శుభ్‌మన్ గిల్(23) స్వల్ప వ్యవధిలోనే వెనుదిరిగారు. దీంతో ఇంగ్లాండ్ బౌలర్లు పట్టు సాధించేలా కనిపించారు. అయితే, కేఎల్ రాహుల్ కీలక ఇన్నింగ్స్‌తో సత్తాచాటాడు. శ్రేయస్ అయ్యర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. మొదట్లో రూట్, టామ్ హార్ట్లీ, రెహాన్ అహ్మద్ బౌలింగ్‌లో దూకుడుగా ఆడిన అతను.. ఆ తర్వాత నెమ్మదిగా ఆడాడు. ఈ క్రమంలో 72 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మరోఎండ్‌లో అయ్యర్ సైతం క్రీజులో పాతుకపోవడంతో లంచ్ సమయానికి భారత్ 223/3తో నిలిచింది. విరామం అనంతరం ఈ జోడీని రెహాన్ అహ్మద్ విడదీశాడు. అతని బౌలింగ్‌లో అయ్యర్(35) పెవిలియన్ చేరడంతో 64 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం రాహుల్‌కు జడేజా తోడయ్యాడు. జడేజా సహకారంతో గేర్ మార్చిన రాహుల్ రెహాన్ వరుస ఓవర్లలో రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లు బాది సెంచరీకి చేరవయ్యాడు. అయితే, కాసేపటికే రాహుల్‌ పెవిలియన్ చేరి సెంచరీని చేజార్చుకున్నాడు.

సెంచరీ దిశగా జడేజా

రాహుల్‌ అవుటైనా తర్వాత జడేజా జట్టు బాధ్యతలు మీదేసుకున్నాడు. అప్పటి వరకూ బౌండరీలతో ధాటిగా ఆడిన జడేజా రాహుల్ అవుటైన తర్వాత ఆచితూచి ఆడాడు. అతనికి తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్ సహకరించాడు. వీరిద్దరూ క్రీజులో పాతుకపోయి ఇంగ్లాండ్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారారు. దీంతో టీ సమయానికి భారత్ 309/5తో నిలువగా.. విరామం అనంతరం కూడా ఈ జోడీ ఇన్నింగ్స్‌ను సమర్థవంతంగా నడిపించింది. ఈ క్రమంలోనే జడేజా టెస్టుల్లో 20 హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కాసేపటికే శ్రీకర్ భరత్(41)ను రూట్ పెవిలియన్ పంపడంతో ఈ జోడీకి విడిపోయింది. 6వ వికెట్‌కు ఈ జోడీ 68 పరుగులు జోడించింది. అనంతరం జడేజాకు అక్షర్ పటేల్ తోడయ్యాడు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూనే అడపాదడపా బౌండరీలు బాదారు. వికెట్ కాపాడుకున్న ఈ జోడీ మూడో రోజును ముగించింది. జడేజా 81 పరుగులతో సెంచరీ దిశగా వెళ్తుండగా.. అక్షర్ పటేల్ 35 పరుగులతో అజేయంగా నిలిచాడు.

స్కోరుబోర్డు

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ : 246 ఆలౌట్

భారత్ తొలి ఇన్నింగ్స్ : 421/7(110 ఓవర్లు)

యశస్వి జైశ్వాల్(సి అండ్ బి) రూట్ 80, రోహిత్(సి)స్టోక్స్(బి)జాక్ లీచ్ 24, గిల్(సి)డక్కెట్(బి)టామ్ హార్ట్లీ 23, కేఎల్ రాహుల్(సి)రెహాన్ అహ్మద్(బి)టామ్ హార్ట్లీ 86, శ్రేయస్ అయ్యర్(సి)టామ్ హార్ట్లీ(బి)రెహాన్ అహ్మద్ 35, జడేజా 81 బ్యాటింగ్, శ్రీకర్ భరత్ ఎల్బీడబ్ల్యూ(బి)రూట్ 41, అశ్విన్ రనౌట్(టామ్ హార్ట్లీ/ఫోక్స్) 1, అక్షర్ పటేల్ 35 బ్యాటింగ్; ఎక్స్‌ట్రాలు 35.

వికెట్ల పతనం : 80-1, 123-2, 159-3, 223-4, 288-5, 356-6, 358-7

బౌలింగ్ : మార్క్‌వుడ్ (13-0-43-0), టామ్ హార్ట్లీ (25-0-131-2),జాక్ లీచ్ (25-6-54-1), రెహాన్ అహ్మద్ (23-3-105-1), జోరూట్ (24-2-77-2)



Next Story

Most Viewed