టాప్ 5లో గిల్, రోహిత్, కోహ్లీ

by Ajay Maddhiboyina |

శ్రీలంక స్పిన్నర్ మహీశ్ తీక్షణ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు.

టాప్ 5లో గిల్, రోహిత్, కోహ్లీ
X

- టాప్ 10లోకి రవీంద్ర జడేజా

- రెండో స్థానానికి చేరుకున్న శాంట్నర్

- ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ వెల్లడి

దిశ, స్పోర్ట్స్: చాంపియన్స్ ట్రోఫీలో మెరిసిన భారత బ్యాటర్లు బుధవారం వెల్లడించిన ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానాలు దక్కించుకున్నారు. భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక న్యూజీలాండ్‌లో జరిగిన ఫైనల్‌లో 78 పరుగులు చేయడమే కాకుండా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ రెండు స్థానాలు ఎగబాకి మూడో ర్యాంకుకు చేరుకున్నాడు. ఇక ఫైనల్‌లో విఫలం అయిన విరాట్ కోహ్లీ ఒక స్థానం కోల్పోయి ఐదో ర్యాంకులో నిలిచాడు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ చాంపియన్స్ ట్రోఫీలో విఫలమయ్యాడు. కానీ అతను ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రెండోస్థానాన్ని కాపాడుకున్నాడు. హెన్రిచ్ క్లాసెన్ నాలుగో ర్యాంకులో ఉన్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో నిలకడగా రాణించిన భారత బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ 8వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఇక అనూహ్యంగా కేఎల్ రాహుల్ ఒక స్థానాన్ని కోల్పోయి 16వ ర్యాంకుకు పడిపోవడం గమనార్హం.

శ్రీలంక స్పిన్నర్ మహీశ్ తీక్షణ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ మూడో స్థానానికి ఎగబాకాడు. చాంపియన్స్ ట్రోఫీలో కుల్దీప్ 7 వికెట్లు తీసి భారత జట్టులో కీలకంగా మారాడు. ఫైనల్స్‌లో రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్‌సన్ వికెట్లు తీసి కివీస్ జట్టు తక్కువ స్కోరకు పరిమితం కావడంలో తన వంతు పాత్ర పోషించాడు.ఇక కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ ఏకంగా ఆరు స్థానాలు ఎగబాకి రెండో ర్యాంకుకు చేరుకోవడం విశేషం. రవీంద్ర జడేజా టాప్ 10లోకి తిరిగి ప్రవేశించాడు. గాయం కారణంగా ఫైనల్ మ్యాచ్ ఆడని మాట్ హెన్రీ మూడు స్థానాలు కోల్పోయి ఆరో ర్యాంకుకు పడిపోయాడు.

టాప్-5 ర్యాంకులు

బ్యాటర్లు

1. శుభ్‌మన్ గిల్ - 784 పాయింట్లు

2. బాబర్ అజామ్ - 770

3. రోహిత్ శర్మ - 756

4. హెన్రిచ్ క్లాసెన్ - 744

5. విరాట్ కోహ్లీ - 736

బౌలర్లు

1. మహీశ్ తీక్షణ - 680 పాయింట్లు

2. మిచెల్ శాంట్నర్ - 657

3. కుల్దీప్ యాదవ్ - 650

4. కేశవ్ మహారాజ్ - 648

5. బెర్నార్డ్ షూల్జ్ - 646

Next Story