నిద్ర పట్టలేదు.. ఆలోచిస్తూనే ఉన్నా : మోహిత్ శర్మ

by Disha Web Desk 13 |
నిద్ర పట్టలేదు.. ఆలోచిస్తూనే ఉన్నా : మోహిత్ శర్మ
X

న్యూఢిల్లీ: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ రోజు రాత్రి అస్సలు నిద్రపట్టలేదని, బంతులు ఎలా వేస్తే బాగుండేదో అని ఆలోచిస్తూనే ఉన్నానని గుజరాత్ టైటాన్స్ బౌలర్ మోహిత్ శర్మ తెలిపాడు. ఫైనల్‌లో గుజరాత్‌పై నెగ్గి చెన్నయ్ ఐదోసారి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. చివరి ఓవర్‌ను మోహిత్ అద్భుతంగా వేసినప్పటికీ చివరి రెండు బంతులను జడేజా బౌండరీలకు తరలించడంతో చెన్నయ్ చాంపియన్‌గా నిలిచింది. తాజాగా ఓ జాతీయ మీడియాతో మోహిత్ మాట్లాడుతూ.. ‘నేను చేయాలనుకున్న దానిపై స్పష్టంగా ఉన్నా. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా బౌలింగ్ చేయాలో నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాను. నేను అన్ని బంతులు యార్కర్లు వేయాలనుకున్నాను. టీమ్ సభ్యులతోనూ అదే చెప్పా. నాలుగు బంతులు అలాగే వేశా. కానీ, చివరి రెండు బంతులు యార్కర్ సంధించాలనే వేశా.

కానీ, బంతి అనుకున్న చోట పడలేదు.’ అని మోహిత్ వివరించాడు. ‘ఫైనల్‌ మ్యాచ్‌ ముగిసిన రోజు అస్సలు నిద్ర పట్టలేదని, ఆ బంతిని అలా వేసి ఉంటే బాగుండేది.. ఇలా వేసి ఉంటే బాగుండేదని ఆలోచిస్తూనే ఉన్నా. కానీ, జట్టు గెలుపొందడానికి శక్తివంచనా లేకుండా కృషి చేశాను.’ అని తెలిపాడు. కాగా, చివరి ఓవర్‌లో సీఎస్కే విజయానికి 13 పరుగులు అవసరం కాగా.. బౌలర్ మోహిత్ తొలి నాలుగు బంతుల్లో 3 పరుగులు మాత్రమే ఇవ్వడంతో గుజరాత్ విజయం ఖాయమే అని అంతా అనుకున్నారు. కానీ, చివరి రెండు బంతుల్లో జడేజా అద్భుతమైన బౌండలు బాదడంతో గుజరాత్ వరుసగా రెండోసారి చాంపియన్‌గా నిలువలేకపోయింది.



Next Story

Most Viewed