అమ్మాయిలు అదుర్స్.. డబ్ల్యూపీఎల్ టికెట్స్ ఖతం

by Disha Web Desk 1 |
అమ్మాయిలు అదుర్స్.. డబ్ల్యూపీఎల్ టికెట్స్ ఖతం
X

దిశ, వెబ్ డెస్క్: మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్ లో భాగంగా నేడు రాత్రి 7.30 గంటలకు తొలి మ్యాచ్ జరుగనుంది. బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న లీగ్ ను విజయవంతం చేసేందుకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే, అమ్మాయిల మ్యాచ్ చూడటానికి ప్రేక్షకులు స్టేడియాలకు వస్తారా.. లేదా..? అన్న అనుమానం బోర్డు పెద్దలను వెంటాడుతున్న వేళ బీసీసీఐకి ఆ బెంగ తీరింది. తొలి మూడు రోజుల పాటు ఈ లీగ్ లో ఆడే మ్యాచ్ లకు టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. ఐదు జట్లు పాల్గొంటున్న ఈ సీజన్ లో తొలి మూడు రోజుల్లోనే ఆ టీమ్ లు ప్రత్యర్థి జట్లను ఎదుర్కోవాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో ప్రేక్షకులు కూడా డబ్ల్యూపీఎల్ లో తొలిసారిగా తమ అభిమాన ఆటగాళ్ల ఆటను ప్రత్యక్షంగా చూసేందుకు ఎగబడుతున్నారు. ఈ లీగ్ లో నేడు ముంబై - గుజరాత్ మధ్య మ్యాచ్ జరుగనుండగా, రేపు ఆదివారం బెంగళూరు - ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్-గుజరాత్ జట్లు తలపడనున్నాయి. ఇక సోమవారం ముంబై - బెంగళూరు మ్యాచ్ జరగనుండగా మొత్తం మూడు రోజులకూ గాను మ్యాచ్ టికెట్లు మొత్తం అమ్ముడుపోయాయి. డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ ను విజయవంతం చేసేందుకు బీసీసీఐ టికెట్ రేట్లను రూ.100, రూ.250, రూ.400 గా కేటాయించిన విషయం తెలిసిందే.ఇక అమ్మాయిలు, మహిళలకైతే ఎంట్రీ ఉచితం.

కాగా, నేడు, రేపు వారాంతపు సెలవులు కావడంతో మైదానాలు పూర్తిగా నిండనున్నాయి. అయితే, ఆశ్చర్యకరంగా సోమవారం ముంబై - బెంగళూరు మ్యాచ్ కు కూడా టికెట్లు అమ్ముడైపోవడం గమనార్హం. ఐపీఎల్ లో ఫ్రాంచైజీలకు ఉన్న బ్రాండ్ వాల్యూ.. టికెట్ రేట్ల తగ్గింపు.. మహిళలకు ఉచిత ప్రవేశం.. కారణాలేవైనా స్టేడియాలు నిండితే అది బీసీసీఐతో పాటు ఆడే ఆటగాళ్లకూ మంచిదే. సాధారణంగా ఐపీఎల్ లో ముంబై - చెన్నై మ్యాచ్ తో పాటు ముంబై-బెంగళూరు మ్యాచ్ కూ క్రేజ్ ఉంటుంది. ఈ రెండు జట్లలో కావాల్సినంత మంది స్టార్ ఆటగాళ్లు.. లెక్కకు మిక్కిలి వినోదం ముంబై - బెంగళూరు మ్యాచ్ లకు సొంతం. ఇప్పుడు డబ్ల్యూపీఎల్ లో కూడా ఇదే క్రేజ్ రిపీట్ అవుతుండటం గమనార్హం.

Next Story

Most Viewed