Khalid Latif: పాక్ మాజీ క్రికెటర్‌‌కు బిగ్ షాక్.. 12 ఏళ్ల జైలు శిక్ష విధించిన డచ్ కోర్టు

by Disha Web Desk 13 |
Khalid Latif: పాక్ మాజీ క్రికెటర్‌‌కు బిగ్ షాక్.. 12 ఏళ్ల జైలు శిక్ష విధించిన డచ్ కోర్టు
X

న్యూఢిల్లీ : పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఖలీద్ లతీఫ్‌కు నెదర్లాండ్స్ కోర్టు 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది. డచ్ ఎంపీ గీర్ట్ వైల్డర్స్ హత్యకు ప్రేరేపించిన కేసులో కోర్టు సోమవారం ఈ తీర్పునిచ్చింది. 2018లో గీర్ట్ వైల్డర్స్ మహ్మద్ ప్రవక్త మీద కార్టూన్స్ గీసిన వారికి భారీ ప్రైజ్ మనీ ఇస్తానని ఓ పోటీని నిర్వహించడానికి సిద్ధమయ్యాడు. దాంతో వైల్డర్స్‌పై ముస్లిం దేశాలు భగ్గుమన్నాయి. ఈ క్రమంలోనే విల్డర్స్‌ను హత్య చేసిన వారికి 21 వేల యూరోలు ఇస్తానని లతీఫ్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశాడు. ఇది అప్పట్లో పెను దుమారం రేపింది.

ముస్లిం దేశాల నుంచి నిరసనల నేపథ్యంలో విల్డర్స్‌ ఆ పోటీని విరమించుకున్నాడు. అయితే, విల్డర్స్ హత్యకు పిలుపునిచ్చిన లతీఫ్‌పై డచ్ కోర్టులో కేసు నమోదైంది. విచారణకు రావాలని లతీఫ్‌కు నోటీసులు పంపించినప్పటికీ అతను హాజరుకాలేదు. లతీఫ్ గైర్హాజరులోనే విచారణ చేపట్టిన డచ్ కోర్టు.. తాజాగా అతనికి 12 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. దీనిపై పాకిస్తాన్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. కాగా, పాకిస్తాన్ తరఫున లతీఫ్ 5 వన్డేలు, 13 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.


Next Story

Most Viewed