రిబాకినా ఔట్.. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అన్నా బ్లింకోవా సంచలనం

by Dishanational3 |
రిబాకినా ఔట్.. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అన్నా బ్లింకోవా సంచలనం
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియన్ ఓపెన్‌ ఆరంభంలోనే సంచలనాలు నమోదవుతున్నాయి. ఉమెన్స్ సింగిల్స్‌లో 3వ సీడ్ ఎలెనా రిబాకినా, 2021 యూఎస్ ఓపెన్ చాంపియన్ ఎమ్మా రాడుకాను, 5వ సీడ్ జెస్సికా పెగులా రెండో రౌండ్‌లోనే ఇంటిదారిపట్టారు. మెన్స్ సింగిల్స్‌లో 8వ సీడ్ హోల్గర్‌ రూనెకూ రెండో రౌండ్‌లో ఓటమి తప్పలేదు. ఇక, ఉమెన్స్ సింగిల్స్‌లో వరల్డ్ నం.1 ఇగా స్వైటెక్, మెన్స్ సింగిల్స్‌లో 2వ సీడ్ అల్కరాజ్ మూడో రౌండ్‌కు దూసుకెళ్లారు.

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రష్యా క్రీడాకారిణి అన్నా బ్లింకోవా సంచలనం సృష్టించింది. రెండో రౌండ్‌లో గత ఎడిషన్ ఫైనలిస్ట్, 2022 వింబుల్డన్ చాంపియన్ రిబాకినాను మట్టికరిపించింది. గురువారం జరిగిన ఉమెన్స్ సింగిల్స్‌ రెండో రౌండ్‌లో రిబాకినా‌ను 4-6, 6-4, 6-7(20-22) తేడాతో బ్లింకోవా ఓడించింది. రెండు గంటల 46 నిమిషాలపాటు రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లో మూడో సెట్‌ను బ్లింకోవా టై బ్రేకర్‌లో గెలుచుకోవడంతో ఆమె విజయం ఖాయమైంది. ఈ మ్యాచ్‌లో బ్లింకోవా మొదటి నుంచి పట్టుదలతో ఆడిన ఆమె తొలి సెట్‌ను గెలుచుకుని శుభారంభం చేసింది. అదే జోరును రెండో సెట్‌లోనూ కనబర్చింది. అయితే, రిబాకినా పుంజుకోవడంతో రెండో రౌండ్‌లో ఆమెకు షాక్ తప్పలేదు. మొదట్లో బ్లింకోవా 2-1తో ఆధిక్యంలో ఉండగా.. 4వ గేమ్‌లో రిబాకినా బ్రేక్ పాయింట్ సాధించి పోటీలోకి వచ్చింది. ఆ తర్వాత పోటాపోటా సాగిన ఆ సెట్‌ను రిబాకినా 10వ గేమ్‌లో బ్లింకోవా సర్వీస్‌ను బ్రేక్ చేసి దక్కించుకుంది. ఇక, నిర్ణయాత్మక మూడో సెట్‌లోనూ ఇద్దరు హోరాహోరీగా తలపడ్డారు. 12వ గేమ్‌లో బ్లింకోవా సర్వీస్‌ను రిబాకినా బ్రేక్ చేసి మూడో సెట్‌ను టై బ్రేకర్‌కు మళ్లించింది. అయితే, సుదీర్ఘంగా సాగిన టై బ్రేకర్‌లో బ్లింకోవానే పైచేయి సాధించి మ్యాచ్‌ను దక్కించుకుంది. దీంతో రిబాకినాకు నిరాశ తప్పలేదు. గ్రాండ్‌స్లామ్‌లోనే ఇది లాంగెస్ట్ టై బ్రేకర్‌‌గా నిలిచింది. మరో మ్యాచ్‌లో 5వ సీడ్, అమెరికా స్టార్ జెస్సికా పెగులాకు ఫ్రాన్స్ క్రీడాకారిణి క్లారా బ్యూరెల్‌ షాకిచ్చింది. పెగులాపై 4-6, 2-6 తేడాతో బ్యూరెల్ అలవోకగా నెగ్గింది. 2 డబుల్ ఫౌల్ట్స్, 31 అనవసర తప్పిదాలతో పెగులా మూల్యం చెల్లించుకుంది. సర్జరీ తర్వాత రాకెట్ పట్టుకున్న ఇంగ్లాండ్ సంచలనం, 2021 యూఎస్ ఓపెన్ చాంపియన్ ఎమ్మా రాడుకాను పోరాటం రెండో రౌండ్‌లోనే ముగిసింది. చైనాకు చెందిన వాంగ యాఫాన్ చేతిలో 6-4, 4-6, 6-4 తేడాతో పరాజయం పాలైంది.

స్వైటెక్, అల్కరాజ్ జోరు

తొలి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌పై కన్నేసిన ఉమెన్స్ సింగిల్ వరల్డ్ నం.1, నాలుగు గ్రాండ్‌స్లామ్స్ విజేత ఇగా స్వైటెక్(పొలాండ్) టోర్నీలో జోరు ప్రదర్శించింది. తాజాగా ఆమె మూడో రౌండ్‌కు చేరుకుంది. రెండో రౌండ్‌లో స్వైటెక్ 6-4, 3-6, 6-4 తేడాతో అమెరికా క్రీడాకారిణి డేనియల్ కాలిన్స్‌పై విజయం సాధించింది. 3 గంటల 14 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో స్వైటెక్ మూడో సెట్‌లో మ్యాచ్‌ను దక్కించుకుంది. స్వైటెక్ విన్నర్లతో విరుచుకుపడి ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. ఆమె 36 విన్నర్లు, ఒక ఏస్ బాదింది. మరోవైపు, మెన్స్ సింగిల్స్‌లో టైటిల్ ఫేవరెట్ అల్కరాజ్(స్పెయిన్) కూడా దూకుడు కొనసాగిస్తున్నాడు. అయితే, ఇటలీ ఆటగాడు లొరెంజ్ సొనెగో అద్భుతమైన పోరాటంతో రెండో రౌండ్‌‌ దాటడానికి అల్కరాజ్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. 3 గంటల 25 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో సొనెగో‌పై 4-6, 7-6(7-3), 3-6, 6-7(3-7) తేడాతో విజయం సాధించాడు. రెండు సెట్లు ట్రై బ్రేకర్‌కు వెళ్లడం గమనార్హం. నిర్ణయాత్మక నాలుగో సెట్‌ను అల్కరాజ్ టై బ్రేకర్‌లో నెగ్గడంతో మ్యాచ్‌ దక్కింది. అల్కరాజ్ 12 ఏస్‌లు, 43 విన్నర్లు బాదాడు. అల్కరాజ్ 34 అనవసర తప్పిదాలు చేస్తే.. సొనెగో 48 తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. 6వ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్, 11వ సీడ్ రూడ్ టోర్నీ‌లో మూడో రౌండ్‌కు చేరుకున్నారు. అయితే, 8వ సీడ్ హోల్గర్ రూనె(డెన్మార్క్)కు నిరాశే ఎదురైంది. రెండో రౌండ్‌లో ఫ్రాన్స్ ప్లేయర్ ఆర్థర్ కాజాక్స్ చేతిలో 7-6(7-4), 6-4, 4-6, 6-3 చేతిలో రూనె ఓడిపోయి టోర్నీ నుంచి నిష్ర్కమించాడు.

Next Story