ధోనీ మ్యాచ్‌లకు ఎందుకు హాజరుకావడం లేదో తెలుసా?.. కారణం చెప్పిన సీఎస్కే కోచ్

by Harish |

ధోనీ మ్యాచ్‌లకు ఎందుకు హాజరుకావడం లేదో తెలుసా?.. కారణం చెప్పిన సీఎస్కే కోచ్
X

దిశ, స్పోర్ట్స్ : చెన్నయ్ సూపర్ కింగ్స్(సీఎస్కే) దిగ్గజ బ్యాటర్ ఎం.ఎస్ ధోనీ గాయం కారణంగా ఈ సీజన్‌కు ఇంకా అందుబాటులోకి రాలేదు. సీఎస్కే మ్యాచ్‌లకు కూడా అతను హాజరుకాకపోవడంతో అతన్ని చూడాలన్న ఫ్యాన్స్ కోరిక కూడా నెరవేరడం లేదు. ధోనీ వేదికల వద్దకు ఎందుకు రావడం లేదన్న సందేహం అభిమానుల్లో ఉంది. దీనికి సీఎస్కే బ్యాటింగ్ కోచ్ మైకేల్ హస్సీ సమాధానమిచ్చాడు. తన వల్ల జట్టుకు ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతోనే ధోనీ మ్యాచ్‌లకు హాజరు కావడం లేదని తెలిపాడు. శుక్రవారం హస్సీ మీడియాతో మాట్లాడుతూ.. ‘జట్టుకు ఎల్లప్పుడు మంచి జరగాలని కోరుకునే వ్యక్తి ధోనీ. అతను వస్తే జట్టుకు ఇబ్బంది కలుగుతుందని ధోనీ అనుకుంటున్నాడు. కెమెరాలన్నీ అతనిపైనే ఉంటాయి. ప్రేక్షకులు ధోనీ.. ధోనీ అంటూ అరుస్తుంటారు. జట్టు తన పని తాను చేసుకోవాలన్నది అతను కోరుకుంటాడు. మ్యాచ్‌లకు అతను రాకపోవడం వెనుక ఉన్న ఆలోచన ఇదే.’అని తెలిపాడు. ట్రైనింగ్‌లో ధోనీ ఉత్సాహంగా ఉంటాడని, తన అనుభవాన్ని తోటి ప్లేయర్లకు పంచుతాడని చెప్పాడు. కానీ, తన వల్ల మిగతా జట్టు సభ్యులకు ఆటంకం కలగకూడదనేది అతని ఆలోచన అని, అందుకే మ్యాచ్ రోజు దూరంగా ఉంటాడని తెలిపాడు. ఈ సందర్భంగా ధోనీ ఫ్యాన్స్‌కు హస్సీ గుడ్ న్యూస్ చెప్పాడు. ధోనీ త్వరలోనే మైదానంలోకి అడుగుపెడతాడని హస్సీ చెప్పాడు. అతను బాగానే కోలుకుంటున్నాడని, రేపటి మ్యాచా? లేదా ఆ తర్వాతి మ్యాచా? తెలియదు గానీ.. అతను ఎంట్రీ ఇవ్వడం చాలా దూరంలో లేదన్నాడు.


Next Story