వార్నర్ విధ్వంసం.. కోహ్లీ రికార్డు సమం

by Harish |

వార్నర్ విధ్వంసం.. కోహ్లీ రికార్డు సమం
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ బిగ్‌బాష్ లీగ్‌లో మెరుపు శతకంతో కదం తొక్కాడు. సిడ్నీ థండర్స్‌కు ఆడుతున్న అతను శనివారం హోబర్ట్ హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 56 బంతుల్లోనే సెంచరీ బాదాడు. మొత్తంగా 65 బంతుల్లో 130 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బీబీఎల్‌‌లో అతను 14 ఏళ్ల తర్వాత సెంచరీ చేయడం గమనార్హం. టీ20 క్రికెట్‌లో అతనికిది 9వ శతకం. దీంతో అతను విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు. టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ల జాబితాలో కోహ్లీ(9 సెంచరీలు) మూడో స్థానంలో ఉండగా వార్నర్ తాజాగా అతని సరసన చేరాడు. అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు క్రిస్ గేల్(22) పేరిట ఉంది. అయితే, వార్నర్ మెరుపు‌లు సిడ్నీ థండర్స్‌ను గెలిపించలేకపోయాయి. వార్నర్ విధ్వంసంతో సిడ్నీ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 205/4 భారీ స్కోరు చేసినప్పటికీ లక్ష్యాన్ని కాపాడులేకపోయింది. హోబర్ట్ హరికేన్స్ 17.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఫినిష్ చేసింది. ఛేదనలో టిమ్ వార్డ్(90) దూకుడుకుతోడు మిచెల్ ఓవెన్(45) ధనాధన్ ఆట తోడవడంతో హోబర్ట్ హరికేన్స్ విజయం తేలికైంది.


Next Story