ట్రోఫీ నీ సొత్తా?.. హోటల్‌ రూంకు ఎలా తీసుకెళ్లావ్?

by Phanindra |

మంగళవారం జరిగిన ఏసీసీ మీటింగ్ వేడెక్కింది. ఆసియా కప్ ట్రోఫీని మొహ్‌సిన్ నఖ్వీ తీసుకెళ్లడంపై బీసీసీఐ మండిపడింది. ట్రోఫీ నీ సొత్తా? అంటూ నిలదీసింది.

ట్రోఫీ నీ సొత్తా?.. హోటల్‌ రూంకు ఎలా తీసుకెళ్లావ్?
X

దిశ, స్పోర్ట్స్: ఆసియా కప్ ట్రోఫీని తనతో తీసుకెళ్లిపోవడంపై ఏసీసీ, పీసీసీ చీఫ్ మొహ్‌సిన్ నఖ్వీపై బీసీసీఐ తీవ్రమైన ఆగ్రహం వ్యక్తంచేసింది. మంగళవారం జరిగిన ఏసీసీ సమావేశంలో బీసీసీఐ తరఫున పాల్గొన్న రాజీవ్ శుక్లా, ఆశిష్ షేలార్ ఇద్దరూ కూడా ట్రోఫీ అంశంలో నఖ్వీని టార్గెట్ చేశారు. ఆసియా కప్ గెలిచిన భారత టీంకు ట్రోఫీ ఇవ్వాల్సిందేనని, దాన్ని నఖ్వీ తనతో తీసుకెళ్లిపోవడం ఏంటని వాళ్లు ప్రశ్నించారు. ఈ ట్రోఫీని నఖ్వీ తన హోటల్ రూంకు తీసుకెళ్లిపోవడంపై నిప్పులు చెరిగిన బీసీసీఐ ప్రతినిధులు.. ట్రోఫీ ఏసీసీకి చెందినదని, నఖ్వీ సొంత సొత్తు కాదని విమర్శించారు. అసలు విజేతలకు ఆయన కంగ్రాచ్యులేషన్స్ కూడా చెప్పలేదని మండిపడ్డారు.

ఈ క్రమంలో భారత్‌కు శుభాకాంక్షలు తెలిపిన నఖ్వీ.. ట్రోఫీ విషయంలో మాత్రం వెనక్కు తగ్గేది లేదన్నాడట. ప్రెజెంటేషన్ సెర్మనీలో తనను ఒక జోకర్‌లా టీమిండియా మార్చేసిందని ఆయన కోప్పడినట్లు సమాచారం. తన నుంచి ట్రోఫీ తీసుకోవడం జరగదనే విషయాన్ని భారత జట్టు తమకు రాసివ్వలేదన్నాడు. అయితే ఏం జరిగినా సరే ట్రోఫీ మాత్రం విజేతలదేనని, కావాలంటే ఏసీసీ ఆఫీసు నుంచి తామే దాన్ని తీసుకెళ్తామని బీసీసీఐ ప్రతినిధులు తేల్చిచెప్పారు. దీనికి నిరాకరించిన నఖ్వీ.. ఈ అంశంపై చర్చ జరగాల్సిందేనని, అయితే ఈ సమావేశంలో ఆ విషయాన్ని చర్చించడం కుదరదని అన్నాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీసీఐ.. ఈ విషయంలో నఖ్వీపై ఐసీసీకి ఫిర్యాదు చేస్తామని, ఆయన తీరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టంచేసింది.

Next Story