మహిళా క్రికెటర్ల కాంట్రాక్టును విడుదల చేసిన బీసీసీఐ.. పురుషుల వేతనాల కంటే భారీ తేడా!

by Disha Web Desk 13 |
మహిళా క్రికెటర్ల కాంట్రాక్టును విడుదల చేసిన బీసీసీఐ.. పురుషుల వేతనాల కంటే భారీ తేడా!
X

దిశ, వెబ్‌డెస్క్: బీసీసీఐ 2022-23 సీజన్ కోసం మహిళా క్రికెటర్ల కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను విడుదల చేసింది. ఇందులో 17 మంది ప్లేయర్లకు చోటు దక్కింది. ఈ 17 మందిని మూడు వేర్వేరు గ్రేడ్‌లలో ఉంచారు. టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, ఆల్ రైండర్ దీప్తి శర్మకు ‘ఏ’ గ్రేడ్ కాంట్రాక్ట్ దక్కింది. గ్రేడ్ ‘బీ’ కాంట్రాక్టు ఐదుగురికి దక్కింది. పేసర్ రేణుకా సింగ్, బ్యాటర్లు జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, రిచా ఘోష్, స్పిన్నర్ రాజేశ్వర్ గైక్వాడ్ ఇందులో ఉన్నారు.

ఇక గ్రేడ్ ‘సీ’లో 9 మంది ఉన్నారు. సబ్బినేని మేఘన, అంజలి సర్వాని, మేఘనా సింగ్, దేవికా వైద్య, పూజా వస్త్రాకర్, స్నేహ రాణా, రాధా యాదవ్, హర్లీన్ డియోల్, యస్తికా భాటియా ఉన్నారు. వీరిలో సబ్బినేని మేఘన, అంజలి.. తెలుగు క్రికెటర్లు. అయితే నెల రోజుల క్రితం పురుషుల కోసం కూడా కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను బీసీసీఐ విడుదల చేసింది. ఆ జాబితాలో 26 మంది ఆటగాళ్లను నాలుగు గ్రేడ్‌లలో ఉంచారు. పురుష, మహిళా క్రికెటర్ల ఈ గ్రేడ్‌ల మధ్య వేతనంలో భారీ వ్యత్యాసం ఉంది. రెండు కాంట్రాక్టు జాబితాలలో టాప్ గ్రేడ్‌ను మాత్రమే పోల్చినట్లయితే.. ఏకంగా 14 రెట్లు తేడా ఉంటుంది.

టాప్ గ్రేడ్‌లో 6.50 కోట్ల వ్యత్యాసం..

మహిళా క్రికెటర్ల 'గ్రేడ్ ఏ'లో ఉన్న ప్లేయర్లకు బీసీసీఐ ఏటా రూ. 50 లక్షలు చెల్లిస్తుంది. మరోవైపు పురుష క్రికెటర్ల 'గ్రేడ్ A+'లో ఉన్న ఆటగాళ్ల వార్షిక వేతనం రూ. 7 కోట్లుగా ఉంది.

రెండో గ్రేడ్‌లో 16 రెట్ల కంటే ఎక్కువ గ్యాప్..

మహిళా క్రికెటర్ల 'గ్రేడ్ బి' క్రీడాకారిణుల వార్షిక వేతనం రూ. 30 లక్షలు. అదే సమయంలో పురుష క్రికెటర్ల సెకండ్ గ్రేడ్‌లో అంటే 'గ్రేడ్ A'లో ప్రతి క్రీడాకారుడికి ఏటా రూ. 5 కోట్లు ఇస్తారు. అంటే ఇక్కడ 16 రెట్ల కంటే ఎక్కువ దూరం ఉంది.

మూడో గ్రేడ్‌లో తేడా ఏకంగా 30 రెట్లు..

మహిళా క్రికెటర్ల 'గ్రేడ్ సి'లో ఉన్న క్రీడాకారిణుల వార్షిక వేతనం కేవలం రూ.10 లక్షలుగా ఉంది. మరోవైపు పురుషులు మూడో గ్రేడ్‌లో అంటే 'గ్రేడ్ B'లో రూ. 3 కోట్లు పొందుతారు. అంటే ఇక్కడ ఇద్దరి వేతనంలో 30 రెట్లు తేడా ఉంది. పురుష క్రికెటర్లలో నాలుగో గ్రేడ్ కూడా ఉంది. 'గ్రేడ్ సి'లో చేర్చబడిన క్రికెటర్లు సంవత్సరానికి రూ. కోటి వార్షిక వేతనం పొందుతారు. అయితే మహిళా క్రికెటర్లలో నాలుగో గ్రేడ్ ఉంచలేదు.


Next Story

Most Viewed