జకోకు షాక్.. సెమీస్‌లో దిగ్గజానికి చుక్కలు చూపించిన సిన్నర్

by Dishanational5 |
జకోకు షాక్.. సెమీస్‌లో దిగ్గజానికి చుక్కలు చూపించిన సిన్నర్
X

దిశ, స్పోర్ట్స్ : 24 గ్రాండ్‌స్లామ్స్ విజేత, పురుషుల సింగిల్స్ వరల్డ్ నం.1 నోవాక్ జకోవిచ్‌కు షాక్. 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో నయా చరిత్ర సృష్టించాలనుకున్న ఈ సెర్బియా దిగ్గజానికి సెమీస్‌లో బ్రేక్ పడింది. అతని ఆశలపై ఇటలీ స్టార్ జెన్నిక్ సిన్నర్ నీళ్లుచల్లాడు. శుక్రవారం జరిగిన సెమీస్‌లో సిన్నర్ 6-1, 6-2, 6-7(6-8), 6-3 తేడాతో జకోను మట్టికరిపించాడు. దీంతో డిఫెండింగ్ చాంపియన్ జకోవిచ్ సెమీస్‌లో ఇంటిదారిపట్టగా.. మరోవైపు, సిన్నర్ తన కెరీర్‌లో తొలిసారిగా ఓ గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు.

టోర్నీలో వరుస విజయాలతో టైటిల్ నిలబెట్టుకునే దిశగా సాగిన జకోవిచ్ సెమీస్‌లో తన స్థాయి ప్రదర్శన చేయలేకపోయాడు. మూడో సెట్‌ను దక్కించుకోవడం మినహా అతను సిన్నర్‌కు పెద్దగా పోటీనిచ్చినట్టు కనిపించలేదు. మరోవైపు, సిన్నర్ మొదటి నుంచి ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. 3 గంటల 22 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో సిన్నర్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. 7 గేమ్‌ల్లోనే తొలి సెట్‌ను దక్కించుకున్న అతను.. రెండుసార్లు జకో సర్వీస్‌లను బ్రేక్ చేశాడు. ఈ సెట్‌లో జకో ఒక్క గేమ్ మాత్రమే నెగ్గడం గమనార్హం. రెండో సెట్‌లోనూ అదే జోరు ప్రదర్శించిన సిన్నర్ 3వ, 7వ గేమ్‌ల్లో బ్రేక్ పాయింట్ పొంది సెట్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక, మూడో సెట్‌లో జకో పుంజుకుని పోరాడాడు. మరోవైపు, సిన్నర్ సైతం వెనక్కి తగ్గకపోవడంతో సెట్ హోరాహోరీగా సాగింది. 11వ గేమ్ నెగ్గి జకో సెట్‌పై కన్నేయగా.. 12వ గేమ్‌తో సిన్నర్ మూడో సెట్‌ను టైబ్రేకర్‌కు మళ్లించాడు. అయితే, అక్కడ జకోనే పైచేయి సాధించి మ్యాచ్‌లో పుంజుకున్నాడు. మూడో సెట్ 76 నిమిషాలపాటు సాగడం గమనార్హం. ఇక, నాలుగో సెట్‌లోనూ ఆసక్తికర పోరు తప్పదని అంతా అనుకున్నారు. కానీ, సిన్నర్ ఏకపక్షం చేశాడు. వరుసగా 3, 4, 5 గేమ్‌ల్లో నెగ్గి 4-1 ఆధిక్యంలోకి వెళ్లాడు. అనంతరం జకో రెండుసార్లు సర్వీస్‌లను కాపాడుకుని పోటీలోకి వచ్చినప్పటికీ 9వ గేమ్‌ను గెలుచుకోవడంతో సిన్నర్ విజయం లాంఛనమైంది. దీంతో గతేడాది ఏటీపీ టూర్ ఫైనల్స్‌ టైటిల్ పోరులో ఓటమికి సిన్నర్ ప్రతీకారం తీర్చుకున్నాడు.

కాగా, గతేడాది యూఎస్ ఓపెన్ విజేతగా నిలవడంతో 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన జకోవిచ్.. టెన్నిస్‌లో ఏ విభాగంలోనైనా అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ నెగ్గిన ఆస్ట్రేలియా దిగ్గజం మార్గరెట్ కోర్ట్‌(24) రికార్డును సమం చేశాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచి 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో అత్యధిక గ్రాండ్‌స్లామ్ నెగ్గిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాలనుకున్నాడు జకో. అదే లక్ష్యంతో టోర్నీలో అడుగుపెట్టిన అతను ఆ దిశగానే అడుగులు వేశాడు. అయితే, సెమీస్‌లో అతనికి సిన్నర్ షాకివ్వడంతో జకో ఆశలు చల్లాచెదురయ్యాయి. ఇక, ఫ్రాన్స్‌లో మే-జూన్‌లో జరగబోయే ఫ్రెంచ్ ఓపెన్‌లో జకో తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంటాడో లేదో చూడాలి.


Next Story

Most Viewed