7ఏళ్ల బుడ్డోడు అద్భుతం చేశాడు.. పాక్ జలసంధిని ఈదిన ఇషాంక్ సింగ్

by Harish |

7ఏళ్ల బుడ్డోడు అద్భుతం చేశాడు.. పాక్ జలసంధిని ఈదిన ఇషాంక్ సింగ్
X

దిశ, స్పోర్ట్స్ : 7 ఏళ్ల వయసు ఉన్న పిల్లలు సాధారణంగా ఇప్పుడిప్పుడే బడిబాట పడుతుంటారు. వీధుల్లో చిన్న చిన్న ఆటలు ఆడుతుంటారు. కానీ, సముద్రంలో 29 కిలోమీటర్లు ఈదడమంటే అద్భుతమే. జార్ఖండ్‌లోని రాంచీకి చెందిన ఇషాంక్ సింగ్ ఈ అద్భుతమే చేశాడు. ఏప్రిల్ 30న 7 ఏళ్ల ఇషాంక్ సింగ్ భారత్, శ్రీలంక మధ్య ఉన్న పాక్ జలసంధిని ఈదాడు. కేవలం 9 గంటల 50 నిమిషాల్లోనే పూర్తి చేశాడు. పాక్ జలసంధిని ఈదిన అత్యంత పిన్క వయస్కుడిగా ఇషాంక్ సింగ్ చరిత్ర సృష్టించాడు. బలమైన ప్రవాహాలు, సముద్రపు అలలు, అనూహ్యమైన వాతావరణం కారణంగా ఈ జలసంధి సవాల్‌తో కూడిన జలమార్గంగా ప్రసిద్ధి చెందింది. కానీ, ఇషాంక్ ఈ అడ్డంకులను దాటాడు. తమిళనాడులోని ధనుష్కోడి, శ్రీలంకలోని తలైమన్నార్ మధ్య ఈదాడు. ఉదయం 4 గంటలకు ప్రారంభించి మధ్యాహ్నం 1:50 గంటలకు ఈదడం పూర్తి చేశాడు.

రాంచీలోని ధుర్వాకు చెందిన ఇషాంక్ 3వ తరగతి చదువుతున్నాడు. ధుర్వా డ్యామ్‌లో కోచ్‌లు అమన్ కుమార్ జైశ్వాల్, బజరంగ్ కుమార్ పర్యవేక్షణలో ఇషాంక్ ప్రతి రోజు 4-5 గంటలు శిక్షణ పొందాడు. స్విమింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి కఠిన ప్రణాళికలను అనుసరించాడు. పాక్ జలసంధిని ఈదిన ఇషాంక్‌ను జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్రశంసించారు. ‘ఇషాంక్‌ విజయం క్రమశిక్షణకు, తన లక్ష్యంపై ఉన్న అంకితభావానికి అద్భుతమైన ఉదాహరణ. అతను జార్ఖండ్‌కే కాదు యావత్ దేశానికి గర్వకారణంగా నిలిచాడు.’అని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. పాక్ జలసంధిని దాటిన ‘అతిపిన్క వయస్కుడిగా, వేగవంతమైన స్విమ్మర్’ ఇషాంక్‌ను యూనివర్సల్ రికార్డ్స్ ఫోరమ్ గుర్తించింది. ఇంతకుముందు ఈ ఘనత తమిళనాడుకు చెందిన జై జశ్వంత్ పేరిట ఉండేది. అతను 10 ళ్ల వయసులో 2019‌లో 10 గంటల 30 నిమిషాల్లో ఈ ఘనత సాధించాడు.


Next Story