వామ్మో.. మాంచెస్టర్.. టీమిండియాను భయపెడుతున్న నాలుగో టెస్టు స్టేడియం.. ఎందుకో తెలుసా?

by Harish |

టీమిండియా కీలక పోరుకు సిద్ధమవుతోంది. బుధవారం నుంచి నాలుగో టెస్టు మొదలుకానుంది.

వామ్మో.. మాంచెస్టర్.. టీమిండియాను భయపెడుతున్న నాలుగో టెస్టు స్టేడియం..  ఎందుకో తెలుసా?
X

దిశ, స్పోర్ట్స్ : టీమిండియా కీలక పోరుకు సిద్ధమవుతోంది. బుధవారం నుంచి నాలుగో టెస్టు మొదలుకానుంది. ఈ మ్యాచ్‌ భారత్‌కు డూ ఆర్ డైలాంటింది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇప్పటివరకు జరిగిన మూడు టెస్టుల్లో ఒక్క విజయంతో గిల్ సేన 2-1‌తో వెనుకబడింది. నాలుగో టెస్టులో ఓడితే సిరీస్ ఆశలు గల్లంతవుతాయి. సిరీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే గెలవడం తప్ప మరో మార్గం లేదు. ఈ పరిస్థితి సాధారణంగానే భారత్‌పై ఒత్తిడి పెంచుతోంది. మరో విషయం కూడా గిల్ సేనను ఆందోళనకు గురిచేస్తుంది. అదేంటంటే నాలుగో టెస్టుకు ఆతిథ్యమివ్వబోతున్న స్టేడియం. మాంచెస్టర్‌‌లోని ఓల్డ్ ట్రాఫోర్డు స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఆ మైదానం టీమిండియాకు ఇప్పటివరకు అచ్చిరాలేదు. గత రికార్డులను చూసి అభిమానులు కూడా వామ్మో.. మాంచెస్టరా? అని ఆందోళన పడుతున్నారు.

ఒక్కసారీ గెలవాలె

మాంచెస్టర్ స్టేడియంలో భారత్‌ది పేలవ రికార్డు. ఈ మైదానంలో టీమిండియాకు విజయం అందని ద్రాక్షగానే ఉంది. ఇప్పటివరకు అక్కడ విజయం రుచిచూడలేదు. ఆ స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ జట్లు ఇప్పటివరకు మొత్తం 9 టెస్టులు ఆడాయి. అందులో ఇంగ్లాండ్ నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచింది. మరో ఐదు టెస్టులు డ్రా అయ్యాయి. మాంచెస్టర్‌లో 2014లో చివరిసారిగా ఇరు జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో టీమిండియా చిత్తుగా ఓడింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 54 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. 11 ఏళ్ల తర్వాత మాంచెస్టర్‌లో భారత్, ఇంగ్లాండ్ జట్లు ఎదురుపడబోతున్నాయి.

మాంచెస్టర్‌లోనూ అద్భుతం చేస్తారా?

మాంచెస్టర్ రికార్డులు భారత్‌ను కలవరపెడుతున్నా ఎడ్జ్‌బస్టన్ విజయం ఆత్మవిశ్వాసం నింపేదే. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బస్టన్‌లో కూడా ఇంతకుముందు భారత్ గెలవలేదు. కానీ, ఈ పర్యటనలో ఆ చెత్త రికార్డుకు తెరపడింది. ఎడ్జ్‌బస్టన్‌లో చారిత్రాత్మక విజయం సాధించిన విషయం తెలిసిందే. అక్కడ జరిగిన రెండో టెస్టులో భారత్ 336 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మాంచెస్టర్‌లోనూ అద్భుతం చేయాలని భారత్ ఉవ్విళ్లూరుతున్నది. మరి, ఇంగ్లాండ్ కంచుకోటను బద్దలుకొడుతుందో లేదో చూడాలి.

ఒకే ఒక్కడు

మాంచెస్టర్‌లో 11 ఏళ్ల తర్వాత భారత్ ఆడబోతుంది. 2014లో చివరిసారిగా ఆడింది. అప్పటి భారత జట్టు నుంచి ఒకే ఒక్క ప్లేయర్ మాత్రమే ప్రస్తుత జట్టులోనూ ఉన్నాడు. అతను మరెవరో కాదు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా. కోహ్లీ, ధోనీ, అశ్విన్, మురళీ విజయం రిటైర్మెంట్ ప్రకటించగా.. అప్పటి మ్యాచ్‌లో ఉన్న పుజారా, రహానే, భువనేశ్వర్ ప్రస్తుతం జట్టులో లేరు. జడేజా మినహా మిగతా వారు మాంచెస్టర్‌లో తొలిసారిగా ఆడబోతున్నారు. జడేజాతోపాటు అప్పటి జట్టులో ఉన్న మరో ప్లేయర్ కూడా ప్రస్తుతం భారత జట్టుతో ఉన్నాడు. అతనే గౌతమ్ గంభీర్. అప్పుడు ప్లేయర్‌గా జట్టును గెలిపించలేకపోయినా అతను ఇప్పుడు హెడ్ కోచ్‌గా భారత్ విజయానికి వ్యూహాలు రచించనున్నాడు.

పేసర్లకు పండగే

ఇంగ్లాండ్‌లోని మిగతా పిచ్‌‌ల మాదిరిగానే ఓల్డ్ ట్రాఫోర్డు మైదానం పిచ్ పేసర్లకు అనుకూలం. గ్రీన్ టాప్ వికెట్‌పై పేసర్లు ప్రభావం చూపనున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. అలాగే, గత మ్యాచ్‌లను పరిశీలిస్తే బ్యాటింగ్‌కు బాగుంటుందని అర్థమవుతుంది. ఇక్కడ తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 336. అయితే, 2023లో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ 592 పరుగులు చేసింది. మ్యాచ్ జరుగుతున్న కొద్ది పిచ్ స్పిన్నర్లు కూడా గేములోకి వస్తారని పలు నివేదికలు అంచనా వేశాయి. భారత్ తమ తుది జట్టులోకి స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్‌ యాదవ్‌ను తీసుకొచ్చే అవకాశం లేకపోలేదు.

Next Story