మట్టిలో నడక.. మస్త్ లాభాలు

by  |
మట్టిలో నడక.. మస్త్ లాభాలు
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా మనం బయటికెళ్లినపుడు కాళ్లకు చెప్పులేసుకుంటాం. ఇంట్లోకి వచ్చే ముందు గుమ్మం దగ్గరే వదిలేస్తాం. కానీ మారుతున్న కాలంతో పాటు నడకలోనూ మార్పులొచ్చాయి. చెప్పుల్లేకుండా నడవడాన్ని అందరూ మరిచిపోయారు. ప్రస్తుతానికి ఇంట్లోనూ చెప్పులేసుకుని తిరగడం ఓ ఫ్యాషన్‌గా మారింది. ఆ సంగతి పక్కనబెడితే వాకింగ్‌కు వెళ్లేవారు దాదాపు షూస్‌ ధరిస్తారన్న విషయం తెలిసిందే. నిజానికి చెప్పులు, షూస్‌ లేకుండా నడవడం వల్లే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రోజులో కొద్దిసేపైనా పాదరక్షలు లేకుండా నడవటం వల్ల కాలి కండరాలకు ఆక్సిజన్‌ పుష్కలంగా అందడంతో పాటు అరికాలి మంటలు, నొప్పులు ఉన్నవారికి ఇది ఎంతగానో దోహదపడుతుంది.

మట్టి, ఇసుక, పచ్చికలో చెప్పులు లేకుండా నడవటం వల్ల అది మెదడును ప్రభావితం చేస్తుందట. మట్టిలో ఉన్న పాజిటివ్‌ ఎనర్జీ.. మన శరీరానికి అందుతుందని ఓ అధ్యయనంలో తేలింది. కలతలు లేని మంచి నిద్ర పోవాలన్నా.. ఒత్తిడిని తగ్గించుకోవాలన్నా ఒట్టిపాదాల నడక ఎంతో అవసరం. సిమెంట్‌ నేలపైనో, గ్రానైట్‌ రాళ్లపైనో నడవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. షూ ధరించి నడిచే వారి పాదాలపై ప్రతి అడుగుకూ మెకానికల్ స్ట్రెస్ పడుతుంది. సెన్సిటివిటీ కోల్పోవడంతో పాటు కండరాల శక్తి తగ్గుతుంది. కాబట్టి ఇంట్లో, బయట క్షణమైనా చెప్పులు విడవకుండా నడిచేవారు.. ఇకనైనా రోజులో కొద్దిసేపైనా చెప్పుల్లేకుండా నడవడం ఉత్తమం. దీనివల్ల వెన్నునొప్పి, మోకాళ్ల బాధల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.

మానవుని పాదాల్లో దాదాపు 72 వేల నరాలుంటాయి. ఎక్కువ సేపు షూ వాడడం వల్ల సున్నితమైన ఈ నరాలు చచ్చుబడిపోయే అవకాశం ఉంది. అదే చెప్పుల్లేకుండా నడిస్తే ఫ్లోర్‌కు పాదాలు ఎక్కువగా అటాచ్ అవ్వడం వల్ల బ్రెయిన్ బ్యాలెన్స్ అవుతుంది. దాంతో నాడీవ్యవస్థ మరింత చురుకుగా పనిచేస్తుంది. మన కదలికలు పాదాల్లోని కండరాలను స్థిరంగా ఉండేట్టు చేయడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. అందుకే పాదాలు, కాళ్లు, కండరాలు దృఢంగా పనిచేయాలంటే అప్పుడప్పుడూ చెప్పుల్లేకుండా నడవాల్సిందే.

Next Story

Most Viewed