ముగిసిన వేలం.. స్పెక్ట్రమ్‌ను దక్కించుకున్న ఏయిర్ టెల్

85

దిశ, వెబ్‌డెస్క్: ఐదేళ్ల తర్వాత మొదటిసారిగా దేశీయంగా టెలికాం స్పెక్ట్రం వేలం మంగళవారం ముగిసింది. ఈ స్పెక్ట్రం కోసం రూ. 77,814.80 కోట్ల బిడ్‌లు దాఖలు కాగా, అత్యధికంగా రిలయన్స్ జియో రూ. 57,122 కోట్ల బిడ్‌లను దాఖలు చేసింది. ఎయిర్‌టెల్ రూ. 18,669 కోట్ల , వొడాఫోన్ ఐడియా రూ. 1,993 కోట్ల బిడ్‌లను దాఖలు చేసింది. రూ. 18,669 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను దక్కించుకున్నట్టు భారతీ ఎయిర్‌టెల్ ఓ ప్రకటనలో తెలిపింది. సబ్ గిగాహెర్ట్జ్ కేటగిరీలో 355.45 మెగా హెర్ట్జ్ మిడ్ బ్యాండ్, 2300 మెగాహెర్ట్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను దక్కించుకున్నట్టు పేర్కొంది. దీని ద్వారా రానున్న రోజుల్లో దేశీయంగా 5జీ సేవలను అందించడానికి వీలవుతుందని, కొత్తగా 9 కోట్ల చందాదారులను చేరుకోనున్నట్టు వివరించింది.

అంతేకాకుండా ప్రతి పట్టణ ప్రాంతానికి తమ నెట్‌వర్క్ చేరుకునేందుకు ఈ స్పెక్ట్రమ్ దోహదపడనున్నట్టు కంపెనీ అభిప్రాయపడింది. అయితే, సోమవారం నాటి 700 మెగా హెర్ట్జ్ బ్యాండ్‌కు ధరలు అధికం కావడం వల్లే ఎవరూ బిడ్‌లను దాఖలు చేయలేదని ఎయిర్‌టెల్ తెలిపింది. వొడాఫోన్ సైతం ఈ స్పెక్ట్రమ్‌పై స్పందించింది. ఐదు సర్కిళ్లలో సొంతం చేసుకున్న స్పెక్ట్రం ద్వారా 4జీ కవరేజ్ సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు వీలవుతుందని ఓ ప్రకటనలో తెలిపింది. కస్టమర్లకు నాణ్యమైన డిజిటల్ సేవలను అందిస్తామని పేర్కొంది. కాగా, ఈ స్పెక్ట్రమ్‌ను 20 ఏళ్ల వరకు టెలికాం కంపెనీలు వినియోగించుకునే వీలుంటుంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..