- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అతివేగంగా హైదరాబాద్ అభివృద్ధి.. మరి జీవన నాణ్యత తగ్గుతోందా?
400 ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్.. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.

దిశ, వెబ్ డెస్క్: 400 ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్.. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. రాష్ట్రంలో భౌగోళికంగా ఉన్నతమైన స్థితి, రాజకీయంగా కేంద్ర బిందువుగా ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, మెట్రో రైలు వ్యవస్థ, రింగ్ రోడ్లు, స్మార్ట్ సిటీ మిషన్ వంటి మౌలిక సౌకర్యాలు నగర ప్రగతికి ఆధారస్తంభాలుగా నిలిచాయి. ఫలితంగా జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులను హైదరాబాద్ విశేషంగా ఆకర్షిస్తోంది. గ్లోబల్ స్థాయిలో ఐటీ, ఫార్మా, బయోటెక్, రియల్ ఎస్టేట్, స్టార్టప్ రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధిస్తోంది. గత దశాబ్ద కాలంలో హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్ వంటి ప్రాంతాలు అంతర్జాతీయ పెట్టుబడిదారులకు కేంద్రంగా మారాయి. ఇది హైదరాబాద్‌ను గ్లోబల్ ఐటీ డెస్టినేషన్‌గా నిలబెట్టింది. అయితే, ఈ మహానగరం ప్రస్తుతం వేగవంతమైన అభివృద్ధితో పాటు ఎన్నో తీవ్రమైన సవాళ్లను కూడా ఎదుర్కొంటోంది. అత్యధిక జనాభా వృద్ధి, వలసల రద్దీ, మౌలిక సదుపాయాలపై ఒత్తిడి, పర్యావరణ సమస్యలు తదితరాలు హైదరాబాద్ భవిష్యత్తుకు ప్రశ్నార్థకంగా మారింది.
వలసల హబ్‌గా హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ రోజురోజుకు అపారంగా విస్తరిస్తున్న నగరంగా మారింది. పోరాడి సాధించుకున్న తెలంగాణకు ఈ అభివృద్ధి ఒక వరంలాంటింది. అయితే, ఇప్పుడు ఇదే.. నగరంలో జనాభా తీవ్ర పెరుగుదలకు దారితీసింది. రాష్ట్రంలో ఒకే మెట్రోపాలిటన్ సిటీ అవ్వటమే కాక ఇక్కడ ఉన్న ఐటీ కంపెనీలు, ఫ్యాక్టరీలు, స్టార్టప్‌లు, నిర్మాణ రంగం వంటివి అనేక ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పరిమితంగా ఉండటం వల్ల చదువుకున్న యువత ఉద్యోగాల కోసం, చదువుకోని వారు కనీస వేతన ఉపాధి కోసం హైదరాబాద్‌ను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా హైదరాబాద్ వలసల హబ్‌గా మారిపోయింది. అంతేకాక తమిళనాడు, ఒడిశా, బీహార్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది నగరానికి వలస వస్తున్నారు. దీని ప్రభావంగా హైదరాబాద్ జనాభా గత పదేళ్లలో రెట్టింపు అయింది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారుగా 1 కోటికి పైగా జనాభా ఉన్నట్లు అంచనా. ఇది మౌలిక సదుపాయాల కల్పనపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది.
దెబ్బతీస్తోన్న నగర జీవన నాణ్యత
పరిశ్రమల స్థాపన హైదరాబాద్‌ను ఒక అభివృద్ధి చెందిన నగరంగా మార్చినప్పటికీ, అదే సమయంలో అనేక సవాళ్లను తెచ్చిపెడుతోంది. రోడ్లు, రవాణా వ్యవస్థ, నీటి సరఫరా, మురుగునీటి పారుదల, విద్యుత్, ఆరోగ్య సదుపాయాలు, గృహ సౌకర్యాలు జనాభా డిమాండ్‌ను తట్టుకోలేకపోతున్నాయి. నగరంలో రోడ్లపై భారీ వాహనాల సంఖ్య పెరగడం వల్ల ట్రాఫిక్ జామ్‌లు సర్వసాధారణంగా మారాయి. ఉదాహరణకు.. పంజాగుట్ట, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, మలక్‌పేట వంటి ప్రాంతాల్లో రద్దీ అనేది రోజువారీ సమస్యగా మారింది. ఈ ట్రాఫిక్ జామ్‌లు ప్రజల సమయాన్ని, ఇంధనాన్ని వృథా చేయడమే కాక, వాతావరణ కాలుష్యానికి కూడా కారణమవుతున్నాయి. ప్రభుత్వం మెట్రో రైలు, ఫ్లైఓవర్లు వంటి ప్రాజెక్టులను చేపట్టినప్పటికీ, జనాభా పెరుగుదల వేగానికి తగినట్లుగా ఈ సౌకర్యాలు విస్తరించడం సాధ్యం కావడం లేదు. ఈ పరిస్థితి నగర జీవన నాణ్యతను దెబ్బతీస్తోంది.
సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు భారం
అంతేకాదు, రోజురోజుకు పెరిగే డిమాండ్‌కు అనుగుణంగా గృహాల అవసరం కూడా పెరుగుతోంది. దీంతో అద్దె ఇళ్లకు డిమాండ్ పెరిగి రెంట్లు ఆకాశన్నంటుతున్నాయి. ముఖ్యంగా ఐటీ హబ్‌లైన హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్ వంటి ప్రాంతాల్లో 2BHK ఇంటి అద్దె నెలకు రూ.40 వేలకు పైనే ఉంటోంది. ఇది సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారుతోంది. దీంతో బస్తీలు విస్తరిస్తున్నాయి. అదనంగా, నీరు, విద్యుత్, ఇతర రోజువారీ అవసరాల ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. ఇది జీవన నాణ్యతను నగర రూపాన్ని కూడా ప్రభావితం చేస్తోంది. దీన్ని ప్రత్యామ్నాయంగా జిల్లా, మండల కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందకపోతే, హైదరాబాద్ నగర నాణ్యమైన జీవనానికి ఆటంకం తప్పదు.
రాష్ట్రంలో హైదరాబాద్ మాత్రమే పూర్తిస్థాయి అభివృద్ధి
ఇక హైదరాబాద్‌లో వలసలు పెరగడానికి ప్రధాన కారణం.. రాష్ట్రంలో కేవలం హైదరాబాద్ మాత్రమే పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందిన నగరంగా ఉండటం. అలాగే, గ్రామీణ ప్రాంతాలు, జిల్లా కేంద్రాలు సరైన ఉపాధి అవకాశాలు కల్పించలేకపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం ప్రధాన ఉపాధి వనరుగా ఉన్నప్పటికీ, ఆధునికీకరణ, నీటిపారుదల సౌకర్యాల కొరత, అస్థిర వాతావరణ పరిస్థితుల వల్ల నేటితరం ఈ వృత్తి పట్ల ఆసక్తి చూపించటం లేదు. ఫలితంగా, యువత హైదరాబాద్‌లో ఉన్న కంపెనీలు, ఫ్యాక్టరీలు, లేదా నిర్మాణ రంగంలో ఉపాధి కోసం వలస వస్తున్నారు. ఇది సమతుల్యత లేని అభివృద్ధికి సంకేతంగా చెప్పవచ్చు. నేటి గ్రామాలే రేపటి పట్టణాలని మహాత్మ గాంధీ అన్నారు. కానీ, దేశానికి పట్టుకోమ్మలాంటి గ్రామాల భవిష్యత్తు ప్రస్తుతం అంధకారంగా మారింది. మౌలిక సదుపాల లేమి కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారి సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది. ఒకప్పుడు ఒక గ్రామంలో పది మంది వలస వెళ్లితే.. ప్రస్తుతం పది మంది మాత్రమే గ్రామంలో నివసించే పరిస్థితులు వచ్చాయి.
సమస్య పరిష్కారానికి మార్గాలేంటి?
ఈ సమస్యను పరిష్కరించడానికి గ్రామీణ ప్రాంతాల్లో కుల వృత్తులకు చేయూత, సహకారం అందిచటం, పరిశ్రమల స్థాపన, చిన్న, మధ్య తరహా వ్యాపారులకు ప్రోత్సాహం, వృత్తి శిక్షణ కేంద్రాల ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్ని జిల్లాల్లోనూ ప్రత్యేక రంగాలకు అనుగుణంగా పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలు కల్పించడం వల్ల ప్రజలు తమ జిల్లాల్లోనే స్థిరపడే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం పలు జిల్లా కేంద్రాల్లో ఐటీ హబ్‌లను స్థాపించే ప్రయత్నాలు చేసింది. కానీ ఈ చర్యలను మరింత వేగవంతం చేయాలి.
హైదరాబాద్‌కు వలసలు, జనాభా పెరుగుదల వాస్తవమే. కానీ దీన్ని కేవలం ఆపడం సాధ్యం కాదు. ఒకే నగరాన్ని అభివృద్ధి చేసి, మిగతా ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తే, అది భవిష్యత్తులో ఆ ప్రాంతాల ఆర్థిక, సామాజిక వెనకబాటుకు గురయ్యే ప్రమాదం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా సమతుల్య అభివృద్ధితో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తేనే ఈ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం లభిస్తుంది. అయితే, నగర విస్తరణలో భాగంగా ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ఫోర్త్ సిటీ పేరుతో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలతో ఫ్యూచర్ సిటీని ఫ్లాన్ చేస్తోంది. ఇది హైదరాబాద్ ఎదుర్కొబోయే భవిష్యత్తు సవాళ్లను ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, రాష్ట్రస్థాయి ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి ఇది ఎంతలా తోడ్పడుతుందనేది వేచి చూడాలి. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వాలు రాష్ట్రంలోని అన్ని పట్టణ ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపన, పట్టణీకరణ, మేరుగైన జీవన ప్రమాణాలు, ఉద్యోగ కల్పన అందిస్తేనే మన హైదరాబాద్‌కు మనం మెరుగైన భవిష్యత్తును ఇవ్వగలం.






