- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బయటి వ్యక్తులు విజయం సాధిస్తే మెచ్చుకుంటాం, కానీ సొంతవాళ్లు బాగుపడితే ఓర్చుకోలేం.!
ఒకడు ఎదిగితే.. కండ్లు మండుతాయి. కడుపు మండుతుంది.

మనదంతా నటన.
పైకి ఒకలా..
లోపల మరోలా ఉంటాం.
పేరుకు పెద్ద కిరీటాలు.
"అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి" అనే సూక్తులు.
కానీ పాటిస్తామా.?
"నేనే బాగుండాలి" అనుకుంటాం.
ఒకడు ఎదిగితే..
కండ్లు మండుతాయి. కడుపు మండుతుంది.
"మావోడే" అని నీతులు మాట్లాడి..
మనసులో మాత్రం "నాశనమైపోరా నా కొడుకు" అని ప్రార్థిస్తాం.
- దాయి శ్రీశైలం
బ్రో.. "నీ మేలుకోరుతున్నా" అని ఒకడు ఊకే డప్పు కొడుతుండు అంటే వాడు నీకు చేసేదేమీ ఉండదు. పైగా నీకు గోతులు తొవ్వితే చెప్పలేం. నీ మేలు కోరేవాడెప్పుడూ ప్రచారం చేసుకోడు. "కీర్తి కిరీటాలు" దక్కాలి అని ఆశపడడు. సాయాన్ని అలుసుగా తీసుకోడు. "సొసైటీ"లో మనం రోజూ చూస్తూనే ఉంటాం. ఎవడో ఎక్కడో సక్సెస్ అయితే సంకలు గుద్దుకుంటాం కానీ.. సొంత మనిషి గెలిస్తే మాత్రం ఓర్చుకోం. ఎందుకంటే మనకు ఇతరులపై కన్నా మనవాళ్లపైనే ఈర్ష్య ఎక్కువ. "వీడెక్కడ నాకు సైడ్ కొట్టి పోతడో" అనే భయం తాలుకూ ఈర్ష్య అది. "బాగా ఎదిగాం" అని చెప్పుకునేవాళ్లంతా చేసే పనే ఇది.
అంత జెలసీ ఎందుకు.?
కాలం ఎంతయినా మారనీ.. టెక్నాలజీ ఇంకెంతయినా విస్తరించనీ.. వాటివల్ల మారితే జీవనశైలి మారొచ్చేమో గానీ మనిషి "మనసు" మారుతుందా.? కుబేరుడైనా.. కూటికిలేని పేదయినా "మనిషి" లక్షణాలను కొన్నింటినీ ఎప్పటికీ కోల్పోడు. అందులో ఒకటి స్వార్థం. "నేనే బాగుండాలి" అనే స్వార్థం. బయట సక్సెస్‌ఫుల్ పర్సన్‌గా.. పెద్ద పేరున్న వ్యక్తిగా ఎంత ఎదిగినా.. "తనలా ఇంకొకడు ఎదిగితే" సహించడు. "నీయబ్బ వీడేంట్రా.. నన్ను మించిపోయేలా ఉన్నాడు" అనే అక్కసు స్టార్ట్ అవుతుంది. "మావోడు నాలెక్కనే పైకొస్తుండు" అని ఫోజులెన్ని కొట్టినా.. లోపల మాత్రం "సలసలా" కాగుతుంటది. దాని పేరే జెలసీ.
డిస్కరేజ్‌మెంట్ ఢీ.!
ఎవరికో సీటొస్తే.. ఇంకెవరికో జాబొస్తే "హ్యాపీ"గా ఉందని సంబరపడిపోతాం. వాట్సప్‌లో స్టేటస్ పెట్టుకొని సంతోషపడతాం. "వాళ్ల సక్సెస్ నా సక్సెస్" అని మురిసిపోతాం. "కంగ్రాచులేషన్స్".. "ఆల్ ద బెస్ట్" విషెస్‌తో హల్‌చల్ చేస్తాం. "మాకు గర్వకారణం" అని గల్లా ఎగరేస్తాం. కానీ.. నిత్యం వెంటే ఉండేవాడికో.. స్నేహితుడికో.. అనుచరుడికో.. చుట్టాల పిలగానికో.. తమ్ముడికో.. తమ్ముడి కొడుక్కో సక్సెస్ వచ్చిందంటే "శుభాకాంక్షల వాన" అంతగా కురవదు. పైగా "అంత సీన్ లేదు.. ఏదో కథ జరిగింది" అనే ఉల్టా ప్రచారం. ఐనా "జాబొచ్చింది లెక్క కాదు" అని డిస్కరేజ్‌మెంట్ డిష్యుం డిష్యు షురువైతది.
అది కాదా ప్రైడ్.?
సునీతా విలియమ్స్ "అంతరిక్ష ప్రయాణం" గురించి యావత్ దేశం గర్వించింది. "భారతీయ మూలాలున్న" మహిళ విజయంగా చెప్పుకున్నారు. అంతరిక్షంలో ఆమె ఎట్లుండేదో.. ఏం చేసేదో చర్చించుకున్నారు. "మన ప్రైడ్"గా ఫీలయ్యారు. అంత గొప్పగా మాట్లాడిన వాళ్లే "తెలిసినొళ్ల అమ్మాయి".. "ఖగోళశాస్త్రం" చదువుతానంటే కంగుతింటారు. "ఆడపిల్లకు" అవసరమా అని కొందరు.. "ఓవరాక్షన్" ఎందుకని కొందరు కాలుపట్టి వెనక్కిలాగే ప్రయత్నమే చేస్తుంటారు. సునీతా సాధిస్తేనేమో మహిళ విజయం. మేన కోడలో.. అన్న కూతురో "ఆస్ట్రోనాట్" అవుతా అంటే మాత్రం "మహిళకు అవసరమా" అంటూ అడ్డంకులు.
అభద్రత వల్లేనా.?
ఎప్పుడైనా గమనించారా.? వాళ్లేమో కాకలు తీరిన లీడర్లయి ఉంటారు. మంత్రులు.. ముఖ్యమంత్రుల వంటి పెద్దస్థాయే. కానీ వాళ్ల తమ్ముడి కొడుకో.. బామ్మర్ది కొడుకో మాత్రం "చోటా లీడర్" లెవల్లోనే ఆగిపోతారు. ఇంకా సీరియస్‌గా తీసుకుంటే రాజకీయాల్లోంచే తరిమేయబడతారు. అట్లెందుకు అంటారా.? ఒకవేళ పర్ఫామెన్స్ బాగుంటే "రాజకీయ వారసుడి"గా ప్రకటించాల్సి వస్తుందేమో అనే అభద్రత. తనలా ఎదుగుతాడేమో.. తన సొంత కొడుకును మించిపోతాడేమో అనే భయంతో "పైదాక" రానివ్వరు. చిన్న చిన్న బిస్కెట్లు వేసి "ఆయన పెట్టిన భిక్షే" అని కలరింగ్ ఇచ్చుకుంటారు.
ఇదెక్కడి నీతి.?
సినీ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. స్టార్ హీరోల ఫ్యామిలీ నుంచి అంటే అక్క కొడుకో.. చెల్లెలి కొడుకో హీరోగా ఎంట్రీ ఇస్తే అంటీ ముట్టనట్టుగా ఉంటారు. ఎవరి టాలెంట్ వాళ్లది.. నా పేరు చెప్పుకోకుండా నీ టాలెంట్ ఏంటో చూపించుకో" అని సలహాలిస్తుంటారు. కానీ బయటి హీరో ఎవరైనా సక్సెస్ కొడితే.. లేదా ప్రమోషన్ ప్రోగ్రాంకి ఆహ్వానిస్తే మాత్రం "గ్రేట్" అని మెచ్చుకుంటారు. "కొత్త రక్తం రావాలి.. కొత్త కొత్త టాలెంట్ ఇండస్ట్రీకి అవసరం. అలాంటి వారికెప్పుడూ మా మద్దతు ఉంటుంది" అని స్పీచులిస్తారు. ఇదెక్కడి నీతో అర్థం కాదు.
నిజమే కదా.?
ఎవరో తెలియదు. వాళ్లు సిక్స్ కొడితే మనం కొట్టినట్లే ఫీలవుతాం. వాళ్లు వికెట్ తీస్తే మనం తీసినట్లే సంతోషిస్తాం. ఇంకెవరో వాళ్ల కెరీర్‌లో బాగా ఎదిగితే సంబరపడతాం. ఫలానా క్రికెటర్ ఐపీఎల్‌లో ఇరగదీస్తున్నాడు. తెలుగోడి సత్తా చాటుతున్నాడు. అతడిది మా జిల్లానే.. మా ఊరి పక్కనే అని ఎగిరి గంతేస్తాం. ఇంకెవరికో సివిల్స్‌లో మంచి ర్యాంక్ వస్తే.. గ్రూప్ వన్ ఉద్యోగం వస్తే "మన సత్తా ఏంటో నిరూపించాడు" అని సంకలు గుద్దుకునే గుణమన్న ఈ సమాజం తెలిసిన వాళ్ల విషయానికి వస్తే మాత్రం లైన్ ఛేంజ్ చేస్తుంది. బంధువులు.. తెలిసిన వాళ్లు ఎదిగితే ఓర్చుకోరు అనేది నిజం కాదని చెప్పండి చూద్దాం.?
సామాజిక పోలికల వల్లే
మానసిక శాస్త్ర పరంగా ఇలాంటి గుణం ఉన్న వ్యక్తులు అభద్రతా భావం.. అధిక న్యూరోటిసిజం.. సామాజిక పోలికల వల్ల ఇలా ఫీలవుతుంటారు. వారి భావేద్వేగ నియంత్రణ లోపం.. స్వీయ విలువ అనే సమస్యల నుంచి పుట్టుకొస్తాయి. దీనివల్ల వీరు ఇతరుల విజయాన్ని.. అభివృద్ధిని సానుకూలంగా చూడరు. వారి అభివృద్ధిని కోరుకోరు.
విజయాన్ని ఒప్పుకోరు
"ఫండమెంటల్ అట్రిబ్యూషన్ ఎర్రర్" వల్ల వ్యక్తులు ఇతరుల విజయాన్ని.. కృషిని.. సామర్థ్యానికి ఆపాదించకుండా అదృష్టంతో గెలిచారు అనీ.. లేదా వేరే ఇతర కారణాలను ఆపాదిస్తారు. దాని ద్వారా తమ ఈర్ష్యను సమర్థించుకుంటరు. కష్టపడేవారి శ్రమను.. త్యాగాన్ని విస్మరించి వారు ఎక్కడ ఎదుగుతారో అనే నెగిటివ్ ఆలోచన ఉన్నవారే ఆలా చేస్తుంటారు.
అందుకే దూరం పెడతారు
డానియల్ గోల్మన్ భావేద్వేగ మేధస్సు సిద్ధాంతం ప్రకారం.. ఈ గుణం ఉన్న వ్యక్తులు తమ భావోద్వేగాలను నియంత్రించుకోరు. పక్కవాడు ఎక్కడ విజయం సాధిస్తాడో అని భయంగా బతుకుతారు. నిరాశ.. కోపం.. అసంతృప్తి రేకెత్తి సొంతవాళ్లు అని మర్చిపోతారు. ఈ భావోద్వేగ అస్థిరత వల్ల తెలిసినవాళ్లని కూడా మర్చిపోయి వాళ్లను దూరం పెడతారు.
మానసిక రుగ్మతే
బయటివాళ్లెవరికో జేజేలు పలికి.. తెలిసినవాళ్ల విషయానికి వచ్చేసరికి ఓర్చుకోని గుణం ఉన్నవారిని మానసిక శాస్త్రం రుగ్మతగా పేర్కొంటుంది. దీనిని నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ అంటారు. ఇతరుల విజయాన్ని తమ సొంత గొప్పతనానికి బెదిరింపులా దానిని భావిస్తారు. తమకు కావాల్సిన వాళ్లు విజయాలను సాధిస్తే.. డెవలప్ అయితే ఓర్చుకోలేని గుణాన్ని బోర్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్ అని కూడా అంటారు.






