- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిగ్గదీసి అడిగినా.. సిగ్గురాని ఆకతాయిలు!
అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే రమ్మనుడేనా?.. సెక్సువల్ హరాజ్మెంట్ హోదా అనుకుంటున్నారా?.. ఇలాంటోళ్లకు భయం లేకపోవడానికి కారణమెవరు?.. పలుకుబడి ఉంటే చట్టం నీదే అయిపోతుందనే భరోసా?.. ఓ నాయకుడిగా నువ్వు చేస్తున్నదేంది.. తప్పు చేయమని ప్రోత్సహించుడా??

దిశ, ఫీచర్స్: ప్రపంచం అంతరిక్ష్యాన్ని ముద్దాడి అంతకంతకూ ఎదుగుతుంటే.. మన యువత ఆడవాళ్లు కనిపిస్తే ‘ముద్దిస్తవా’ అని బుద్ధిలేని మాటలు మాట్లాడుతూ నానాటికీ దిగజారుతోంది. ఆడవాళ్లు ఒంటరిగా కనిపిస్తే చాలు ‘వస్తవా’ అనే నీచపు సంస్కృతిని నిదురలేపుతోంది. చదువు, సంస్కారం తెలిసిన వాళ్లే సమాజంలో స్త్రీని వంకర బుద్ధితో చూసి సంకర నీతి చాటుతున్నారు. ఏమందాం ఇలాంటి వాళ్లను? ఏం విందాం ఇలాంటి వాళ్ల కథలు? నిగ్గదీసి అడిగినా.. సిగ్గురాని ఆకతాయిలు.!!
ఏం చిల్లరగాళ్లున్నర్రా బై?
ఆడవాళ్లను గౌరవించడంలో మనది ప్రత్యేక స్థానం. ప్రపంచమంతా మన సంస్కృతి సంప్రదాయాలను చూసి ఫిదా అవుతోంది. అలాంటి మన సొసైటీలో సందుకొకడు, బొందుకొకడు ఆకతాయి మోపై కల్చర్‌నంతా కరాబ్ చేస్తున్నారు. చూసినం కదా.. మల్కాజ్‌గిరి సీపీ సుమతి రాత్రిపూట కామన్ ఉమన్‌గా రోడ్డుపై నిలబడి ఒక ఆపరేషన్ చేస్తే ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయో? ఎంతమంది చిల్లరగాళ్లున్నారు? అనేది తెలిసిందో. ఆడవాళ్లు కనిపిస్తే చాలు కుక్కల్లా ఎగబడుతున్నారు. అమ్మాయిల పట్ల చాలా నీచంగా ప్రవర్తిస్తున్నారు. అసలు ఏం పుట్టిందో ఏమో.. రాత్రిళ్లు ఎవరైనా ఆడవాళ్లు రోడ్డుమీద కనిపిస్తే చాలు ‘వస్తవా’, ‘రేటెంత’ అని చిల్లరగా మాట్లాడుతున్నారు. మరీ ఇంత నీచాతి నీచంగా ఆలోచించే ఈ కీచక సమాజంలో ఇక భద్రత గురించి ఏం ఆలోచిస్తాం?
ఎంత మంది ఉన్నర్రా సామీ?
ఏం తేడా ఉంది? ఎవనికి భయముంది? సాధారణ మహిళ అయినా.. పోలీస్ కమిషనర్ అయినా ఇవే వేధింపులు. అయినా పోకిరిగాళ్లకు ఎవరైతే ఏంది? వాళ్ల బుద్ధే కురచ కదా? ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 40 మంది ఆకతాయిలు ఆ ఆపరేషన్లో పట్టుబడ్డారు. వారిలో ఒక్కడంటే ఒక్కరికి.. ‘అయ్యో.. ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నవ్. ఏమైనా సమస్యుందా?’ అని అడగాలనిపించలేదు. అందరిదీ ఒకే ఆలోచన. అందరిదీ ఒకే బుద్ధి. రోడ్డుపై నిలబడ్డ సీపీని రకరకాల అసభ్యకరమైన ప్రశ్నలతో గుచ్చిగుచ్చి ఇబ్బంది పెట్టారు. బైక్‌ల మీద వెళ్తున్న కొందరైతే బండి ఆపి మరీ నోటికి పని చెప్పారు. అసభ్య పదజాలంతో సభ్య సమాజం సిగ్గుపడేలా సూటిపోటి మాటలతో చిల్లరగాళ్లలా ప్రవర్తించారు. ఇంత దిగజారి ఉందా సమాజం?
ఏం నేర్చుకున్నాంరా బాబూ?
రోడ్లమీద పడి జులుయిగా తిరుగుతూ మహిళలను వేధిస్తూ అసౌకర్యానికి గురిచేస్తున్న వారిలో టీనేజ్ పిల్లలే ఎక్కువగా ఉంటున్నారు. పాపం పేరెంట్సేమో తమ పిల్లలు బాగా చదువుకోవాలి.. ఉన్నతంగా ఎదగాలని కలగంటారు. చిన్నప్పటి నుంచే మంచి స్కూలు, మంచి కాంపౌండ్ ఎంపిక చేసుకొని మంచి భవిష్యత్తును ఇవ్వడానికి తపిస్తుంటారు. తమ కెరీర్‌ను కూడా పణంగా పెట్టి ఎన్నింటినో త్యాగంచేసి పిల్లల శ్రేయస్సు కోసం నానా తిప్పలు పడుతుంటారు. వీటిని చిన్నప్పటి నుంచి బాగా అర్థం చేసుకొని మంచి భవిష్యత్ కోసం మంచిదారిలో వెళ్తూ తమ కలలు, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేందుకు ప్రయత్నించాలి. కానీ మనోళ్లు ఏం చేస్తున్నారు? రోడ్లమీద పోరంబోకు తిరుగుడు తిరుగుతూ ఆడవాళ్లను శృంగార వస్తువుగా చూస్తూ రాక్షసానందం పొందుతున్నారు.
ఇదేం సంస్కారంరా అయ్యా?
వేధింపులకు పాల్పడుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్న వారిలో బాగా చదువుకున్నోళ్లు.. ఐటీ ఉద్యోగాలు చేసేవాళ్లు ఎక్కువగా ఉన్నారట. అంత చదువుకున్నా.. లక్షలు పెట్టి లక్షణంగా శిక్షణ ఇప్పించినా.. రోడ్డుమీద ఆవారాగా తిరిగే వాళ్ల కంటే ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. జనాలు మరీ ఇంత మూర్ఖంగా తయారవుతున్నారంటే ఇక ఆ చదువుకున్న చదువుకు, నేర్చుకున్న సంస్కారానికి అర్థమేముంది? పోకిరీలు, పోరంబోకులు కూడా ఇంత నీచంగా ఆలోచించరు కావచ్చు. అందుకే చదువుకున్న మూర్ఖులు అంటారు. అందరి ఇండ్లలో ఆడవాళ్లు ఉంటారని తెలుసుగా.. వాళ్లకూ తల్లీ, చెల్లీ ఉన్నట్లు అందరికీ ఉంటారు కదా.. బయట ఏ అమ్మాయినో వేధిస్తే.. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే.. మనవాళ్లకూ అలాంటి పరిస్థితే రావచ్చనే సోయి కూడా ఉండటం లేదు జనాలకు.
ఛీకొట్టించుకొని సంబరాలా?
అమ్మాయిలను అటకాయించడం.. అసభ్యంగా ప్రవర్తించడం.. అల్లరి చేయడం.. వికృత చేష్టలకు పాల్పడటమే లక్ష్యంగా కొందరు మోపైతున్నారు. ఇంజినీరింగ్ కాలేజీలు.. ఫార్మసీ కాలేజీలు.. హాస్టల్స్.. బస్టాండ్లు.. మెట్రో స్టేషన్లే వీళ్ల అడ్డాలు. విద్యార్థినిలు.. మహిళలను లక్ష్యంగా చేసుకొని చిల్లర వేషాలు వేస్తుంటారు. నిజంగా సిగ్గులేని జన్మ వాళ్లది. నిగ్గదీసి అడిగినా సిగ్గురాదు ఈ జనానికి. అంత నీచమైన చట్రంలో ఉంటారు. అదేం ఆనందమో మరి.. అదేం సంతృప్తో మరి.. ఏదైనా మంచి పని చేసి సంబరపడాలి గాని.. ఎవడికీ అక్కెరకురాని.. సమాజం ఛీకొట్టే పనులు చేసి సంబరపడటమేందిరా నాయనా. ప్రపంచమంతా పరిశోధనలు, ఆవిష్కరణలు అని పరుగులు తీస్తుంటే మనవాళ్లేంటి ఆవారా పనులనే ఆస్కార్ పురస్కారంగా భావిస్తున్నారు?
దినచర్యలో బాగం అనుకుంటున్నారా?
ఆడ పిల్లలను వేధించినా.. అసభ్యంగా ప్రవర్తించినా.. తిట్టినా.. మార్ఫింగ్ చేసినా.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా.. మిత్రులకు షేర్ చేసినా తీవ్రమైన నేరం అనే ముచ్చట అందరికీ తెలుసు. ఇంత చెప్పినా వినకపోతే.. ఎంత చెప్పినా అవే ఇజ్జత్ తక్కువ పనులు చేస్తే ఈపులు సాపైతయని తెలుసు. ఇంత తెలిసి కూడా అట్లనే చేస్తోంది యువత. అగ్గితోటి కడిగినా అదే ఆకతాయి బుద్ధి. అర్థమయ్యేట్లు చెప్పినా అదే ధోరణి. సమాజాన్ని జీవచ్ఛవంలా మార్చేందుకు.. భవిష్యత్‌ను భ్రష్టు పట్టించేందుకు కంకణం కట్టుకొని కూసుందేమో ఈ జులాయి టీమ్. పోలీసులంటే భయం లేదు. చట్టాల మీద గౌరవం లేదు. హీరోయిన్ కనిపిస్తే ఇరగవడటం.. మీది మీదికివొయ్యి చెయ్యెయ్యడం.. దినచర్యలో బాగం అనుకుంటున్నారో ఏమో మరి?
ఆపుకోలేని ఆత్రమేంటోయ్?
హీరోయిన్ నిధి అగర్వాల్ ఒక సినిమా ఫంక్షన్‌కు వెళ్తోంది. అభిమానులమని చెప్పి జనాలు ఒక్కసారిగా గుమికూడారు. సెల్ఫీ అడిగితే ఇస్తోంది. ఇంతలోనే ఆమెను రౌండప్ చేసేశారు ఆకతాయిలు. ఆమె ఎటూ వెళ్లకుండా మొత్తం ప్యాక్ చేశారు. ఇంకో ఐదు నిమిషాలైతే మీద పడిపోదురు. ఎంత కరువులో ఉందో చూడండి యువత. అంటే చెప్పేవారెవరూ లేకుంటే ఏం చేసేవాళ్లో ఆలోచిస్తెనే ఏదోలా ఉంది. ఒక్క నిధి అగర్వాలే కాదు.. దాదాపు అందరి పరిస్థితి ఇలానే ఉంది. సమంత ఒక శారీ సెంటర్ ఓపెనింగ్‌కు వెళ్లింది. జనాలంతా ఆమెను చుట్టేశారు. ఎట్లనో అట్లజేసి మొత్తానికైతే కారు దగ్గరికి వచ్చింది. అప్పటికే ఆత్రం ఆపుకోలేక ఒకనిమీద ఒకడు పడి సమంత మీదికి దూసుకొచ్చారు. ఒక్కరా ఇద్దరా.. అదుపుతప్పి ఆమె మీద పడిపయారు.
నిగ్గదీసి అడిగినా ఏం లాభం?
సోషల్ మీడియాలో ఒక వీడియో వైరలవుతోంది. అది జైపూర్. స్కూటీ మీద ఒక మహిళ వెళ్తోంది. వెనకాల నుంచి ఒక బైక్ ఓవర్ టేక్ చేసింది. దానిపై ఇద్దరు యువకులున్నారు. ఆమెను చూసి సడెన్‌గా బైక్ స్లో చేశారు. వీళ్లేంటి నన్నుచూసి స్లో అయ్యారని అనుకుందామె. పోనీ తెలిసినవాళ్లా అనీ హెల్మెట్ గ్లాస్ ఓపెన్ చేసింది. కానీ వాళ్లెవరో తనకు తెలియదు. ఇంతింత దగ్గరకొస్తున్నారు. వీళ్లేంట్రా బాబూ ఇలా వస్తున్నారు అని ఆమె స్పీడ్ పెంచింది. వాళ్లూ స్పీడ్ పెంచారు. తను స్లో చేస్తే వాళ్లూ స్లో చేస్తున్నారు. ఎందుకొచ్చిన గొడవ అని స్కూటీ ఆపిందామె. వాళ్లు కూడా ఆపేసి తనను తాకుతూ.. గిల్లుతూ.. గలీజ్‌గా మాట్లాడుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి సిగ్గులేని జనాన్ని నిగ్గదీసి అడిగినా ఏం లాభం.. ఇలాంటి వారిని ఎట్ల శిక్షిస్తే మంచిది?
హరాస్మెంట్ మన హక్కా?
ఆడపిల్లల పట్ల అసభ్య ప్రవర్తన వంటివి చాలా దేశాల్లో తీవ్ర నేరాలు. సెక్సువల్ హరాస్‌మెంట్ కిందకు వస్తాయి. కానీ అదేంటో మన దగ్గర అదొక హోదా అయిపోతోంది. యువతకు ప్యాషన్‌గా మారుతోంది. అమెరికాలో ఇలాంటివి చేస్తే ఫెడరల్ అండ్ స్టేట్ లాస్ కింద సెక్సువల్ అసాల్ట్ లేదా హరాస్‌మెంట్ కేసుపెట్టి బొక్కలో వేస్తారు. కొన్ని సందర్భాల్లో 10–30 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉంది. చైనాలో అయితే సివిల్ లా కింద వ్యక్తిగత హక్కుల ఉల్లంఘనగా భావించి ఊచలు లెక్కపెట్టిస్తరు. తీవ్రతను బట్టి క్రిమినల్ లా కింద 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. అదే మన దగ్గర అయితే దేవుడు దిగిరానీ, శిక్ష ఉందని చెప్పనీ ఎవడూ వినడు. మారడు. సంస్కారం తప్పుతున్నామని తెలిసినా వీటి నుంచి పాఠం నేర్చకోరు.
చిడాయిస్తేనే మొగోడా ఏంటి?
అమ్మాయిలు కనిపిస్తే చెడుగా చూడటం, చెడుగా మాట్లాడటం మన దగ్గర హీరోయిజం. మగతనంగా భావిస్తారు. హే.. ఇదేమన్నా పెద్ద సమస్యనా? ఒకవేళ ఏదైనా జరిగితే రాజకీయ పలుకుబడిని ఉపయోగించి బయటపడొచ్చు. పోలీసులేం చేయరు.. ఎవరేం చేయరు అని బ్లేమ్ విక్టిమ్‌పై వేస్తారు. అలా చేయడం వాళ్లకొక ఫన్. ఇతర దేశాల మాదిరి మన దగ్గర కూడా కఠిన శిక్షలు ఉన్నా.. మమ్మల్నెవడూ టచ్ చేయలేడనే బలుపుతో మార్పు రావడం లేదు. దీనికి తోడు పోలీసులు బాధితుల పక్షాన కాకుండా తప్పుచేసిన వారి పక్షాన నిలుస్తూ యువతను పరోక్షంగా పాడు చేస్తున్నారు. వాళ్లింట్లోనూ ఆడపిల్లలున్నారు కదా అనే సోయి ఉంటే ఇలాంటి పనులకు సహకరించరు. అది లేదు కాబట్టే మనిషి ఉన్నతమైన సర్కిల్‌లో ఉన్నా ప్రవర్తన నీచంగా ఉంటోంది.
తల్లిదండ్రులూ చూసుకోవాలి కదా?
పిల్లలు ఆకతాయిలుగా మారడంలో.. జులాయిగా తిరగడంలో.. పేరెంట్స్ పాత్ర ఏం ఉండదు. కానీ పిల్లలు ఎటు తిరుగుతున్నారు? ఏం చేస్తున్నారు? వాళ్ల ప్రవర్తన ఎలా ఉంది? ఒకసారంటే ఏదో పొరపాటు జరిగిందేమో అనుకోవచ్చు.. మాటిమాటికీ ఇలాంటివి రిపీటవుతున్నాయంటే మనవాడి తప్పు ఉన్నట్లే కదా అని ఆలోచించాలి. తప్పుచేసినా వెనకేసుకు రావడం వల్ల ఎప్పటికైనా నష్టం తప్పదు. ఒకప్పుడు ఎట్లుండేది? పిల్లల బాల్యమెట్ల గడిచేది? సాయంత్రం కాగానే దోస్తులతో ఆడుకునేవాళ్లు. ఎగురుతూ.. దుంకుతూ.. కేరింతలు కొడుతూ సంతోషంగా గడిపేవాళ్లు. తొమ్మిదింటి లోపే పడుకునేవాళ్లు. మాట, ముచ్చటే ప్రపంచం. కానీ ఇప్పుడు.. ఇంట్లో అందరూ ఉంటారు. కానీ ఇల్లంతా నిశ్శబ్ధం. అందరి చేతిలో ఫోన్లు. అరచేతిలో ఆనందం.
శ్రీనివాస్ శర్మ, హైదరాబాద్
స్త్రీలను దేవతలుగా చూసే సమాజం మనది. ఈ తరం ‘ముద్దిస్తవా.. వస్తవా’ అంటూ రోడ్డు మీదే దిగజారుతోంది. కారణం స్పష్టం. సంస్కారం కోల్పోతున్నాం. టీవీ, యూట్యూబ్, పోర్న్‌లో వచ్చే అసభ్య సంస్కృతితో అనాగరికంగా వ్యవహరిస్తున్నారు. చదువుకున్న వాళ్లు కూడా ఇలా చేస్తే అర్థం ఏంటి? అంటే చదువు నేర్చుకున్నా కానీ మనుషులుగా మారలేదు. చట్టాలు కఠినం చేసి బహిరంగంగా శిక్షించాలి అలాంటి వాళ్లను. లేకపోతే భవిష్యత్ తరం భయంతోనే బయటకు వెళ్తుంది.
డాక్టర్ ప్రియ, బెంగళూరు
ఇది సామాజిక, మానసిక సమస్య. అమ్మాయిలను వేధించడం మగతనం అనుకునే జనాలున్నారు ఈ రోజుల్లో. పోర్న్, హీరోయిజం, లింగ సమానత్వం గురించి సరైన చర్చ లేకపోవడం ఇవన్నీ కలిసి వాళ్ల మెదడులో పురుగును పుట్టిస్తున్నాయి. ఏమంటాం వాళ్లను? స్కూల్ స్థాయి నుంచే జెండర్ ఈక్వాలిటీ గురించి అవగాహన కల్పించాలి. చదువు, బైస్టాండర్ ఇంటర్వెన్షన్ ట్రైనింగ్. కఠిన చట్టాల అమలు, సైకలాజికల్ కౌన్సెలింగ్ అవసరం. అబ్బాయిలు ఇలాగే ఉండాలి అనే మనస్తత్వాన్ని మార్చుకోకపోతే ఇదొక ట్రెండ్‌గా కొనసాగే ప్రమాదముంది.






