అసలు జనగణన ఎందుకు?.. దాని ప్రాముఖ్యత ఏమిటి?

by Gantepaka Srikanth |

జనగణన అంటే మన దేశంలో ఎంతమంది జీవిస్తున్నారని లెక్క వేయడమేనా.? అలాగైతే మన దేశ జనాభాను కనుక్కునే మార్గాలు అనేకం ఉన్నాయి కదా.

అసలు జనగణన ఎందుకు?.. దాని ప్రాముఖ్యత ఏమిటి?
X

జనగణన అంటే మన దేశంలో ఎంతమంది జీవిస్తున్నారని లెక్క వేయడమేనా.? అలాగైతే మన దేశ జనాభాను కనుక్కునే మార్గాలు అనేకం ఉన్నాయి కదా. మరి పదేళ్లకు ఒకసారి ఇంటింటికీ వెళ్లి ఎందుకు జన సంఖ్యను లెక్కించడం? 2023 ఏప్రిల్‌లోనే మన జనాభా 140 కోట్లు దాటినట్లు యూఎన్ పాపులేషన్ ఫండ్ చెప్పింది. మరి ఆ లెక్క సరిపోదా? ఇంతకీ జనగణన ఎందుకు? దాని ప్రాముఖ్యత ఏమిటి? 2011లో జరిగిన జనాభా లెక్కల తర్వాత ఇప్పటికీ జరుగకపోవడానికి కారణాలు ఏంటి? దానిద్వారా ఎలాంటి విపరిణామాలు చోటుచేసుకుంటాయనే అంశాలపై ‘దిశ’ ప్రత్యేక కథనం. - జాన్ కోర

జనగణన అంటే కేవలం జనాభాను లెక్కించడమే కాదు. దానితో ఎన్నో అంశాలు ముడిపడి ఉన్నాయి. ఒక ఊరు.. ఒక మండలం.. ఒక జిల్లా.. ఒక రాష్ట్రం.. ఒక ప్రాంతం.. ఇలా ఎక్కడ ఎంత జనాభా ఉందన్న వివరాలతో కచ్చితమైన లెక్కలు తీస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంత జనాభా? పట్టణాలు, నగరాల్లో ఎంత మంది జీవిస్తున్నారో లెక్కిస్తారు. ఈ వివరాలు లేకుండా విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన కార్యక్రమాలు రూపొందించడం అసాధ్యం. పైగా 2011 జనాభా లెక్కల ఆధారంగా 2025లో కేటాయింపులు చేయడం అసంబద్ధం. అలా చేస్తే ఏడాది పిలగాడు తినే తిండి ఆధారంగా.. అదే పిల్లాడు 14 ఏళ్ల తర్వాత ఎంత తినగలడని అంచనా వేయడం ఎంత తప్పో.. దశాబ్దానికి పైగా పాతబడిన జనాభా లెక్కల ఆధారంగా దేశంలో పలు పథకాలు, కార్యక్రమాలు, ప్రాజెక్టులకు కేటాయింపులు చేయడం అంతే తప్పు. వాస్తవానికి 2021లోనే సెన్సెస్ పూర్తి చేయాల్సి ఉండగా కొవిడ్-19 కారణంగా ఆలస్యమైంది. పాండమిక్ అనంతరం కూడా ప్రభుత్వం సెన్సెస్‌ను నిర్వహించలేదు. ఇందుకు గల అడ్డంకులను కూడా ప్రభుత్వం వెల్లడించలేదు. దీంతో జనగణన ఎప్పుడు నిర్వహిస్తారనే మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.

ఎప్పుడు మొదలైంది?

మనదేశంలో సెన్సెస్‌కు 150 ఏళ్ల చరిత్ర ఉంది. బ్రిటిష్ ఇండియాలోనే తొలిసారి జనగణన నిర్వహించారు. బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ మాయో ఆధ్వర్యంలో 1872లో తొలిసారి జనగణన జరిగింది. 1865లో సెన్సెస్ నిర్వహించాలని నిర్ణయించగా.. 1872లో తొలిసారి జనగణన పూర్తయ్యింది. అప్పటినుంచి ప్రతి పదేళ్లకు క్రమం తప్పకుండా సెన్సెస్ నిర్వహిస్తున్నారు. బ్రిటిష్ గవర్నమెంట్ 1941లో చివరిసారిగా సెన్సెస్ నిర్వహించింది. ఇక స్వతంత్ర భారత్‌‌లో తొలిసారి 1951లో జనాభా లెక్కలు తీశారు. ఇందుకోసం 1948లో సెన్సెస్ ఆఫ్ ఇండియా యాక్ట్ రూపొందించారు. దీని ప్రకారం దేశంలో నిర్వహిస్తున్న జనగణనకు చట్టబద్ధత వచ్చింది. రాజ్యాంగం ప్రకారం జనగణన తప్పకుండా నిర్వహించాలి. కానీ ఎన్ని ఏళ్లకు ఒకసారి నిర్వహించాలని మాత్రం చట్టంలో పేర్కొనలేదు. ప్రతీ 10 ఏళ్లకు కచ్చితంగా నిర్వహించాలని సెన్సెస్ ఆఫ్ ఇండియా యాక్ట్‌లో పేర్కొనక పోవడం గమనార్హం. అయితే 1881 నుంచి క్రమం తప్పకుండా పదేళ్లకు ఒకసారి నిర్వహిస్తుండటంతో దాన్నే కేంద్రంలో అధికారంలో ఉన్న అన్ని ప్రభుత్వాలు కొనసాగించాయి. అయితే ఇండియాలో జనగణన మొదలైన తర్వాత తొలిసారి మోడీ ప్రభుత్వం జనగణను ఆలస్యం చేసింది. దీని వల్ల ఎంతో నష్టం జరుగుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్మన్ సోనియా గాంధీ కూడా రాజ్యసభలో ఈ అంశాన్ని లేవనెత్తారు. ఆర్థిక, సామాజిక, ఆరోగ్య నిపుణులు కూడా సెన్సెన్ సరైన సమయంలో నిర్వహించక పోవడంపై కలిగే నష్టాలను వివరిస్తున్నారు.

పాత డేటాతో ప్రమాదమే..

కచ్చితమైన జనాభా లెక్కలు ప్రతీ దేశానకి అవసరమే. మన దేశంలో అనేక ప్రాంతాలకు, వర్గాలకు సంబంధించిన అవసరాలు అంచనా వేయడానికి జనగణన ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వైద్యారోగ్యం, విద్యా వ్యవస్థ, సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల కల్పన, కొత్త ప్రాజెక్టుల రూపకల్పనకు జనాభా లెక్కలే ఆధారం. జనసాంద్రత, జనాభా ప్రొఫైల్స్ ఆధారంగా ఏ ప్రాంతంలో ఏ ప్రాజెక్టు చేపట్టాలి. ఏ రంగానికి ఎంత కేటాయింపులు జరపాలనే విషయాలు తాజా లెక్కలతో మాత్రమే తెలుస్తాయ. జనాభాకు సంబంధించి తాజా లెక్కలు ప్రభుత్వం వద్ద లేకపోతే కేటాయింపుల్లో అనేక అవకతవకలు జరిగే అవకాశం ఉంటుంది. వలసల కారణంగా దేశంలో కొన్ని ప్రాంతాలు విపరీతమైన జనాభాను కలిగి ఉంటాయి. అదే సమయంలో మరికొన్ని ప్రాంతాలు జనాభాను కోల్పోయి ఉండొచ్చు. పాత డేటాతోనే కేటాయింపులు చేసినా, విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నా అవి ప్రాంతీయ అసమానతలకు దారి తీసే ప్రమాదం ఉంటుంది. రూరల్, అర్బన్ ప్రాంతాల్లోని ప్రజలకు ఇప్పుడు ఏయే అవసరాలు ఉన్నాయని ప్రభుత్వం గుర్తించడం కష్టమవుతుంది. 2011 జనాభా లెక్కలనే ఇప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాడుతుండటం అనేక సమస్యలకు కారణం అవుతున్నది. సాంఘీక సంక్షేమ కార్యక్రమాలు, జాతీయ ఆహార భద్రత చట్ట ప్రకారం ప్రజలకు పంపిణీ చేసే ఆహార ధాన్యాల విషయంలో ఇప్పటికీ 2011 లెక్కలనే వాడుతున్నారు. దీంతో దేశంలో అర్హులైన 14 కోట్ల మందికి ఆహార ధాన్యాలు, పోషకాహారం అందడం లేదు. వారంతా పాత లెక్కల కారణంగా రేషన్ కార్డులు కూడా అందుకోలేక పోతున్నట్లు ఒక అధ్యయనంలో తేలింది. కేవలం ఆహార సంబంధితమైనవే కాకుండా.. బలహీన వర్గాలవారికి సామాజిక ఫించన్లు, ఆరోగ్య ప్రయోజనాలు, సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందడం లేదని స్పష్టం అవుతోంది.

రాజకీయంగా..

జనాభా లెక్కలు రాజకీయంగా కూడా ముఖ్యమైనవే. మన దేశంలో రాజకీయ వాతావరణం జనాభా లెక్కల ఆధారంగానే మారుతుంటుంది. పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీల సీట్లు జనాభా లెక్కల ఆధారంగానే నిర్ణయిస్తారు. పాత జనగణన ఆధారంగా చట్టసభల్లో ప్రాతినిథ్యం ఉండటం వల్ల ఇప్పటి ప్రాధాన్యతలు ఏమిటో తెలుసుకోవడం కష్టంగా మారింది. నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలన్నా, చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కేటాయించాలన్నీ జనగణన తప్పనిసరిగా మారింది. ఇక జనగణన ఆధారంగానే జనాభా రిజిస్టర్, ఆధార్, రేషన్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్సులకు సంబధించిన వివరాలన్నీ నవీకరించాల్సి ఉంది. దీంతో పాటు జాతీయ శాంపిల్ సర్వే, జాతీయ కుటుంబ సర్వే, పాలసీల్లో జెండర్ రిప్రజెంటేషన్ తదితర అధ్యయనాలకు కూడా జనాభా లెక్కలే కీలకం. కానీ 2021 నుంచి సెన్సెస్ ఆలస్యమవుతుండటంతో ఇవన్నీ వాయిదా పడుతూ వస్తున్నాయి.

ఆర్థిక అసమతుల్యత..

సాధారణంగా దేశంలో ఆర్థిక కేటాయింపులు కూడా జనాభా లెక్కల ఆధారంగానే ఉంటాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పన్ను కేటాయింపులను పైనాన్స్ కమిషన్ నిర్ణయిస్తుంది. ఇందుకు జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుంటుంది. జనాభా పరిమాణం, పెరుగుదల రేటు ఆధారంగా వనరులను కేటాయించడానికి జనాభా లెక్కలపై ఆధారపడుతుంది. అయితే తాజా డేటా లేకపోవడం వల్ల ఫైనాన్స్ కమిషన్ పాత గణాంకాలనే పరిగణలోకి తీసుకుంటుంది. ఈ కేటాయింపులు ప్రస్తుతం ఉన్న జనాభాకు ఎక్కువ లేదా తక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. వలసల కారణంగా గత 13 ఏళ్లలో నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ఉండే జనాభాలో విపరీతమైన మార్పులు వచ్చాయి. వేగవంతమైన పట్టణీకరణ కారణంగా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించడానికి ఆ ప్రాంతంలో ఉన్న జనాభా ఎంతో తెలుసుకోవాలి. ఉదాహరణకు ఒక ప్రాంతంలో నీటి వసతి కల్పించాలన్నా, రోడ్లు , ఫ్లైవోవర్లు నిర్మించాలన్నా.. ప్రస్తుతం అక్కడ ఎంత జనాభా ఉందో తెలుసుకోవాలి. పాత లెక్కలతో వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేస్తే.. దాని వల్ల పూర్తి స్థాయి ప్రయోజనం లభించకపోవచ్చు. ఇక వలసల రేటు ఎంతుందో తెలుసుకోవడం వల్ల మెరుగైన ఉద్యోగ అవకాశాలు, జీవన పరిస్థితులు కల్పించడానికి వీలుంటుంది. అంతే కాకుండా అర్బన్ ఏరియాల్లో గృహ నిర్మాణం, ప్రజా రవాణా, ఇతర సేవలను ముందుగానే ప్లాన్ చేసుకునే వీలుంటుంది. ఈ డేటా లేకుండా ఏ నగరంలోనూ, పట్టణంలోనూ మౌలిక సదుపాయాలను ప్రయోజనకరంగా కల్పించలేరు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో తగ్గుతున్న జనాభాను గుర్తించి.. అందుకు గల కారణాలను విశ్లేషించే అవకాశం ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో ప్రజలు వలస వెళ్లకుండా ఏం చేయవచ్చనే విషయాలు ప్రభుత్వం తెలుసుకోవడానికి జనాభా లెక్కలు పనికి వస్తాయి.

సామాజిక న్యాయం..

దేశంలో సామాజిక న్యాయాన్ని సక్రమంగా అమలు చేయడానికి జనాభా లెక్కలు కీలకమే. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను జనాభా ఆధారంగానే అమలు చేస్తున్నారు. ఆయా సామాజిక వర్గాలకు జరిపే కేటాయింపుల్లో కచ్చితత్వం ఉండాలంటే తాజా జనాభా లెక్కలు ఉండాలి. నవీకరించబడిన జనాభా లెక్కలే సామాజిక న్యాయం సక్రమంగా జరగడానికి ఉపయోగపడుతుంది. ఆయా వర్గాలకు సంక్షేమ పథకాల అమలు, ఆర్థిక అసమానతల తొలగింపు, రిజర్వేషన్ల కొనసాగింపు.. ఇలా ప్రతీ అంశానికి జనాభా లెక్కలు ఆధారంగా ఉంటాయి. తాజా డేటా లేకుండా సామాజిక న్యాయానికి సంబంధించిన కార్యక్రమాలను రూపొందించడం, కొత్త వారిని చేర్చుకోవడం కష్టంగా మారుతుంది. దేశంలో కుల గణన నిర్వహించాలన్నా.. ముందుగా జనగణన చేయాల్సిందే. జనాభాకు సంబంధించిన నవీకరించిన పాపులేషన్ రిజిస్టర్ లేకపోవడం వల్ల సుస్థిర అభివృద్ధ లక్ష్యాలను సాధించడం కష్టమే. దేశంలో పేదరికం తగ్గింపు, ఆరోగ్య సంరక్షణ, విద్యకు సంబంధించి కీలక సూచికలను నిర్ధారించడం కష్టం. పైగా దేశం సాధించిన విజయాలను అంచనా వేయడం.. వైఫల్యాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం సవాలుగా మారుతుంది. ఏయే ప్రాంతాల్లో ఏయే అవసరాలపై శ్రద్ద పెట్టాలనే విషయాలు జనాభా లెక్కల వల్లే అర్థం అవుతాయి. ఇక అంతర్జాతీయంగా బెంచ్ మార్క్‌లను నిర్దారించుకొని.. ప్రపంచ వేదికపై ఇండియా మెరుగైన స్థానానికి చేరుకోవడంలో కూడా సవాళ్లు ఎదురవుతాయి.

ఆలస్యం చేస్తే.. నష్టం

దేశంలో ఉన్న జనాభా ఎంత అని తెలుసుకోవడం ప్రభుత్వానికి కీలకం. ఈ జనాభా లెక్కలను ఎంత ఆలస్యం చేస్తే.. దేశానికి అంత నష్టం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మన దేశంలో ప్రతీ పదేళ్లకు జనాభా లెక్కలు తీస్తుంటారు. కానీ ఆస్ట్రేలియా వంటి దేశంలో ఐదేళ్లకు ఒకసారి సెన్సెస్ నిర్వహిస్తారు. తద్వారా మరింత వేగంగా తమ పాలసీలను జనాభాకు అనుగుణంగా మార్చుకునే అవకాశం ఆ దేశానికి ఏర్పడింది. ఇండియాలో కొవిడ్-19 పేరు చెప్పి నాలుగేళ్లుగా జనగణన నిర్వహించడం లేదు. వాస్తవానికి దేశంలో మెరుగైన వైద్య వ్యవస్థ లేనప్పుడు 1918లో స్పానిష్ ఫ్లూ విజృంభించింది. అయినా సరే భారత రిజిస్ట్రార్ జనరల్, జనాభా లెక్కల కమిషనర్ కార్యాలయం 1921లో సెన్సెస్‌ను సకాలంలో పూర్తి చేసింది. 1947లో స్వాతంత్రం వచ్చి, దేశం రెండు భాగాలుగా విడిపోయి, రాజకీయంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నప్పుడు కూడా 1951లో జనాభా లెక్కలను సకాలంలో పూర్తి చేశారు. అయితే అత్యంత ఆధునిక టెక్నాలజీ ఉండి, డిజిటల్ పద్ధతిలో జనగణన చేస్తామని చెప్తున్న ఎన్డీయే ప్రభుత్వం మాత్రం సెన్సెస్‌ను ఆలస్యం చేస్తున్నది. దీని వెనుక ఉన్న కారణాలేమైనా సరే.. అంతిమంగా దేశం, దేశ ప్రజలు నష్టపోతున్నారు.

Next Story