- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లైటేస్కో.. లైట్ తీస్కోకు.! చేవెళ్ల యాక్సిడెంట్ వంటివి ఎల్ఈడీ హెడ్‌లైట్ వల్ల కూడా జరుగుతున్నాయా.?
రోజూ మన రోడ్లమీద నడిచే బాగోతమిదే కదా.?

దిశ, ఫీచర్స్: మనకు బైకుండాలె. బైర్లుగమ్మే లైట్లుండాలె. కారుండాలె. కండ్లు మూసుకపోయే వెలుతురుండాలె. ఎదురుగా వచ్చే స్కూటరోడు ఎటువోతె మనకేంది.? పక్కపొంటి నడిచిపోయే పాదచారి ఏమైతే మనకేంది.? చమ్కీల లైట్లేసి.. చమ్కాయిస్తూ మెరిసే ఫోకసొస్తే సాలు. మన బండి మంచిగా ముందుకువోతె సరిపాయె. రోజూ మన రోడ్లమీద నడిచే బాగోతమిదే కదా.?
లైట్లకు కూడా రూల్సుంటయా.?
కార్లు.. బైకులు లేనొళ్లు ఉంటున్రా.? ఇంటింటికీ కారు.. రెండు మూడు బైకులు. తెల్లారితే సాలు అన్నీ రోడ్డు మీదికి పోతయి. ఇంకా లారీలు.. బస్సులు.. డీసీఎంలు.. ట్రక్కులు.. ఆటోలకైతే లెక్కనే లేదు. రోడ్లెంత వెడల్పు చేసినా సరిపోతలేవు. మనుషుల సంఖ్య కంటే వెహికిల్స్ సంఖ్యనే స్పీడ్‌గా పెరిగిపోతుంది. ఇంత పెరుగుతున్నా.. రోజుకు వేలాది కొత్త వెహికిల్స్ బయటికొస్తున్నా జనాలకు రోడ్ సెన్స్ అనేది కొంచెంగూడ బుర్రకెక్కుతలేదు. ఎంతసేపూ "బండి తెచ్చుకున్నాం.. బాజాప్త తిరగొచ్చూ" అనుకుంటుండ్రుగానీ.. అట్ల తిరగాలంటే ఫాలో కావాల్సిన రూల్సేంటి అనేది తెలుసుకుంటలేరు. రూల్స్ మనకోసమే అనే సోయి వాళ్లకుంటలేదు. మరీ ముఖ్యంగా వెహికిల్ లైటింగ్స్ గురించి. "అగో.. లైట్లకు కూడా రూల్సుంటయా" అని తారీఫ్ చేసెటొళ్లు కూడా మన మధ్య ఉంటరు.
అది వెహికిలా.. కల్యాణ మండపమా.?
"లైట్స్" అనంగనే లైట్ తీస్కుంటరు మనొళ్లు. "మా లైట్లతో వేరేవాళ్లకేం సంబంధం. అవెట్లుండాల్నో.. ఎన్ని ఉండాల్నో మా ఇష్టం" అనుకుంటరు కొందరు. వెహికిల్ మానుఫాక్చరింగ్ అయ్యేటప్పుడు ఏ సామర్థ్యంతో.. ఎంత తీవ్రతతో లైట్లు అమర్చి వస్తాయో.. వాటన్నింటినీ తీసేసి ఇష్టమొచ్చిన లైట్లు వేసుకుంటరు. దాన్ని వెహికిల్ అనుకుంటరో లేదా కల్యాణ మండపం అనుకుంటరోగానీ.. ఆ లైటు.. ఈ లైటు అని ఏవేవో పెట్టేసి గంగిరెద్దు లెక్క తయారు చేస్తుంటరు. బండికి ముఖ్యంగా ఏమేం లైట్లుండాలె.? హెడ్ లైట్స్.. ఇండికేటర్ లైట్స్.. బ్రేక్ లైట్స్ అంతే. ఇండికేటర్స్.. బ్రేక్ లైట్స్ కొంచెం ఎరుపు రంగులో ఉంటయి. హెడ్ లైట్స్ తొవ్వజూపస్తయి కాబట్టీ రోడ్డు.. ఎదురుగా వస్తున్న వెహికిల్స్ కనిపించెటట్లు కాంతివంతమైన లైట్స్ ఉండాలె.
ఎంతసేపూ సింగారించాలనే ఆలోచనేనా.?
కొత్త బైక్ తీసుకుంటరు. రిజిస్ర్టేషన్ దాక ఓపిక పడతరు. రిజిస్ట్రేషనై.. నంబర్ ప్లేట్ పడ్డదంటే సాల్. ఇక బైక్ పని ఖతమే. మంచిగున్నదాన్ని తీస్కపోయి ఏమేమో కతలువడ్తరు. దున్నపోతుకు తానంజేపిచ్చి బొట్టుబోనం జేసినట్లే ఉంటది పోరగాళ్ల ముచ్చట. ఎంతసేపూ బైకునెట్ల సింగారించాలె అనే ఆలోచన్నే ఉంటది. సీదా ఎక్స్‌ట్రా ఫిటింగ్ షాప్‌కు తీస్కవోతడు. మంచిగున్న కొత్త హెడ్‌లైటును పీకేపిస్తడు. దాని ప్లేస్‌లో ఎల్ఈడీ లైటు పెట్టిస్తడు. సరే అదైనా సరైంది పెట్టిస్తరా అంటే అదీ ఉండదు. భారీ ఎల్ఈడీ లైటు పెట్టిస్తడు. హైమాస్ట్ లైటొచ్చినంత లైటింగొస్తదన్నమాట దాంతోని. ఆ లైటు పెట్టుకునుడు రూల్ ప్రకారం ఓకేనా కాదా.? అనేది ఒక్క క్షణం కూడా ఆలోచించరు. పది రూపాయలు ఎక్కువైనా సరే.. సింగారించి శిత్తుబొత్తు చేసుడే వాళ్ల పనీ.
బైకా లేకపోతే లైటుబుగ్గలు బండా.?
ఇంకా కొందరుంటరు. వాళ్లేందంటే.. బండి నిండా లైట్లు జమాయిస్తరు. ఎర్రలైటు.. పచ్చలైటు.. ఆ లైటు.. ఈ లైటూ అని కొత్త బండిని లైటుబుగ్గలు అమ్ముకునే బండిలెక్క తయారుచేస్తరు. హ్యాండిల్‌కు రెండువైపులా ఉన్న అద్దాలు తీసేస్తరు. ఎందుకో అద్దాలంటే వాళ్లకు మోటున్నట్టుంది. సైడ్ మిర్రర్స్ అనేవి రోడ్ అండ్ ట్రాఫిక్ రూల్స్ ప్రకారం పెడతరు. ఎనక నుంచి వచ్చేటొళ్లకు మనం సైడ్ ఇవ్వాలన్నా.. వాళ్లు సైడ్ తీసుకోవాలన్నా వాటిలో చూస్తెనే క్లియర్‌గా అర్థమైతది. మూల మలుపుల కాడ మల్లేటప్పుడు వాటిల్లో చూసుకొని ఈజీగా మల్లొచ్చు. అంతేగానీ అవేమీ షోకు కోసం.. టైంపాస్ కోసం పెట్టినవి కావు. కానీ.. మనొళ్లు అవి ఉంటే శీదర శీదర చేస్తరు. బండి తెచ్చి వారం రోజులు కాకముందే పీకేసి దాని ప్లేసులో చమ్కీల రంగులొచ్చే లైట్లు పెట్టుకొని తిరుగుతరు.
ఇదే నా స్పెషల్.. అందరూ నన్నే చూడాలె!
సైడ్ మిర్రర్స్ జాగల్నే కాదు.. పారాక్.. మడ్‌గార్.. సైలెన్సర్.. ఇట్లా బైకు మొత్తం లైట్లు పెట్టేస్తరు కొందరు. కిలోమీటర్ దూరంకెల్లి వస్తుంటెనే జెగ్గున మెరుస్తుంటయి ఆ లైట్లు. అట్ల మెరుస్తుంటే వాళ్లకు ఎక్కడలేని సంబరమైతుండొచ్చు. ఇలాంటి వారి సైకాలజీ భిన్నంగా ఉంటుందట. "అందరూ నన్నే చూడాలె.. నేనంటే ఎంత స్పెషలో తెలుసుకోవాలె" అనే మనస్తత్వం ఉన్నొళ్లే ఎక్కువగా ఇసొంటి పనులు చేస్తుంటరు. రోడ్డుమీద ఆధిపత్యం చూపించాలనుకొని కొందరు చేస్తుంటారు. కొందరికి ఏది చేసినా ఎక్కువ చేయాలె.. గట్టిగా ఉండాలనే ఆలోచన ఉంటది. సెన్సేషనల్ సీకింగ్ పర్సన్స్ అంటారు వీళ్లను. అందుకే తమ డ్రైవింగ్ నైపుణ్యాన్ని లైట్ల రూపంలో చూపిస్తుంటరు. అపరిపక్వత.. అభద్రత ఉండి సరైన మార్గదర్శనం లేని వాళ్లే వీటితో న్యూసెన్స్ చేస్తుంటరు.
ఒకటి మొగులు మీదికి.. ఇంకోటి భూమ్మీదికి..
కారు కావచ్చు.. బైకు కావచ్చు.. ఇంకేదైనా కావచ్చు. వెహికిల్స్‌కు లైట్లు అనేవి అందం కోసమో లేదా ఆకర్షణ కోసమే పెట్టరు. వాటిని కేవలం భద్రత కోసమే పెడతరు. లైటింగ్ ఎంతదూరం.. ఏ కోణంలో పడాల్నో కూడా లెక్క ప్రకారం సెట్ చేస్తరు. నిలువు నిటారున కాకుండా కొంచెం నేలవైపు వంగినట్లు ఈ లైట్లను అమరుస్తరు. దూరంలో ఉన్న వాహనం లేదా వ్యక్తి కనిపించే విధంగానే ఆ సెట్టింగ్ ఉంటుంది. రోడ్డు ప్రమాదాలు జరగొద్దంటే ఆ సెటప్‌నంతా అట్లనే ఉండనీయాలె. కానీ మనొళ్లు అట్ల చేయరు. ఆ లైట్లన్నింటినీ లైట్ తీసుకొని.. వాటిని అక్కడి నుంచి తీసేసి వాళ్లకు ఇష్టమైన లైట్లు ఫిటింగ్ చేయించుకుంటరు. తీరాచూస్తే ఆ లైట్లు ఇంతకు ముందున్న కోణంలో ఉండవు. ఒకటేమో మొగులు మీదికి చూస్తది. ఇంకోటేమో రోడ్డెంట వచ్చేటొళ్ల కండ్లకు కొడతయి.
ఎల్ఈడీ లైట్లతోనే ఎక్కువ యాక్సిడెంట్లు..
సాధారణ వెహికిల్ లైట్స్ కాకుండా ఈ భారీ ఎల్ఈడీ లైట్ల వెంట జనాలు ఎందుకు ఉరుకుతుండ్రంటే.. "లైట్లు పెద్దగొస్తయి.. రోడ్డు మొత్తం కనిపిస్తది కాబట్టీ యాక్సిడెంట్లు జరగవు" అని అనుకుంటరు. కానీ.. వాస్తవానికి యాక్సిడెంట్లు ఈ లైట్ల కారణంగానే జరుగుతున్నయి. ఎక్కువ ఫోకస్ ఉన్న ఈ ఎల్ఈడీ లైట్ల వల్ల ఎక్కువ లైటింగ్ వచ్చి ఎదురుగా వస్తున్న వాళ్ల కండ్లకు కొడుతుంది. ముందున్నది ఏదీ కనిపించకపోవడంతో ఏక్‌దమ్ బ్రేక్ చేయడంగానీ లేదా.. ముందున్న వెహికిల్స్‌కు టక్కరవడంగానీ జరుగుతుంది. కొన్నిసార్లు ఆ లైట్లేసిన వాహనాన్నే గుద్దుకుంటయి. ఇట్లా మనం ఏ యాక్సిడెంట్లు కావద్దనీ.. ఇష్టమొచ్చినట్లు ఎక్కువ వాట్స్ ఉన్న ఎల్ఈడీ లైట్లు అమర్చడం వల్లనే అసలు సమస్య ఏర్పడి రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్నాయి.
లైట్ తీసుకునే ఆ లైట్లే కాపాడతయని తెలుసా.?
లైట్లతో యాక్సిడెంట్లేంది అని వాదించేవాళ్లు కూడా మన మధ్య చాలామంది ఉన్నరు. అసలు లైటు ఏ ఫార్ములా ప్రకారం పెడ్తరో.. ఎంత కోణంలో అమరుస్తరో మనకు తెలుసునా.? తెల్వనప్పుడు తెలుసుకోనన్నా తెలుసుకోవాలె. లేకపోతే తెలిసినొళ్లు చెప్తే వినాలె. మోటార్ వెహికిల్ యాక్ట్.. సెంట్రల్ మోటార్ వెహికిల్స్ రూల్స్ ప్రకారం బైకైనా.. కారైనా.. లారీ అయినా ఏ వెహికిలైనా హెడ్‌లైట్లను ఆటోమేటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా స్టాండర్డ్ ప్రకారమే అమర్చాలె. కానీ మనమేం చేస్తం.. నజీర్ భాయ్ దగ్గరో.. నరేశ్ భాయ్ దగ్గరో ఫిట్ చేయించుకుంటం. హా.. ఏముందిలే అనుకొని లైట్ తీసుకునే ఆ లైట్లే మనల్ని కాపాడతయని తెలుసుకోం. రోడ్ సేఫ్టీ.. కండ్లలో ఫోకస్ కొట్టడం వంటివన్నీ లెక్కలోకి తీసుకొని వీటిని పెడతరు.
ఎల్ఈడీ లైట్లతో కండ్లు బైర్లు కమ్మేస్తయి..
వెహికిల్ లైటింగ్ సిస్టమ్‌ను నిజంగా మనం ఫాలో అవుతున్నమా.? మనందరికీ ఒకటే ధ్యాస.. రోడ్డంతా కనిపించాలె. ముందొస్తున్న వెహికిల్స్ స్పష్టంగా కనిపించాలె అనీ. ఆ శ్రద్ధ ఓకే. కానీ అదెంత లోపు అనేది చూసుకుంటే మంచిది. సాధారణంగా ఎల్ఈడీ హెడ్‌లైట్స్‌గా 55/60W హాలజన్ బల్బులు లేదా 3,000 ల్యూమెన్స్ ఎల్ఈడీ బల్బుల వరకు ఛాన్సుంటుంది. బైక్స్ అయితే 35/35W.. కార్లయితే 55/60W.. లారీ గూడ్స్ అయితే 55/60W వరకు ఎల్ఈడీ బల్బులు పెట్టుకోవచ్చు. కానీ మనమేం చేస్తం. వాటికంటే డబుల్.. ట్రిపుల్ లైటింగ్ కెపాసిటీ ఉన్న వాటినే పెడతం. వాటివల్ల రోడ్డంతా లైటింగ్ ఆవరించి కండ్లు బైర్లు కమ్మేస్తయి. ఇంకా వైట్ లైట్లు మాత్రమే పెట్టుకోవాలె. కానీ మనొళ్లు అదొక్కటి వదిలేసి బ్లూ.. రెడ్.. గ్రీన్ రంగులతో ఫ్రంట్ లైట్స్ పెడతారు.
ఆ లైట్లను అమర్చుకోకుండ్రిరా సామీ..
రాత్రిపూట జరిగే రోడ్డు ప్రమాదాలలో 20-25% యాక్సిడెంట్లు ఎల్ఈడీ హెడ్‌లైట్ల ఫోకస్ వల్లనే అని అంచనా వేస్తున్నారు. 108 ఆంబులెన్స్ డేటా ప్రకారం భోపాల్‌లో పోయినేడాది హెడ్‌లైట్ హైబీమ్ గ్లేర్ వల్లనే 1470 యాక్సిడెంట్లు జరిగాయి. కేరళలో అయితే సాయంత్రం 6 గంటల నుంచి పొద్దున 6 గంటల మధ్యలో 1000కి పైగా ప్రమాదాలు జరిగితే వీటిలో 33% హెడ్‌లైట్ గ్లేర్ వల్లనే అని అంచనా వేస్తున్నారు. గ్లేర్ అంటే లైట్ల ఫోకస్‌కు కండ్లు మూసుకుపోవడం. ఎదురుగా వస్తున్న వెహికిల్స్ భారీ లైట్లతో 200 మీటర్ల దూరం నుంచే కండ్లు మూసుకుపోతాయి పక్కా. ఇగ దీనికి బండి స్లో చేసుకో.. ఏక్‌దమ్ కండ్లు మూసుకోవద్దని చెప్పెటొళ్లే ఉన్నరుగానీ.. ఆ లైట్లను అమర్చుకోకుండ్రిరా సామీ అని చెప్పెటొళ్లు ఎవరూ ఉండరు. ఒకవేళ చెప్పినా వినేటొళ్లే లేరు.
ఏ లైట్ ఎంత ఉండాలె.?
వెహికిల్స్‌కు అమర్చే హెడ్‌లైట్ల సామర్థ్యం వాటి సీడీ యూనిట్లలో కనిపించే తీవ్రతను బట్టి ఉంటుంది. సీడీ అంటే కాండెలా. ఇది 155 మీటర్ల దూరం నుంచి కనిపించాలె. టూవీలర్స్‌కు అయితే ఒకటి లేదా రెండు హెడ్‌లైట్లు అవసరం. దీంట్లో పాసింగ్ బీమ్ అంటే డిప్డ్ లైట్ తీవ్రత AIS-010 ప్రకారం నిర్దిష్ట కోణాల వద్ద 5,100-13,200 cd వరకు ఉండాలె. డ్రైవింగ్ బీమ్ అంటే మెయిన్ బీమ్ 225,000 cd లోపు ఉండాలె. ఇవి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుపు రంగులోనే ఉండాలె. ముందువైపు 500 mm- 1,200 mm ఎత్తులో ఉండాలె. కార్లకైతే పాసింగ్ బీమ్ హెడ్‌ల్యాంప్‌లకు 13,200 cd వరకు ఉండాలి. డ్రైవింగ్ బీమ్ 27,000- 40,500 cd వరకు ఉండాలె. ల్యాంప్‌లు తెలుపు రంగులో 500 mm- 1,200 mm ఎత్తులో అమర్చాలి.
ఇంత లోతుగా ఆలోచించిన పాపాన పోయినమా.?
లైట్లలో హెడ్‌లైట్ ఎల్ఈడీలే కాదు. మనొళ్లు చాలా లైట్లతో ఎక్స్‌పరిమెంట్లు చేస్తుంటరు. ఫ్రంట్ పొజిషన్ ల్యాంప్స్.. బ్యాక్ పొజిషన్ ల్యాంప్స్.. స్టాప్ ల్యాంప్స్.. డైరెక్షన్ ఇండికేటర్స్.. బ్యాక్ రెట్రో రిఫ్లెక్టర్స్.. సైడ్ రెట్రో రిఫ్లెక్టర్స్.. రివర్సింగ్ ల్యాంప్.. హజార్డ్ వార్నింగ్ సిగ్నల్ ఇట్లా చాలా ఉంటాయి. ఇవన్నీ ఏదో మనకు తెలిసిన మెకానిక్ దగ్గర్నో లేక ఎల్ఈడీ ల్యాంప్స్ అమర్చే టెక్నీషియన్ చెప్తేనో అమర్చేవి కావు. ప్రతీ వెహికిల్‌కు పెట్టే ఇవన్నీ.. AIS-008.. AIS-009.. AIS-012 ప్రకారం అమర్చి మెయింటెన్ చేయాలె. టూవీలర్లకు అయితే అదనంగా ఎరుపు రంగు పెడల్ రెట్రో రిఫ్లెక్టర్ అవసరం. ఎల్1 కేటగిరీ డైరెక్షన్ ఇండికేటర్లకు మాత్రం మినహాయింపు ఉంటుంది. మనమెప్పుడైనా మన బండ్లకుండే లైట్ల గురించి ఇంత లోతుగా ఆలోచించిన పాపాన పోయినమా.?
వీళ్లకు సాధ్యం అవగా.. మనకెందుకు కాదు.?
ఇండియాలో వెహికిల్ లైటింగ్ నిబంధనలు పాటించకపోతే రూ.500 నుంచి 5,000 రూపాయల జరిమానా ఉంటది. లేదా ఆర్సీ సస్పెన్షన్ విధిస్తారు. రాత్రిపూట జరిగే యాక్సిడెంట్లలో 50శాతం గ్లేర్ కారణంగానే జరుగుతున్నాయని అనేక విశ్లేషణలు చెప్తున్నాయి. లైట్ల విషయాన్ని సీరియస్‌గా తీసుకొని కఠినంగా అమలు చేస్తున్న దేశాల్లో స్వీడన్ ముందుంది. ఇక్కడ 24 గంటలు హెడ్‌లైట్లు తప్పనిసరి. ఫలితంగా మల్టిపుల్ యాక్సిడెంట్లు 11 శాతం.. డేటైమ్ హెడ్-ఆన్ క్రాష్‌లు 20-30 శాతం తగ్గాయి. యూరప్‌లో 10 శాతం యాక్సిడెంట్లు తగ్గాయి. జపాన్‌లో గ్లేర్ 20 శాతం తగ్గింది. ఆస్ట్రేలియాలో 35 శాతం తగ్గాయి. యూకేలో గ్లేర్ ఫిర్యాదులు 74 శాతం.. యాక్సిడెంట్లు 10 శాతం తగ్గాయి. కాబట్టీ వాహనదారులే కాదు.. పాలనా యంత్రాంగం కూడా దీనిని సీరియస్‌గా తీసుకోవాలి.
మేం చెప్తూనే ఉంటాం: సురేశ్, ట్రాఫిక్ కానిస్టేబుల్
రోజూ వందలాది వెహికిల్స్ చెక్ చేస్తుంటాం. రెగ్యులర్ కేసులతో పాటు లైటింగ్ కేసులు కూడా వస్తుంటాయి. అలాంటివి కనిపించగానే మా పై అధికారులు మమ్మల్ని పురమాయించి ఆధీనంలోకి తీసుకొని విచారించమని చెప్తారు. వీళ్లంతా ఏం చేస్తారంటే వెహికిల్‌తో పాటు వచ్చిన లైట్లను తీసేసే సొంత ప్రయోగాలతో అడ్డమైన చెత్త లైట్లన్నింటినీ అమరుస్తుంటారు. ఇలాంటివి వాడొద్దని ఎంత చెప్పినా జనాల్లో మార్పు రావడం లేదు.
అవగాహన కల్పిస్తాం: దయాకర్, రాచకొండ పోలీస్ కమిషనర్ పీఆర్వో
ట్రాఫిక్.. రోడ్ సేఫ్టీ గురించి జనాలకు రెగ్యులర్‌గా అవగాహన కల్పిస్తుంటాం. ఉన్నతాధికారులు.. సామాజికవేత్తలు.. పర్యావరణవేత్తలు.. మోటివేషనల్ స్పీకర్స్ ఇలా ఎంతోమంది దీంట్లో ప్రత్యక్షంగా భాగస్వామ్యం అవుతుంటారు. మార్పు అయితే కనిపిస్తుంది. కానీ అది ఎంత శాతం అనేది ఇప్పటికిప్పుడు చెప్పలేం. రూల్స్ బ్రేక్ చేయడం అనేది మన యువతలో ఎక్కువగా కనిపిస్తుంది. రూల్స్ ఫాలో అయితే జరిగే మంచి గురించి ఆలోచిస్తేనే సంపూర్ణ మార్పు సాధ్యం.
ఇదేం పద్ధతో మరీ: రాము, నల్లగొండ
ఈ మధ్య యువత అదనపు కోటింగులకు అలవాటు పడుతోంది. అంటే పైపై మెరుపులు అన్నమాట. ఏమన్నంటే ట్రెండ్ అంటరు. బైక్ ఒరిజినల్ లైట్లు పీకేసీ అవతలి వాళ్లకు అసౌకర్యం.. ప్రమాదం కలిగించే అడ్డమైన ఎల్ఈడీ లైట్లు పెట్టుకొని బలాదూర్ తిరగడం ఏంటో అర్థం కాదు. ప్రాణం ఎవరిదైనా ప్రాణమే. అవే లైట్ల ప్రభావం మన వరకు వస్తే.. జరగరానిదేదైనా జరిగితే అప్పుడేంటి పరిస్థితి అని ఆలోచిస్తే మంచిది.






