- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Disha Special: స్కైలాబ్.. మానవ సంబంధాలను ఏకం చేసిన ఉపగ్రహం
స్కైలాబ్ (Skylab).. ఈ పేరు చెబితేనే వణికిపోయారు. ఇప్పుడు కాదు.. 1970 ప్రాంతంలో ప్రపంచమే గడగడలాడింది.

స్కైలాబ్ (Skylab).. ఈ పేరు చెబితేనే వణికిపోయారు. ఇప్పుడు కాదు.. 1970 ప్రాంతంలో ప్రపంచమే గడగడలాడింది. ప్రపంచ పరిశోధనా సంస్థ నాసా(Nasa) చేసిన తప్పిదం, ఒక మిల్లీమీటరు శకలం (fragment) తెచ్చిన ప్రమాదం అది. అమెరికా అంతరిక్ష కేంద్రం ప్రపంచ దేశాలను వణికించిన మరిచిపోని ఘట్టమది. ఓ వైపు చావు భయంతో ప్రజలు బెంబేలెత్తిపోగా, మరోవైపు ఆ ఉపద్రవం మానవ సంబంధాలకు కూడా ఊతం పోసింది. చివరకు ఆ స్కైలాబ్ ఉపద్రవం హిందూ మహాసముద్రంలో కాలగర్భం కలిసిపోగా, ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఈ ఘటన ఆధారంగా స్కైలాబ్ అనే తెలుగు చిత్రాన్ని ఓ దర్శకుడు రూపొందించాడు. కాగా అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ స్కైలాబ్ ప్రభావం ఉమ్మడి కరీంనగర్ జిల్లాపైనా అత్యధికంగా ఉంది. అప్పటివారిని ఎవ్వరిని కదిపినా అప్పుడు జరిగిన సంఘటనలను గుర్తుకు తెచ్చుకొని ఓ రవ్వంత ఆశ్చర్యానికి గురైతున్నారు. అప్పుడు వారు చావు భయంతో చేసిన చిత్ర, విచిత్రమైన పనులను గుర్తుకు తెచ్చుకొని నవ్వుకుంటున్నారు. -నీరటి నవీన్ కుమార్
అమెరికా అంతరిక్ష కేంద్రం (స్కైలాబ్)
1960-70 మధ్యకాలంలో అమెరికా-రష్యా (America-Russia) దేశాల మధ్య విశ్వాన్ని జయించాలనే పోటీ ఎక్కువగా ఉండేది. స్పేస్ ఆధునికతలో రష్యా ఒక అడుగు ముందుకు వేసి 1971లో సెల్యూట్ వన్ అనే అంతరిక్ష కేంద్రాన్ని అంతరిక్షంలోకి పంపింది. ఈ అంతరిక్ష కేంద్రం (space station) హక్కులు రష్యాకు మాత్రమే ఉండేవి. ఇతర దేశాలకు దానిపై హక్కులు ఉండకపోవడంతో అమెరికా కూడా ఎలాగైనా సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకుంది. సూర్యుడు, చంద్రుడు ఇలా చాలా వాటిపై పరిశోధనలు చేయడానికి స్కైలాబ్ అనే అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసి విశ్వంలోకి పంపింది. దీని పొడవు 82.4 అడుగులు(25.1 మీటర్లు), వెడల్పు 55.8అడుగులు (17 మీటర్లు), ఎత్తు 36.3 అడుగులు(11.1 మీటర్లు), బరువు, 168,750 పౌండ్ల 76, 540 కిలోలు..
మిల్లీమీటరు శకలం తెచ్చిన తంట
సరిగ్గా నిన్నటికి 52 ఏళ్ల క్రితం 1973 మే 14న సాటర్న్ వి అనే రాకెట్ ద్వారా స్కైలాబ్ అనే ఉపగ్రహాన్ని అమెరికా పరిశోధన సంస్థ (నాసా) అంతరిక్షంలోకి పంపింది. అయితే ఈ ప్రయోగం చేసిన సమయంలోనే నాసాకు దురదృష్టమైన సంఘటన ఎదురైది. భూ వాతావరణంలోని ఓ మిల్లీమీటర్ శకలం ఆకాశంలో ఉండే స్కైలాబ్ అంతరిక్ష కేంద్రాన్ని ఢీకట్టింది. దీంతో స్కైలాబ్ హీట్ హెల్, సోలార్ ప్యానల్ దెబ్బతింది. అయితే స్కైలాబ్ కక్ష్యలకి చేరాక అంతరిక్ష కేంద్రం దెబ్బతిన్నట్టు నాసా గుర్తించింది. తీవ్రమైన సౌరవేడితో స్కైలాబ్ రక్షణ లేకుండా పోవడంతో స్కైలాబ్ 2 మిషిన్ ద్వారా ఆస్ట్రోనాట్స్ బృందాన్ని అంతరిక్ష కేంద్రానికి నాసా పంపింది. అంతరిక్ష కేంద్రంలో 28 రోజులు ఉన్న వ్యోమగాములు హీట్ షెడ్ ను ఏర్పాటుచేసి సోలార్ ప్యానల్ ను సరి చేశారు.
ఏడాది ముందే భూమిపైకి
స్కైలాబ్ అంతరిక్ష కేంద్రానికి ఉన్న రెండు గైరోస్కోప్స్ లలో అంతరిక్ష కేంద్రం కదిలే విషయాన్ని తెలిపే గైరోస్కోప్ పనిచేయడం లేదని నాసా 1975లో గుర్తించింది. ఆ సమయంలో స్కైలాబ్ భూమి నుంచి 430 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. కాగా వాతావరణ సాంద్రత, గ్రావిటీ, ఆయ వస్తువు ద్రవ్యరాశి ఆధారంగా 430 కిలోమీటర్ల కక్షలో తిరిగే ఏ వస్తువైనా భూమి పైకి వచ్చే అవకాశం ఉంది. నాసా అంచనా ప్రకారం 1980 వరకు కక్షలోనే స్కైలాబ్ ఉంటుందని, దానికి మరికొన్ని పరికరాలు జోడించి మరో ఐదేండ్లు కక్షలోనే స్కైలాబ్ ను ఉంచాలని నాసా భావించింది. కానీ దానికి సోలార్ ఫ్లల్ అడ్డంగా మారి దాని డెన్సిటీ పెరిగింది. దాంతో 1980లో వస్తుందన్న ఉపద్రవం 1979లో రానుందని నాసా గుర్తించి, ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసింది. కానీ ఆ స్కైలాబ్ ప్రపంచ దేశాలలో ఎక్కడ పడుతుందో మాత్రం తెలుపలేదు.
మానవ సంబంధాలకు ఊతం
తాను ఒకటి తొలిస్తే దైవం మరొకటి తలచినట్టు విశ్వాన్ని జయించడానికి అంతరిక్షంలోకి పంపిన స్కైలాబ్ అంతరిక్ష కేంద్రం భూమిపై పడుతుండడంతో ప్రపంచ దేశాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అప్పట్లో ఇంతలా సామాజిక మాధ్యమాలు, ప్రచార మధ్యమాలు లేవు. టీవీ ప్రసారాలు, వార్తాపత్రికలు కూడా ఎక్కువగా లేవు. అత్యధికంగా రేడియో (ఆకాశవాణి) ద్వారానే వార్తలు ప్రజలకు చేరేవి. ఈ రేడియోల ద్వారానే స్కైలాబ్ భూమిపై పడుతుందని ప్రపంచమంతా తెలుసుకున్నారు. కానీ ఒక దినపత్రికలో వచ్చిన వార్త ఉమ్మడి కరీంనగర్ జిల్లాను వణికించింది. స్కైలాబ్ ఉపగ్రహం తెలంగాణ ప్రాంతంలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా (Karimnagar District) ప్రస్తుత జగిత్యాల జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లాలో పడుతుందని వార్తలు వచ్చాయి. స్కైలాబ్ ఉపద్రవం ఈ ప్రాంత ప్రజల్లో చావుడంకా మోగించింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని వారు బిక్కుబిక్కుమంటూ జీవించారు. ఈ నేపథ్యంలో గొడవలు, ద్వేషాలు మానుకొని అందరూ కలిసి జీవించారు. ఎలాగో చావు తప్పదని భావించిన వారు బంధాలు, బంధుత్వాలకు విలువనిచ్చారు. కుల, మత తారతమ్యం లేకుండా అన్యోన్యంగా బతకడం ప్రారంభించారు. స్కైలాబ్ ఈ ప్రాంతంలో పడుతుందనడంతో వారిలో స్కైలాబ్ మళ్లీ మానవ సంబంధాలకు ఊతం పోసిందని చెప్పుకోవచ్చు.
జల్సాలు, వలసలు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాను స్కైలాబ్ అత్యంత భయపెట్టింది. ఈ ప్రాంతంలో ఆ ఉపద్రవం పడుతుందని ప్రచారం జరగడంతో ఇక్కడి ప్రజలు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బతికారు. కొందరు పెట్టే, బేడా సర్దుకుని వలసలు వెళ్లిపోగా, మరికొందరు బావులలో తలదాచుకున్నారు. డబ్బు ఉన్నవారు ఇవే తమ ఆఖరి క్షణాలు అంటూ జల్సాలు చేశారు. దాంతోపాటు దానధర్మాలు కూడా చేశారు. ఇక మందుబాబులైతే అడ్డు అదుపు లేకుండా పీకలదాకా తాగేసి ఎంజాయ్ చేశారు. కొన్ని గ్రామాల్లో అందరూ ఒకచోట చేరుకొని ఒకరు ఒకరు పట్టుకొని ఏడ్చేశారు. వ్యాపారవేత్తలు, ధనవంతులు తీర్థయాత్రలకు వెళ్లిపోయారు. ఇక పేద ప్రజలు గ్రామాల్లోని దేవాలయాల్లో తలదాచుకున్నారు. కొందరైతే తమ వద్ద ఉన్న డబ్బు, నగలు భూమిలో పాతిపెట్టారు. చాల మంది బావుల్లో నివసించారు.
ఊపిరి పీల్చుకున్న ప్రపంచ దేశాలు
ఇదిలా ఉండగా స్కైలాబ్ ఉపగ్రహం 1979 జూలై నెలలో భూమిని తాకనున్నట్లు నాసా అంచనా వేసింది. అది భారత కాలమానం ప్రకారం 1979 జూలై 11న రాత్రి భూతావరణంలోకి రావడం ప్రారంభించింది. కాగా స్కైలాబ్ భూమి వరకు రాగానే సుమారు 1000 కిలోమీటర్ల విస్తీర్ణంలో పడే అవకాశం ఉందని, అది రెండువేల ముక్కలుగా విచ్చిన్నమై సుమారు లక్షకుపైగా మరణాలు సంభవిస్తాయని నాసా తెలిపింది. దాంతో స్కైలాబ్ ఎక్కడ పడుతుందో తెలియక ప్రపంచ దేశాలు ప్రాణాలు వారి చేతిలో పెట్టుకొని జీవించాయి. కానీ స్కైలాబ్ 1979 జూలై 11న విచ్ఛిన్నమై హిందూ మహాసముద్రంలో 5000 కిలోమీటర్ల విస్తీర్ణంలో పడగా, మిగతావి దక్షిణ ఆస్ట్రేలియాలో పడ్డాయి. ఏలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రపంచ దేశాల ప్రజలు, ముఖ్యంగా భారతదేశ ప్రజలు, అందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన తరువాత కొంతమందికి కలిగిన సంతానానికి స్కైలాబ్ అనే పేరు కూడా పెట్టుకున్నారంటే ఆ ఉపద్రవం తెలుగు రాష్ట్రాల్లో ఎంత ప్రభావం చూపిందో స్పష్టమవుతుంది.
ఘటన ఆధారంగా తెలుగు చలనచిత్రం
ఈ ఘటన ఆధారంగా 2021లో స్కైలాబ్ తెలుగు చలనచిత్రం తెరకెత్తింది. ఈ చిత్రానికి విశ్వఖండే రావు దర్శకత్వం వహించగా, సహదేవ్, నిత్యామీనన్ లు హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం 4-12-2021లో విడుదలై మంచి ప్రేక్షక ఆదరణ పొందింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రస్తుత జగిత్యాల జిల్లాలోని బండలింగంపల్లి గ్రామంలో జరిగిన సంఘటనలను అచ్చం 1970 దశకంలో జరిగినట్టుగా దర్శకుడు చిత్రాన్ని రూపొందించారు. స్కైలాబ్ ఉపద్రవం తమ గ్రామంలోని పడుతుందని, బండ లింగంపల్లి గ్రామ ప్రజలు చేసిన చిత్ర, విచిత్రమైన విషయాలు, భావోద్వేగ ఘటనలను పత్రికా ప్రతినిధిగా ఓ వార్తాపత్రికలో హీరోయిన్ నిత్యామీనన్ ప్రచురితం చేస్తుంది. తదనంతరం ఆ ప్రచురితమైన కథనాలు చరిత్రలో ఆధారాలుగా మిగిలిపోతాయి ఇదే చిత్ర సారాంశం. అంతేకాకుండా ప్రస్తుత జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలలో గ్రామ గ్రామాన అప్పుడు జరిగిన విషయాలను ‘మంటల వర్షం’ అనే పుస్తకంలో క్షుణ్ణంగా రాసినట్టు సమాచారం.






