కనుమరుగు కానున్న పోస్టు బాక్సులు

by Muthe.Rajitha |   (  Updated:2025-08-15 13:29:43  IST  )

1854 సంవత్సరం బ్రిటిష్ కాలంలో మనదేశంలోకి ప్రవేశ పెట్టబడిన పోస్టు బాక్సులు ఇకపై కనుమరుగు కానున్నాయి.

కనుమరుగు కానున్న పోస్టు బాక్సులు
X

దిశ, వెబ్ డెస్క్ : 1854 సంవత్సరం బ్రిటిష్ కాలంలో మనదేశంలోకి ప్రవేశ పెట్టబడిన పోస్టు బాక్సులు ఇకపై కనుమరుగు కానున్నాయి. భారతీయులతో 180 ఏళ్ల నుంచి పెనవేసుకున్న ఈ బంధం ఇక తెగిపోనుంది. రెండు దశాబ్దాల క్రితం వరకు ప్రజలు పోస్టు బాక్సులతో, ఉత్తరాలతో విడదీయరాని బంధాన్ని పెనవేసుకున్నారు. బంధువులకు, స్నేహితులకు రాసిన ఉత్తరాలను, గ్రీటింగ్ కార్డ్స్, అలాగే అభిమాన రచయితలకు, సినీతారలకు రాసిన లెటర్స్ తోపాటు ఊరు పేరు లేకుండా రాసే ఆకాశ రామన్న ఉత్తరాలను ముందు ఈ పోస్టు బాక్సుల్లో పడేస్తే.. అక్కడి నుంచి చేరవలసిన చోటుకు చేరేవి.

అయితే పెరుగుతున్న టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని, అనివార్య ఖర్చులను తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఇకపై నెమ్మదిగా ఈ పోస్టు బాక్సులను తొలగించనున్నారు. అందులో భాగంగా మొదట దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి రిజిస్టర్డ్ పోస్ట్ సేవలు నిలిపివేయనున్నట్టు సమాచారం. గత రెండు దశాబ్దాల నుంచి ఇంటర్నెట్, డిజిటల్ కమ్యూనికేషన్‌ల వల్ల సాధారణ రిజిస్టర్ పోస్టులు, పోస్టు బాక్సుల ఉపయోగం గణనీయంగా తగ్గిపోయింది. ఇకపై ఈ సేవను స్పీడ్ పోస్ట్‌లో విలీనం చేయడం ద్వారా, పోస్టల్ డిపార్ట్‌మెంట్ ట్రాకింగ్ లో మరింత ఖచ్చితత్వాన్ని, డెలివరీ వేగాన్ని, ఆపరేషనల్ ఎఫిషియన్సీని మెరుగుపర్చాలని ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

రిజిస్టర్డ్ పోస్టులు ముఖ్యమైన డాక్యుమెంట్లు, లెగల్ నోటిస్‌లు, ప్రభుత్వ సంబంధిత సమాచారాన్ని సురక్షితంగా డెలివరీ చేయడంలో కీలక పాత్ర వహించాయి. అయితే, రిజిస్టర్ పోస్టు ఖరీదు కంటే స్పీడ్ పోస్టు ఖరీదు ఎక్కువగా ఉండటం వల్ల, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలపై ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. కాగా కొత్త విధానాన్ని అమలు చేయడానికి, పోస్టల్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్, అన్ని డిపార్ట్‌మెంట్లు, కోర్టులు, విద్యా సంస్థలు, వినియోగదారులను సెప్టెంబర్ 1 నాటికి కొత్త వ్యవస్థకు మారాలని సూచించారు.

ఈ కొత్త విధానంపై పోస్టల్ ఉద్యోగి అఖిలేష్ కాసాని మాట్లాడుతూ.. పోస్టు బాక్సుల సర్వీసుల వల్ల సంస్థకు ఆర్థిక భారం తప్ప పెద్దగా ఉపయోగం లేదన్నారు. అలాగే దేశంలో అన్ని సంస్థలు టెక్నాలజీ వైపు చూస్తున్నపుడు పోస్టల్ వ్యవస్థ కూడా దాన్ని అందిపుచ్చుకుని వినియోగదారులకు మెరుగైన సౌకర్యం అందించడం కోసం ఈ విధానం తీసుకు వస్తోందని వెల్లడించారు.

Next Story