ఫ్రీ కరంటే కదా ఫికరెందుకు.? 24x7 ఫ్యాన్లు, బల్బులు వేసే ఉంచుదాం.!

by Daayi Srishailam |

కరెంట్‌ను సేవ్ చేయజాలకపోవడం ప్రపంచంలో మరెక్కడా లేకపోయుండొచ్చు ఒక్క ఇండియాలో తప్ప.

ఫ్రీ కరంటే కదా ఫికరెందుకు.? 24x7 ఫ్యాన్లు, బల్బులు వేసే ఉంచుదాం.!
X

ఖర్చయ్యేది మనదైతే కండీషన్ల మీద కండీషన్లు పెడతాం. భారం మన మీద పడేదైతే భారీ షరతులు పెట్టుకుంటాం. కానీ, ఇక్కడ ఖర్చు చేసేది మనమే అయినా భారం పడేది మనమీద కాదు కాబట్టీ కరెంటును ఇష్టమొచ్చినట్లు వాడేస్తం. స్విచ్ ఆఫ్ చేయాలంటే చిన్నతనం మనకు. లైట్ ఆర్పడం నామోషీ. మన ఇంట్లో.. మనం వాడుతున్న కరెంట్‌ను.. మన కోసం సేవ్ చేయజాలకపోవడం ప్రపంచంలో మరెక్కడా లేకపోయుండొచ్చు ఒక్క ఇండియాలో తప్ప.

- దాయి శ్రీశైలం

ఆఫ్ చేసే అలవాటే లేదు

"అక్కెరున్నంత సేపు ఆదినారాయణ.. అక్కరదీరినంక గూదనారాయణ" అన్నట్లే ఉంటది మనొళ్ల కథ. మనల్ని వెలుగు తొవ్వన నడిపించే "కరెంటు"ను వాడినంత సేపు వాడతాం. మన అక్కెర తీరంగనే దాంతో మనకు సంబంధమే లేదనట్టు తమాషా చూస్తం. లైటింగ్ కోసం బల్బేస్కుంటం. సల్లదనం కోసం ఫ్యానేస్కుంటం. ఉల్లాసం కోసం టీవీ ఆన్ చేసుకుంటం. బయటకు పోవడానికి అద్దగంట సేపు అద్దం ముందు నిలబడి తయారైతంగానీ, అర నిమిషం కేటాయించి స్విచెస్ ఆఫ్ చెయ్యం. టీవీనైతే మర్చిపోకుండా బంద్ చేస్తం. ఎందుకంటే అది లక్ష రూపాయలు పెట్టి కొన్న టీవీ కదా.? పాడైపోతే నష్టపోతం మరీ.

ఆ ఖర్చు ఎవరు భరించాలి.?

"అడ్డెడొడ్ల ఆశకువోతే తూమెడొడ్లు గొడ్డుదిని పోయిందంట". జనాల మైండ్‌సెట్ సేమ్ ఇట్లనే ఉంది. లక్ష రూపాయలు పెట్టి కొన్న టీవీ కరాబైతదని గుర్తుంచుకొని మరీ టీవీ స్విచ్ బంద్ జేస్తంగానీ, లైట్లు, ఫ్యాన్ల స్విచ్‌ల గురించి ఆలోచిస్తమా.? "ఫ్రీ కరెంటే"నాయె. సర్కారు 200 యూనిట్లదాక ఫ్రీగా ఇస్తుంది కాబట్టి.. ఆ టార్గెట్ రీచవ్వాలంతే. ఎంతసేపూ ఫ్రీ కరెంటేగదా? దాని బిల్లు గవర్నమెంటే కడుతుంది అనుకుంటాం. అందుకే టీవీ మీదున్న సోయి కరెంటు మీదుండదు. టీవీ ఖర్చును లెక్కపెడ్తున్నాంగానీ, కరెంటు వృథా చేయడం వల్ల అది పన్నుల రూపంలో మనమీద ఎంత భారాన్నేస్తుందో ఒక్కసారైనా ఆలోచించినమా.?

నువ్వా నేనా అనే వంతు.?

మాగ్జిమమ్ మన ఇండ్లల్ల బాత్రూమ్‌ లైట్స్ ఆన్ చేసే ఉంటయి. పది పదిహేను నిమిషాలకోసారి ఎవరో ఒకరు వెళ్తనే ఉంటరు. కానీ అదేందో స్విచ్ దిక్కు ఒక్కరి చెయ్యీ పోదు. ఏదో అంటరానిదన్నట్టు చూస్తరు స్విచ్ బోర్డును. అన్న బంద్ జేస్తడని తమ్ముడు.. చెల్లె బంద్ జేస్తదని అక్క.. ఇట్లా ఎవరికి వాళ్లు వంతులు పెట్టుకుంటరు. పొద్దున్నే కాదు, నైటంతా ఆ లైటే వేసే ఉంటది. ఎవరో ఒకరు పుణ్యాత్ములు దయగలిగి బంద్ జేస్తేతప్ప మామూలుగైతే దాని జోలికివొయ్యిన మహానుభావులెవరూ ఉండరు. "శింతకాయల బేరంజేస్తూ వంకాయల్ని ఏరినట్లు" ఇంకెవరో ఆఫ్ చేస్తరని ఆ ముచ్చటే యాదిజెయ్యరు.

ఎవరు చెప్పాలె మనకు.?

"ఆకలైతే అన్నం తింటాం. దూపైతే నీళ్లు తాగుతాం. అట్లనే నిద్రొస్తే పండుకుంటం". మనకు ఏయే అవసరాలున్నయో అవన్నింటినీ సక్రమంగా చేసుకుంటం. చేతి నుంచి పెట్టే పది పైసల గురించైతే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తం. కానీ మనకు కనవడకుండా అయ్యే ఖర్చు గురించి ఒక్కసారిగూడ ఆలోచనజెయ్యం. ఆకలైతే, దూపైతే నిత్యవసరాలు సమకూర్చుకున్నట్లు కరెంటును కూడా ఓ కంట కనిపెట్టొచ్చు కదా.? మన ఇంట్ల అవసరం లేకపోతే లైట్లు బంద్ జెయ్యాలనీ, కరెంటును పొదుపుగా వాడాలని ఎవరో వచ్చి డప్పు సాటింపేశి చెప్పాల్నా.? మన సోయి మనకండదా.? మన వనరుల మీద మనకు నియంత్రణ ఉండొద్దా.?

ఫ్రీగా వస్తే బంద్ చేయొద్దా.?

"వంకలేనమ్మ డొంక పట్టుక తిరిగిందన్నట్లు" కరెంటును ఆదా చేయడం చేతగాక "పుణ్యానికొచ్చిన కరెంటే కదా.? సర్కారేమన్న జేబులకెంచి కడ్తుందా. మన పైసలే పెడ్తుందిగదా" అని అంటుంటరు కొందరు. ఫ్రీగా ఇస్తే ఆదా చెయ్యొద్దనే రూలేమైనా ఉందా.? అవసరం లేకున్నా వాడెయ్యాలనే కండీషనేదైనా ఉందా.? ఆలోచించుకోవాలె. అసలే మనం కరెంటును వేరే రాష్ట్రాలకెల్లి కొంటున్నం. ఇట్లా వేస్ట్ జేశిన ప్రతీ యూనిట్ తర్వాత మన మెడకే పడుతుందనే సోయి లేకపోతే ఎట్ల చెప్పున్రీ.? పైసలైతే దాచిపెట్టుకుంటం కదా.? కరెంటుగూడ మనమిచ్చే పైసలతో వస్తుందన్నప్పుడు మరి ఎందుకీ వృథా.?

బిల్లు కడితే దుర్వినియోగం చేయొచ్చా.?

"భోజనానికి పిలిస్తే రాకుండా.. దొడ్డిదారినొచ్చి రోలు నాకినట్లు" కరెంటు పొదుపు విషయంలో డొంక తిరుగుడెందుకు.? కొందరంటరు.. "మాకు ఫ్రీ కరెంటులేదు. మేం బిల్లు కడ్తు్న్నంగదా.? మా కరెంటు మా ఇష్టం.. మీకేంది సమస్యా" అనీ. ఇక్కడ బిల్లు కట్టుడు, కట్టకపోవడు కాదు సమస్య. అవసరం లేకున్నా కరెంటు వాడటం వల్ల కరెంటుకు నష్టం జరుగుతుంది. అవసరం లేకున్నా మన జేబులున్న పైసల్ని దుబారా చేసినట్లే ఇదిగూడ. వనరులను వాడటమే కాదు, వాటిమీద బాధ్యత, నియంత్రణ కూడా ఉంటేనే భవిష్యత్‌లో వాటి లభ్యత సాఫీగా జరుగుతుంది. అందుకే కరెంటు మీద కూడా విచక్షణ అవసరం.

మనం ఒక్కరమే కాదు

"బట్టతలున్నామెకు పాపిట తీయమన్నట్లు" ఒకదిక్కు కరెంటును అడ్డగోలుగా వృథా చేస్తుంటాం. ఇంట్లో మనుషులుండరుగానీ.. బెడ్రూంలో లైట్ వెలుగుతనే ఉంటది. హాల్‌లో ఫ్యాన్ తిరుగుతనే ఉంటుంది. "మనమొక్కరం చేస్తెనే కరెంటు ఆగమైతదా.?" అని వాదిస్తరు. మనమొక్కరమే కాదు అందరూ ఇట్లనే అనుకొని నష్టం కలిగిస్తుండ్రు. మనదగ్గర కరెంటు ఎక్కువగా బొగ్గుతోని (77.52% ఫాసిల్ ఇంధనాలు) తయారైతది. 1 కిలోవాట్ కరెంటు వేస్టయితే ఇంచుమించు 713 గ్రాముల సీఓ2 ఉద్గారాలు బైటికొస్తయి. పైసల పరంగానూ.. పర్యావరణ పరంగానూ ఇది చాలా నష్టంజేసేదే.

ఒక బల్బ్ ఆర్పకపోతే.?

మనకున్న ఇంకో దరిద్రమేందంటే వీధిలైట్లు 24 గంటలూ వెలుగుతనే ఉంటయి. కరెంటు డిపార్ట్‌మెంట్ వాళ్లేమో "ఎవరి ఇంటి ముందుండే స్తంభం లైట్ వాళ్లే ఆఫ్‌జెయ్యాలె"అని అంటరు. జనాలేమో.. "జీతం మాకిస్తుండ్రా మేమెందుకు బంద్ జేస్తం.?" అంటుంటరు. ఇట్లా "ఎల్లి మీద మల్లి.. మల్లి మీద ఎల్లి" చెప్పి కోట్ల రూపాయల నష్టం చేస్తుండ్రు. ఇండియాలో సుమారు 3.5 కోట్ల ఎల్ఈడీ వీధి దీపాలున్నాయని ఒక అంచనా. సకాలంలో వీటిని ఆర్పకపోవడం వల్ల ఒక సగటున 75 వాట్స్ కరెంటు వేస్టయితుంది. ఇట్లా 3.5 కోట్ల బల్బులతో యేడాదికి 1.92 బిలియన్ కిలోవాట్ కరెంటు వేస్టయ్యి, రూ.1536 కోట్ల నష్టం వస్తుంది.

ఒక యూనిట్ వృథాకు..

"బడాయి బండెడు.. బతుకు తట్టెడు" అన్నట్లు "హే.. రెండు మూడు యూనిట్లకే కొంపలు మునిగిపోయినట్లు చేస్తరేందీ" అనిపిస్తుండొచ్చు. కానీ, ఆ రెండు మూడు యూనిట్లు దేశం నెత్తిన భారం మోపుతున్నయి. ఇండియాలో ఇంటి అవసరాల కరెంటు చార్జ్ కిలోవాట్‌కు సగటున రూ.6.47. (రాష్ట్రాలను బట్టి మారుతుంది) ఇందులో విద్యుత్ ఉత్పత్తి, ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ ఖర్చులతో పాటు పన్నులు, ఇతర చార్జీలు ఉంటయి. సగటున డొమెస్టిక్ పవర్ ధర రూ.6.47 అనుకుంటే ఇందులో పన్నులు, ఛార్జీలే సుమారు 20-30% ఉంటాయి. ఒకసారి ఊహించుకోండ్రి ఏడాదికి ఒక యూనిట్ కరెంటు వృథా ఎంత భారమైతుందో.?

వృథా ఇలా చేస్తుండ్రు

ఇండియాలో సగటున 20-22% కరెంటు వృథా అవుతోందని ఒక అంచనా. తెలంగాణ విషయానికొస్తే వివిధ రూపాల్లో 15-17% కరెంటుకు నష్టం వాటిల్లుతోంది. కరెంట్ వృథాకు మెయిన్ కారణం ఇంట్లో స్విచ్‌లు, ఫ్యాన్లు ఆఫ్ చేయకపోవడం, వీధి దీపాలను సక్రమంగా ఆర్పకపోవడమేనని అంటున్రు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో రైతాంగానికి ఉచిత కరెంటు ఉండటం వల్ల మోటర్ ఆఫ్‌లో పెడితే బోరుబావిలోని నీళ్లు వృథా పోతాయనే ఉద్దేశంతో కొందరు అవసరం లేకున్నా ఉత్తగనే ఆన్ చేసి పెడ్తుండ్రు. దీనివల్ల కరెంటు వృథా సమస్య ఎక్కువైతుందని నిపుణులు చెప్తుండ్రు.

ఆపేయండి

కరెంటును వృథా చేసేటొళ్లు జర ఇప్పటి నుంచైనా లైట్లను, స్విచ్‌లను ఆపేయాలె. రూంలో ఎవరూ లేకపోతే లైట్లెందుకు, ఫ్యాన్లెందుకు.? వాడనప్పుడు చార్జర్లు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్లను అన్ ప్లగ్ చేయాలె. ఎందుకంటే స్టాండ్ బై మోడ్‌లో కూడా కరెంటు వృథా అవుతుంది. దీనినే ఫాంటమ్ లోడ్ అంటరు. నైట్ పండుకునెటప్పుడు అన్ని లైట్లు, డివైజెస్ ఆఫైనయో లేదో చెక్ చేయాలె.

అవి బెటర్

శక్తి సామర్థ్యమున్న ఉపకరణలను వాడటం మంచిది. బల్బ్‌ల విషయానికొస్తే ఎల్ఈడీ బల్బులను వాడాలె. ఇవి సాంప్రదాయ ఇన్‌కాండసెంట్ బల్పులకంటే 80% తక్కువ కరెంట్‌ను వినియోగిస్తయి. 5 స్టార్ రేటింగున్న ఫ్రిడ్జ్, ఎయిర్ కండీషనర్లు, వాషింగ్ మెషీన్లు వాడాలె. ఇవి దీర్ఘకాలంలో కరెంటును ఆదా చేసి బిల్లులను తగ్గిస్తయి. సహజ వెలుగు, గాలిని ఉపయోగించడం వల్ల లైట్లు, ఫ్యాన్ల వాడకాన్ని తగ్గించొచ్చు.

స్మార్ట్ వాడకం

టైమర్ లేదా సెన్సార్ ఆధారిత స్విచ్‌లను వాడటం మంచిది. కరెంటు అవసరం లేనప్పుడు ఇవి ఆటోమేటిగ్గా ఆపేస్తయి. అట్లనే స్మార్ట్ పవర్ స్ట్రిప్స్ ఉపయోగిస్తే మల్టిపుల్ డివైజెస్‌ని ఒకేసారి ఆపేస్తయి. వాటర్ హీటర్ ను అవసరమైనంత సమయం మాత్రమే ఆన్ చేయాలె. థర్మోస్టార్ట్‌ను 50-60°Cకి సెట్ చేయడం మంచిది. ఏసీని 24-26°C వద్ద ఉంచుండ్రి. ఇది పవర్ కెపాసిటీని పెంచుతది.

ఆటోమేషన్ సిస్టమ్స్

వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులు ప్రొఫెషనల్ ఎనర్జీ ఆడిటర్‌ను పెట్టుకొని ఎక్కడ కరెంటు వేస్ట్ ఐతుందో గుర్తించుండ్రి. పాత మోటార్లు, మెషీన్లు ఎక్కువ కరెంట్‌ను తీస్కుంటయి. ఎక్కువ కెపాసిటీ ఉన్న మోటార్లు, ఇన్వర్టర్ టెక్నాలజీ బేస్డ్ ఏసీలు, ఎల్ఈడీ లైటింగ్ సిస్టంను ఇన్‌స్టాల్ చేసుకోవాలె. సెన్సార్ బేస్డ్ లైటింగ్, హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండీషనింగ్ సిస్టమ్స్ ఉపయోగించి అనవసర వినియోగాన్ని తగ్గించుకోవచ్చు.

పవర్ ఫ్యాక్టర్

కెపాసిటర్ బ్యాంక్స్ ఇన్‌స్టాల్ చేయడం వల్ల పవర్ ఫ్యాక్టర్‌ను మెరుగుపరవచ్చు. ఇది కరెంటు వాడకాన్ని కూడా తగ్గిస్తుంది. వీధి దీపాలను సకాలంలో ఆన్ ఆఫ్ చేస్తందుకు టైమర్లు లేదా సెన్సార్లు ఇన్‌స్టాల్ చేయడం మంచిది. స్మార్ట్ స్ట్రీట్ లైటింగ్ సిస్టమ్ ఉపయోగించి రిమోట్‌గా లైట్లను కంట్రోల్ చేయొచ్చు. ఇంకా కరెంట్ వృథాను గుర్తించొచ్చు. వ్యవసాయానికి అధిక సామర్థ్యంగల పంప్‌సెట్లను వాడటం మంచిది.

అవగాహన కల్పిస్తా: ఎన్. గీత, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్

ఎవరి ఇంట్లో అయినా లైట్లు, ఫ్యాన్లు ఉత్తగనే ఆన్లో ఉండటం చూస్తుంటం. ముఖ్యంగా పిల్లలు ఆడుకునేటప్పుడు లేదా బయటకు వెళ్లినప్పుడు మర్చిపోతుంటరు. టీవీ, ఛార్జర్లు స్టాండ్ బై మోడ్‌లో ఉండటం వల్ల కూడా కొంత విద్యుత్ ఆదా అవుతుందని తెలిసింది. ఇలాంటివి చూసైనా మార్పొస్తే బాగుంటది. ఒక పీఈటీగా నేను ఇలాంటి విషయాల్లో పిల్లలకు అవగాహన కల్పిస్తుంటా.

సక్రమంగా ఉండాలె: కె. రవీందర్ రెడ్డి, టెలికం కాంట్రాక్టర్

టెలికం రంగంలో కరెంట్ వృథా ఎక్కువగా టెలికాం టవర్లు, డేటా సెంటర్ల ద్వారా ఐతుంది. ఒక సగటు టెలికం టవర్ రోజుకు 20-30 కిలోవాట్స్ కరెంటును తీసుకుంటుంది. చాలా సందర్భాల్లో టవర్లలో ఉపయోగించే ఎయిర్ కండీషనర్లు, పాత బ్యాటరీ బ్యాకప్ సిస్టమ్స్ అసమర్థంగా ఉండటం వల్ల కరెంట్ వేస్టేజ్ అవుతుంది. కాబట్టీ వాటిని సక్రమంగా నిర్వహించాలె.

కావాలని చెయ్యడు: జి. లింగం గౌడ్, రైతు, నాగర్ కర్నూల్

వ్యవసాయంలో కూడా కొన్నిచోట్ల కరెంటు వేస్టేజీ అవుతోంది. ముఖ్యంగా బోర్ల వాడకంలో. ఫ్రీ కరెంటు ఉందని కొందరు రైతులు కొన్నిసార్లు అవసరం లేకున్నా బోర్ మోటర్లను ఆన్‌లోనే ఉంచుతరు. ఇలాంటి సందర్భాలు తక్కువనే అయినా 5హెచ్‌పీ మోటరు పంపు సామర్థ్యం ఎక్కువ కావడంతో ఎక్కువ కరెంటు వృథా ఐతుంటది. మోటర్ పెట్టకపోతే నీర్లు ఇంకిపోతయేమో అనే భయమే తప్ప రైతు కావాలని ఇట్ల చెయ్యడు.

Next Story