- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అద్దాల అంగడి మాయ.. ధర ఎక్కువుంటే క్వాలిటీ ఎక్కువున్నట్టా.?
"మాల్"లో కొని "గోల్‌మాల్" అవడమే.

"మాయల మార్కెట్" ఇది.
మన చుట్టూ కార్పొ"రేట్" పొగ కమ్మేసింది.
"రేట్" తక్కువుందంటే అది మనకు "చీప్".
ధర ఎక్కువ పెట్టి "మాల్"లో కొంటే "రిచ్".
"లోకల్ మార్కెట్లో" దొరికేవి నాసిరకం.
ధర తక్కువగా ఉండేవి "క్వాలిటీ లెస్".
సేమ్ అదే ఐటమ్ "అద్దాల అంగడి"లో అమ్మితే "నాణ్యమైనవి".
ఫాయిదా ఏందంటే..
"మాల్"లో కొని "గోల్‌మాల్" అవడమే.
ఇంకేం లేదు.!!
- దాయి శ్రీశైలం
"ఐటమ్" క్వాలిటీదా కాదా అనేది ఎలా నిర్ణయిస్తం.? బయట లోకల్ మార్కెట్లో అయితే పప్పులనుకో కొన్ని తిని చూస్తాం. అదే పండ్లు కాయలు అనుకో ఒకటి కట్ చేయించుకొని తిని చూస్తాం. అదే బట్టలు అయితే కుట్టు.. పోగు చూసి కొనుక్కుంటాం. కానీ.. మనలో చాలామందికి అలా చూడటం నచ్చదు. వాళ్ల దృష్టిలో మంచి "క్వాలిటీ ఐటమ్" అంటే "మెరిసే ప్యాకింగ్"లో "కలర్‌ఫుల్"గా కనిపించేది.
ఎక్కువ ఫీజు తీసుకుంటే
డాక్టర్ దగ్గరికి వెళ్తాం. నాడీ పట్టి సమస్యేంటో గుర్తుపట్టి రూ.100 ఫీజు.. రూ.200 మందులు రాస్తాడు. కానీ మనకో డౌటు. "ఈయ్నేంది వంద రూపాలే తీస్కుండు. అసలీయ్నకు వైద్యంజేసుడు వస్తదా రాదా.?" అనీ. అదే ఫీజెక్కువ తీసుకొని పేపర్ నిండా మందులు రాసిన డాక్టరైతే "అబ్బో ఆయ్న మామూలు డాక్టర్ కాదు" అని అనుకుంటాం. ఇక అదికూడా నచ్చకపోతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చూసుకుంటాం. ఓ డాక్టరొచ్చి కనీసం చెయ్యి కూడా పట్టుకోకుండా చాంతాడంత లిస్ట్ రాసి రూ.10000 కట్టండి ముందు.. ఆ తర్వాత కొన్ని పరీక్షలు చేయాలె.. డబ్బులు ఏర్పాటు చేసుకోండి చెప్పి పోతాడు. పైసలు సమకూర్చే పనిలో ఉంటాంగానీ.. "పెండ్లి సందట్లో పుస్తె కట్టుడు మర్చిపోయినట్టు" అసలు విషయం అర్థం చేసుకోలేని మెంటాలిటీ మనొళ్లది.
తక్కువుంటే అంతే ఇక
స్కూలో.. కాలేజో లేక ఇనిస్టిట్యూటో.. మనం ఏం చూసి చేరాలి.? స్టడీ ఎంత బాగా చెప్తారు.. రిజల్ట్ ఎలా ఉంది అనే కదా.? కానీ మనం అలా చేయం. ఎందుకంటే అక్కడ మనం చూసేది ఇనిస్టిట్యూట్ అందంగా ఉందా.? ఫీజు ఎంత ఉంది.? అని మాత్రమే. ఒకవేళ ఫీజు తక్కువగా తీసుకుంటే ఇది టాప్-10లో లేనట్టుంది.. అసలు ఎక్స్‌పర్ట్ ఫ్యాకల్టీ లేనట్టున్నారని ముందుగానే ఫిక్సయిపోతాం. కనీసం దాని ట్రాక్ రికార్డు ఏంటి.? రిజల్ట్ రేషియో ఎలా ఉందనేవేవీ చెక్ చేయం. ఎందుకంటే ధర ఎక్కువగా ఉంటే ఆ ఇనిస్టిట్యూట్‌లో క్వాలిటీ అంత బాగా ఉంటుంది అనుకుంటాం కదా.? అందుకే తక్కువ ఫీజు తీసుకునేవాటి జోలికి పోకుండా "అడవిపంది చేను మేస్తే ఊరపంది చెవులు కోసినట్లు" ఎక్కువ ఫీజులున్న వాటి వెంట పరుగులు తీస్తాం.
ఏ రేటైనా ఒకటే మందు
నిజంగానే మనిషి బతుకు అద్దాల అంగట్లో బొంగరమైపోయింది. కొననివి కొనిపించి కోతిగ చూపిస్తది. తిననివి తినిపించి తిమ్మిరి ఎక్కిస్తది. జనాల్లో ఉండే కామన్ ఫీలింగ్ ఏంటంటే.. "ధర ఎక్కువుంటే నాణ్యత ఎక్కువున్నట్టు" అనుకుంటారు. సింపుల్ థింగ్.. మనకో "కిలో నెయ్యి" కావాలనుకోండి. షాప్‌లో అడిగితే "ఏది కావాలీ.. డబ్బాలోదా.. బయటిదా" అని అంటారు. "దానికెంత.. దీనికెంత" అని అడిగితే.. తెలివిగా "డబ్బాలో నెయ్యికి వెయ్యి రూపాయలు.. బయటున్నదానికి ఐదువందలు" అని చెప్తాడు. పైసలెక్కువున్నదే క్వాలిటీ బాగుంది అనుకుంటాం కదా.. "డబ్బాలో నెయ్యే ఇయ్యి" అని అంటాం. మనం వెళ్లిపోగానే బయటున్న నెయ్యిని తీసి "డబ్బాలో" పోస్తాడతను. దీన్నిబట్టి ఏమి అర్థమైంది. మసిపూసి మారెడుకాయ చేసి అమ్మితేనే నచ్చుతుంది.
ధరని చూసి విలువ
"ఎన్ని పుటాలేసినా ఇత్తడి ఇత్తడే". దానికి ఎన్ని కోటింగ్‌లిచ్చినా.. పాలిష్ చేసి ఎంత పాష్‌గా తయారుచేసినా ఇత్తడి ఇత్తడే కానీ పుత్తడవుతుందా.? జనాలేమో ఇది గ్రహించరు. వాళ్లకెంతసేపూ పైసలెక్కువ పెడ్తే మంచి నాణ్యత ఉంటుందనే ఆలోచనే ఉంటుంది. "తుంగ దించి బండను ఎత్తుకున్నట్లు" లోకల్ దుకాణ్లు వదిలేసి "మార్ట్"ల వెంట పరుగులు తీస్తుంటారు. అదేందోగానీ ఏదో చిన్న పేస్టో లేక పెన్నో కావాలని దాంట్లోకి వెళ్తే వచ్చేటప్పుడు మినిమం బిల్లు వెయ్యికి తగ్గకుండా బయటకు వస్తాం. దేన్ని చూసినా తీసుకోవాలి అనే ఆలోచన కలిగించేలా మాయ చేస్తాయి. అది అవసరముందా లేదా అనే స్పృహ లేకుండా చేసి జేబుకు చిల్లు పెడతాయి. "ధర"ని చూసి ఆ వస్తువుకు విలువనిచ్చి "గోటితో పోయేదాన్ని గొడ్డలిదాక" తెచ్చుకొని వందతో పోయేదానికి రూ.1500 సమర్పించుకుంటాం.
క్వాలిటీ చెక్ చేయం
స్థానికంగా దొరికే వస్తువుకేమో "సవాలక్ష" సందేహాలుంటాయి. తినే వస్తువైతే "టేస్ట్" చూస్తాం. తాగే వస్తువైతే "సై"సూస్తం. ఇంకా బట్టలైతే ఒక "ఉతుకు ఉతికి సూడాల్నా" అనేంత స్వేచ్ఛ ఉంటుంది. క్వాలిటీ చెక్ చేయడానికి ఇక్కడిన్ని అవకాశాలున్నాయి. ఇలాంటి "ఫ్రెండ్లీ మార్కెటింగ్" జనాలకు నచ్చడం లేదు. "లోకల్ మాల్" అంత క్వాలిటీ ఉండవనే "మైండ్‌సెట్"తో ఉంటున్నారు. ఇదిసరే.. కార్పొరేట్ మార్ట్‌లో ఇలాగే వస్తువులను "సై చూసే" ధైర్యం చేస్తమా.? "సై" కాదు కదా కనీసం వాడు "టచ్" కూడా చేయనీయడు. తీసుకున్నామా.. బుట్టలో వేసుకున్నామా.. ప్యాకింగ్‌తో బయటకు వచ్చామా అనేదే లెక్క. ఇంకా బట్టల షోరూమ్‌లో అయితే ఒకసారి కంటే ఎక్కువ "ట్రయల్" చేస్తే "టైంపాస్"కొచ్చినొళ్ల లెక్క చూస్తారు మనల్ని.
మార్ట్‌ల మీద మోజు
కొందరికి "లోకల్ షాప్స్"కు "కార్పొరేట్ మార్ట్"లకు తేడా తెలుసు. జేబుకు చిల్లు పడుతుందని తెలిసినా కూడా వాళ్లు మార్ట్‌లకే వెళ్తుంటారు. ఒకరకంగా వాళ్లకు మార్ట్‌లంటే మోజు. ఏసీ పెట్టి.. కలర్ కలర్ లైటింగ్స్ వేసి.. ఎక్కడానికి దిగడానికి లఫ్ట్ పెట్టి.. ఫ్లోర్ మారడానికి పెట్టే ఎస్కలేటర్లకు అలవాటు పడతారు. కాలనీలో మినీ సూపర్ మార్కెట్ ఉన్నా.. కావాల్సిన ఐటమ్స్ అన్నీ అక్కడ దొరికినా కిలోమీటర్లు జర్నీ చేసి "మాల్స్.. మార్ట్"లలో షాపింగ్ చేస్తారు. "చెలిమితో చేదైనా తినిపించొచ్చుగానీ బలిమితో పాలు కూడా తాగించలేం" కదా. వాళ్లకు అన్నీ తెలిసి.. అంతా అర్థమయ్యి కూడా మేం అక్కడికే వెళ్తాం అంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు.? కాకపోతే ఇదొక అంటువ్యాధిలా ఆ కాలనీ మొత్తం వ్యాపించి సామాన్యుడిని "కన్ఫ్యూజ్" చేస్తోంది.
కొసరి కొనేవాడే
లోకల్ మార్కెట్ల మీద ఉన్నంత చిన్నచూపు ఎక్కడా లేదు కావచ్చు. అంగట్లో దొరికే "టవల్స్"నే తీసుకుందాం. నిజానికి అదున్నంత క్వాలిటీ "క్లాత్ షోరూమ్"లో దొరికే టవల్స్ ఉంటయా.? హ్యాండ్లూమ్ మీద నేసి.. రంగులద్ది ఎంతో కష్టపడి తయారుచేస్తే.. అంతకిస్తవా ఇంతకిస్తవా అని బేరమాడుతారు. ఎక్కువ ఆశపడకుండా టవల్ మీద రూ.50 చూసుకొని ఒక్కో టవల్ రూ.200 చెప్తే యాబైకిస్తవా.? అరవైకిస్తవా.? అని కొసిరి కొసిరి బేరమాడుతుంటారు మనొళ్లు. ఇంకా "రెండు మూడు కలర్లే ఉన్నయి కదా.. షోరూంలో చాలా కలర్స్ ఉంటయి" అంటారు. ముందు మనం ఎన్నడైనా కొంటే కదా అవి అమ్ముడయ్యి వేరే కలర్లు తెచ్చేది. "గుర్రంనాడ దొరికిందని గుర్రమే కొందాం" అన్నట్లు కలర్లు చూసి వెళ్తే అదే టవల్ రూ.1000 ఇస్తే మూసుకొని కొనుక్కుంటాం.
బిల్డప్ కోసమేనా
పది రూపాయలు పెట్టి తాగే అల్లం చాయ్.. బెల్లం చాయ్ ఎంతో టేస్టీగా ఉంటాయి. మన ముందే తయారు చేస్తాడు కూడా. ఒకవేళ చెక్కర తక్కువేయమంటే వేస్తాడు. ఇంకా ఒక చెంచా వేయమంటే అదీ వేస్తాడు. మనకు ఎలా కావాలో అలా ఇచ్చినా కూడా దానిని కేవలం రూ.10 చాయ్‌గానే చూస్తున్నాం. చాయ్ పెట్టేవాడిది ఏ ఊరో.. నీటుగా ఉంటాడో లేదో.. గ్లాసులు కడిగాడో లేదో అని భయపడతాం. పెద్ద కేఫ్‌లోకి వెళ్లి బిల్డప్‌గా చాయ్ ఆర్డరిస్తాం. వాడు సింగిల్ చాయ్‌కి రూ.70 బిల్ వేసిస్తాడు. "ఎద్దు తన్నుతుందేమో అని భయపడి గుర్రం చాటుకు దాక్కునుడు" అంటే ఇదే కావచ్చు. కేఫ్‌లలో పనిచేసే వాళ్లు గ్లాసులు కడిగారో లేదో.. నీటుగా ఉన్నారో లేదో అనే గ్యారెంటీ ఉందా.? చాయ్ బండి వాడైనా అంతా ఓపెన్‌గా అంతా మనముందే చేస్తాడు కదా.?
ఫైవ్ స్టార్.. తగ్గేదేలే
"రోడ్ సైడ్" చిన్న చిన్న బండ్ల మీద పెట్టుకొని టిఫిన్స్ అమ్ముతుంటారు. జనాలు కూడా ఎగబడి తింటుంటారు. నిజానికి మనింట్లో చేసినట్లు ఉంటుంది. ఇంకా వాళ్ల దగ్గర హైలైట్ చట్నీ. పల్లీ చట్నీ అయినా.. అల్లం చట్నీ అయినా పైన స్ప్రే చేసే కారం పొడి అయినా సూపరుంటయి అసలు. ఒక ప్లేట్ అని స్టార్ట్ చేసినొళ్లు రెండు ప్లేట్లు కూడా తింటారు. రెండు ప్లేట్స్ తిన్నా రూ.60 మాత్రమే బిల్ చేయాల్సి ఉంటుంది. కానీ కొందరు "రోడ్‌సైడ్" ఎవడు తింటర్రా అని పెద్ద పెద్ద హోటల్స్‌లో తింటారు. ఒక్క దోశకే రూ.100 వేస్తాడు. అంటే ఒక్క దోశకు వంద తీసుకుంటున్నాడంటే అది నాణ్యమైనది అనేది మనొళ్ల భ్రమ. చూస్తున్నాం కదా.? పేరుమోసిన హోటల్స్.. రెస్టారెంట్స్.. బిర్యానీ సెంటర్స్‌లో బొద్దింకలు.. బల్లులు.. పురుగులు వస్తున్నాయనీ. "మెరిసేదంతా బంగారం కాదు" మిత్రమా.
ఆఫరంటే ఆగనే ఆగం
కార్లు.. వస్తువులు ఏవైనా కావచ్చు. "ఫలానా ఆఫర్" అనగానే ఎగబడి తీసుకుంటాం. ఆఫర్ సీక్రెట్ తెలుసుకునే ఓపికెక్కడిది మనకు.? "గుడ్డెద్దు చేన్లో పడ్డట్టు" ఆ కార్పొరేట్ అంగట్లో పడతారు. వాడెంత చెప్తే అంతకు గంగిరెద్దు తలూపినట్లు ఊపి మంచి "బ్రాండ్" తీసుకున్నా్మని మురిసిపోతాం. "ఆకలేస్తుంది అత్తా అంటే రోకలి మింగవే కోడలా" అనే పక్కోడికి పైసా సాయం చేయని వాళ్లే ఇలా "దాచి దాచి దయ్యాల పాలుజేసినట్లు" కార్పొరేట్ మాయగాడి ఇంద్రజాలానికి సమర్పించుకుంటారు. బజార్లో రైతు అమ్మే తాజా కూరగాయలను కాదని.. స్టిక్కర్లు అంటించే "మార్ట్"లలో కొంటున్నామంటే "ధర"కు మనమిస్తున్న ప్రయారిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. "అంబలి తాగెటోనికి మీసాలు లేపేటోడు" అన్నట్లు మధ్య దళారులు బతికేదే కానీ మనకేం రాదు.
నవ్వొస్తుంది: కొత్తపల్లి క్రిష్ణ, వేంకట్రావుపేట, లక్సెట్టిపేట
విచిత్రం ఏంటంటే కూరగాయలు రైతుల దగ్గర్నుంచే వెళ్తాయి కదా.? రైతుల దగ్గర కూరగాయలు కొనుక్కోవడానికి కొందరు ఇష్టపడరు. వాళ్లు కొత్తిమీర కట్ట కోసం కూడా మార్ట్‌లకు వెళ్తుంటారు. అలాంటివాళ్లను చూస్తే నవ్వొస్తుంది. రేటు ఎక్కువుంటే క్వాలిటీ ఎక్కువున్నట్లేనా.?
జేబుకు చిల్లే: ఎరసాని వెంకట నరసింహా, మగ్దూంపల్లి, బీబీ నగర్
రోజూ చూస్తుంటాం ఇలాంటివి. లోకల్ క్లినిక్స్‌లో చూపించుకోకుండా సిటీ వెళ్తుంటారు. ఫలానా డాక్టర్ బాగా చూస్తాడు.. ఫలానా హాస్పిటల్ మంచిది అని పోతారు. వాళ్ల దృష్టిలో నాణ్యమైంది అంటే ఎక్కువ డబ్బులు సమర్పించుకోవడమే. ఇలాంటివాళ్ల జేబుకు చిల్లు తప్ప వేరే లాభమేమీ ఉండదు.
రోజూ చూస్తుంటాం: శరత్‌బాబు బండారు, మన్సూరాబాద్
రేటు.. రిచ్.. బ్రాండ్.. క్వాలిటీ అని భ్రమపడే వాళ్లను రోజూ చూస్తుంటాం. కొందరు చాక్లెట్ కోసం కూడా "సూపర్ మార్కెట్"కు వెళ్తుంటారు. వాళ్లకు ఏమని చెప్తాం మనం.? బయట బేకరీలో రూ.5కు దొరికే చాక్లెట్ సూపర్ మార్కెట్లో రూ.10కి ఇస్తారని తెలిసే వెళ్లడం ఇంకా బాధాకరం.






