ఓ తల్లిగా విన్నపం..

by Sujitha Rachapalli |

హాయ్... నేను రెండేళ్ల బిడ్డకు తల్లిని.. మొదటి కాన్పులోనే ఆడపిల్ల పుట్టిందని.. మహాలక్ష్మి వచ్చిందని.. నా అత్తవారి ఇల్లు, నా పుట్టినిల్లు అందరూ సంతోషించారు. సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ ఇక్కడ వచ్చిన చిక్కు సమాజంతోనే..

ఓ తల్లిగా విన్నపం..
X

దిశ, ఫీచర్స్ : హాయ్... నేను రెండేళ్ల బిడ్డకు తల్లిని.. మొదటి కాన్పులోనే ఆడపిల్ల పుట్టిందని.. మహాలక్ష్మి వచ్చిందని.. నా అత్తవారి ఇల్లు, నా పుట్టినిల్లు అందరూ సంతోషించారు. సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ ఇక్కడ వచ్చిన చిక్కు సమాజంతోనే.. అయ్యో ఆడ పిల్ల పుట్టిందా? మగ పిల్లాడు పుట్టి ఉంటే బాగుండేదే? అని ఇక్కడ నుంచి మొదలైన నా సొసైటీ మాటలు.. నా గురించి, నా బిడ్డ గురించి తీర్పు చెప్పే ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒక్కో సందర్భంలో వాళ్లు మాట్లాడే మాటలు నిజంగా నేను ఏదైనా తప్పు చేస్తున్నానా? నా బిడ్డకు సరైన తల్లినేనా? నా బిడ్డను బాగా చూసుకుంటున్నానా? అనే సందేహాన్ని కలిగించింది. మెంటల్‌గా చాలా స్ట్రెస్‌ను ఇచ్చింది. కానీ ఈ రెండేళ్ల ప్రయాణం తర్వాత.. నా బిడ్డను బయటకు తీసుకెళ్లేటప్పుడు.. నేను నేర్చుకున్నది.. ‘అనవసరపు సలహాలు వినడం మానుకో’ అని. ఇంతకు సమాజం ఏమన్నది? నేటి తల్లులు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఏంటి? వారి తరఫున.. వారి బాధను.. నేను చెప్పేందుకు ప్రయత్నిస్తూ..

నేను వర్కింగ్ మామ్ కాబట్టి వీక్ ఆఫ్ వచ్చిన రోజు.. ఏ బంధువుల ఇంటికో.. ఏ రెస్టారెంట్‌కో.. లేదంటే ఏదైనా ప్లే ఏరియాకు వెళ్తే బాగుంటుందని.. నా పాప హ్యాపీగా ఫీల్ అవుతుందని.. బయలుదేరుతా.. కానీ ఆల్మోస్ట్ అన్ని సార్లు నేను ఎదుర్కొనే సంఘటనలు.. మీ పాపకు ఏడాది పూర్తయిందా.. అయ్యో.. ఇంకా నడవట్లేదా.. ఇంకా మాట్లాడట్లేదా.. అయితే ఏదో లోపం జరిగింది.. మీరు డాక్టర్ చెప్పినట్లు కాకుండా మేము చెప్పినట్లు వింటే బాగుండేది.. లేదంటే ఈజీగా మైల్ స్టోన్స్ రీచ్ అయ్యేది అని చెప్తుంటారు. ఈ మాటలు ఓ బిడ్డ ఇంకా మైల్ స్టోన్ రీచ్ కానప్పుడు ఆ తల్లిని తప్పు చేసిన దానిలాగా ఎంతగా బాధపెడుతాయి. తానే బిడ్డకు శత్రువునా అనే భావనను కలిగించవా?. మీ పిల్ల డ్రెస్ ఏంది ఇట్లుంది.. మీ పాప కలర్ ఏంది ఇట్లుంది.. ఏం ఫుడ్ పెడుతున్నావ్.. సరిగ్గా తిండి పెట్టట్లేదా.. ఇంకా కొందరు మహానుభావులు అయితే మొహం మీదనే ఏం పెంపకం అనేస్తరు.. నాకు అనిపిస్తుంది.. ఇలాంటి వాళ్లకు కనీసం సెన్స్ ఉండదా అని.. ఇలాంటి తెలివి తక్కువ మాటలు మాట్లాడే వాళ్లను మరి నేనెలా ట్రీట్ చేయాలి? నేను అయితే ఓ పురుగులా చూస్తా.. చారులో కరివేపాకులా వాళ్ల ఒపీనియన్ నా మైండ్‌లో నుంచి తీసిపడేస్తా.. కానీ ఆ మాట ఓ ఐదు నిమిషాలో.. లేక పది నిమిషాలో.. నన్ను బాధపెట్టి ఉండొచ్చు కదా..

వాళ్లంతే..

ఓ తల్లిగా ఈ రెండేళ్లలో శారీరకంగా ఎంత అలసిపోయి ఉంటా.. దానికి తోడు ఈ అనవసర సలహాలు, విమర్శలు నన్ను ఎంత మానసిక ఒత్తిడికి గురిచేస్తాయి. ఒక్కసారి నీ ఒపీనియన్ చెప్పేటప్పుడు.. కాదు కాదు నీ ఓర్వలేని తనం బయటపెట్టే ముందు.. ఆ మాట ఎంత బాధిస్తుందో ఆలోచించవా.. అసలు ఓ తల్లిని జడ్జ్ చేయడానికి నువ్వెవ్వరు? అనాలని అనిపిస్తుంది. కానీ ఇలాంటి వారితో గొడవ జరిగినా.. నాకు మళ్లీ మెంటల్ స్ట్రెస్ పెరుగుతుందని.. ఈ అనవసరపు మాటలకు టైమ్ వేస్ట్ చేసుకుని.. నా పాపతో హ్యాపీగా ఉండే సమయాన్ని ఎందుకు కరాబ్ చేసుకోవాలని అనిపిస్తుంది. అందుకే ప్రతి తల్లికి నేను చెప్పేది ఇదే.. సొసైటీ ఎప్పుడూ నిన్ను జడ్జ్ చేస్తూనే ఉంటుంది.. కాబట్టి

వారిని లైట్ తీసుకోండి.. జస్ట్ ఓ స్మైల్ లేదంటే ఓ యాంగ్రీ లుక్ వేసి.. మీ దారిన మీరు వెళ్లిపోండి.. ఆ లుక్, ఆ స్మైల్ వాళ్లకు కొన్ని రోజులు నిద్రపట్టకుండా చేయొచ్చు.. వాళ్లు తప్పు చేశారనే విషయాన్ని గుర్తించొచ్చు..

నువ్వెవరు చెప్పడానికి...

ఓ తల్లి తొమ్మిది నెలలు మోసింది.. తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి బిడ్డకు జన్మనిచ్చింది.. అలాంటి తల్లికి కడుపు తీపి తెలియదా.. తన బిడ్డను ఎలా పెంచుకోవాలో తెలియదా.. సరే మంచి మాట చెప్తున్నారంటే.. ఓ విధానం ఉండాలి కదా. ఎప్పుడూ తల్లి మీద పడి తప్పులు వెతికే బదులు.. అలా కాదమ్మ ఇలా చేస్తే బాగుంటుందని చెప్పొచ్చు.. కానీ అలా చేయరు.. ఆమె మానసిక ఒత్తిడిని పెంచే అనుమానాలే ముందొస్తాయి. ఒక తల్లికి నువ్వు నిజంగా హెల్ప్ చేయాలనుకుంటే.. అలసట వ్యక్తం చేసే స్వేచ్ఛను ఇవ్వాలి. ఆమె బాధను వినే కంఫర్ట్ ఇవ్వగలగాలి. సహాయం కోరేంత హెల్ప్‌ఫుల్‌గా ఉండాలి. ఫైనల్‌గా నేను కోరేది ఒక్కటే.. నిజంగా నువ్వు బిడ్డ క్షేమం కోరుకునే సొసైటీ పర్సన్ అయితే.. అంత బాధ్యతగల వ్యక్తివే అయితే జర నోరుమూసుకుని ఉండు..

నేనైతే నా బిడ్డతో హ్యాపీగా...

సొసైటీ ఎన్ని మాటలు మాట్లాడినా.. ఫైనల్‌గా హ్యాపీగా ఉండాల్సింది నా బిడ్డ.. అలా సంతోషంగా ఉండాలని కోరుకునేది నేను.. మధ్యలో ఇలాంటి వాళ్లు ఎన్ని మాటలు మాట్లాడినా ఓ మదర్‌గా నాకు ఫరక్ పడదు. నా బిడ్డ ఆనందానికి 24 గంటలు కష్టపడడానికైనా రెడీ.. ఆమె చిన్న చిన్న అల్లరి పనులను భరించేందుకు ఎప్పుడూ ముందే ఉంటా.. నా అవధులు లేని ప్రేమను పంచుతూ పెంచుతా..

Next Story