Disha Special: జస్ట్ ఫర్ ఎ చేంజ్.. ఓన్లీ మిస్సైల్స్!

by Kema Shiva Kumar |

కాలం మారిపోయింది. సైనిక రంగాలను ఉపయోగించే పద్ధతి కూడా మారిపోయింది.

Disha Special: జస్ట్ ఫర్ ఎ చేంజ్.. ఓన్లీ మిస్సైల్స్!
X

కాలం మారిపోయింది. సైనిక రంగాలను ఉపయోగించే పద్ధతి కూడా మారిపోయింది. నేటి యుద్ధాల్లో పదాతి దళాలు, ట్యాంకులు కనిపించవు. సైనికులు శత్రు దేశపు సరిహద్దులు దాటేందుకు చేసే ప్రయత్నాలు కనిపించవు. ఇప్పుడంతా ఎలక్ట్రానిక్ వార్ ఫేర్. ఎక్కడో కంట్రోల్ రూంల్లో కూర్చుని రిమోట్‌తో డ్రోన్లు ఆపరేట్ చేస్తూ.. శత్రు సైన్యపు వెన్నెముక విరిచేస్తుంటారు. శత్రు సైనిక బలాన్ని పూర్తిగా అణచివేసి.. తమ లక్ష్యాన్ని సాధించుకుంటున్నారు. ఇప్పుడు భూమి ఉపరితలంపై విమానాల కన్నా, వివిధ దేశాల ఉపగ్రహాలే ఎక్కువ సంఖ్యలో తిరుగడుతుంటాయి. యుద్ధాలు కూడా ఆ దిశలో ప్రయాణిస్తున్నాయి. అసలు రాబోయే రోజుల్లో జరిగే యుద్ధా్ల్లో సైనికులెవరూ సరిహద్దులకు పోయే పరిస్థితులు ఉంటాయా? అన్నది అనుమానమే. మారుతున్న యుద్ధతంత్రాలపై ‘దిశ’ ప్రత్యేక కథనం - శరత్ చంద్ర

గతంలో జరిగిన యుద్ధాల్లో సైనికుల వీరోచిత ధైర్యసాహసాలు జయాపజయాలను నిర్ణయించేవి. కానీ, నేడు పరిస్థితి మారింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎవరివద్ద ఉంటుందో వారికే విజయం వరిస్తున్నది. గతంలో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం పాక్షికమైనది కావడంతో మానవ వనరులపై ఎక్కువ ఆధారపడాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. పూర్తిగా మానవరహిత విమానాలు అందుబాటులోకి వచ్చాయి. సైనిక లక్ష్యాలను దెబ్బతీయడానికి సర్జికల్ స్ట్రైక్స్ అత్యుత్తమ సాధనంగా చెప్పవచ్చు. దీంతో గణనీయంగా యుద్ధం జరిగే రోజులు తగ్గాయి. 1965లో భారత్-పాకిస్తాన్ యుద్ధం 17 రోజులు జరుగగా, 1971 యుద్ధం 13 రోజులు మాత్రమే జరిగి బంగ్లాదేశ్ విముక్తమైంది. ఇప్పుడు భారత్-పాక్ రెండూ అణ్వయుధాలు కలిగిన దేశాలు. ఒకప్పటిలా శత్రువును లొంగదీసుకునేవరకు యుద్ధం చేసేకంటే శత్రువు బలాన్ని నిర్వీర్యం చేయడంపైనే ఎక్కువగా దేశాలు దృష్టి పెడుతున్నాయి. చైనాతో 1962 తరువాత 'లైన్ ఆఫ్ యాక్చుల్ కంట్రోల్' వద్ద భారత సైనికులకు 1987నుంచి 2020 వరకు అనేక ఘర్షణలు జరిగినా ఎక్కడా తుపాకులతో కాల్పులు కానీ, యుద్ధం వరకు వెళ్లలేదు. తుపాకులు పక్కనపెట్టి ఒకరినొకరు సరిహద్దు ఆవలి వైపు తోసుకున్నారు. ఆపై ఇరువైపులా ఉన్నతస్థాయి సైనిక అధికారులు కూర్చొని.. సరిహద్దు సమస్యను పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు.

తగ్గుతున్న సైనికుల పాత్ర

భారతదేశంలో రెగ్యులర్ ఆర్మీ ఉద్యోగాల కోసం రిక్రూట్‌మెంట్స్ జరుగడంలేదు. అగ్నివీర్ పేరిట నాలుగేళ్ల కాలానికి మాత్రమే తీసుకుంటున్నారు. వీరిలో కొద్దిమందిని మాత్రమే కొనసాగిస్తూ.. మిగితావారిని ఇళ్లకు పంపిస్తున్నారు. ఇది మూడేళ్ల కిందట ప్రారంభమైంది. భవిష్యత్తులోనూ ఇదే తరహా వ్యవస్థ కొనసాగుతుందని తాజా ఘటనలు చూస్తే అర్థం అవుతున్నది. పహెల్గాం ఘటనకు ప్రతీకారంగా పాక్ పై భారత్ చేపట్టిన సైనిక చర్యలో సైనికులను వినియోగించింది తక్కువ. పూర్తిగా డ్రోన్లు, మిస్సైళ్లపైనే ఆధారపడింది. ఇక జరగబోయే యుద్ధాలు కూడా ఇలాగే ఉంటాయని స్పష్టమవుతున్నది. ఇప్పటికే అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి అగ్ర రాజ్యాలు తమ పదాతి దళాలు తగ్గించుకుంటూ, ఆధునిక యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. రెండవ ప్రపంచయుద్ధం తరువాత అణ్వయుధాలు కలిగిన దేశాల మధ్య బహిరంగ యుద్ధాలు జరగకుండా నివారించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎందుకంటే అలాంటి ఘర్షణలు తీవ్రతరమై అణ్వయుధాల వైపు చూపు మళ్లుతుందని గుర్తించి.. యుద్ధాలను నివారించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక భారతదేశానికి చుట్టూ ఉన్న పాకిస్తాన్, చైనాలు అణు ఆయుధాలు కలిగి ఉన్నాయి కాబట్టి.. ఈ దేశాల మధ్య సంప్రదాయక యుద్ధాలు ఉండే అవకాశంలేదు. అందుకే మాజీ ప్రధాని వాజ్‌పేయి ‘పాకిస్తాన్, భారత్‌పై అణుబాంబు ప్రయోగిస్తే.. వారు తెల్లారి సూర్యోదయాన్ని చూడలేరు’ అని హెచ్చరించారు. మరోవైపు అగ్ర రాజ్యాలు ప్రాక్సీ (proxy) యుద్ధాలు చేస్తూ.. దేశాల మధ్య అగ్గి రాజేస్తున్నారు.

ప్రాక్సీ యుద్ధమంటే ఏమిటి ?

ఓ రెండు దేశాలు యుద్ధం చేసుకుంటున్నప్పుడు అగ్ర రాజ్యాలు వాటికి పరోక్ష సహకారం అందించడాన్ని ప్రాక్సీ యుద్ధాలు అంటారు. వీరు ఆయా దేశాలకు ఆయుధాలు అమ్మడం తదితర సైనిక సాయం చేస్తారు. అయితే, వారి యుద్ధాన్ని వీరు తమ ఆర్థిక, రాజకీయ అవసరాలకు వాడుకుంటారు. అంటే ఓ స్థాయి వరకు యుద్ధాన్ని తీసుకువెళ్లి.. ఆ తర్వాత వెంటనే యుద్ధాన్ని ఆపేందుకు దౌత్య చర్చలు ముందుకు తెస్తుంటారు. దీనివల్ల ప్రజల మనోభావాలు లేదంటే సరైన లక్ష్యాలను చేరకుండానే యుద్ధాన్ని ఆపేయాల్సి వస్తుంది. ఏదిఏమైనా యుద్ధంలో ఎన్ని అడుగులు ముందుకు వేసినా.. ఎప్పుడూ శాంతి చర్చలకు సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు భారత్ కూడా అదే వైఖరిని అవలంబించిందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

డ్రోన్లతో మారిన లెక్కలు

ఆపరేషన్ సిందూర్ లో పాక్ మిస్సైళ్లకంటే ఎక్కువ సంఖ్యలో డ్రోన్లు వాడింది. దీనివల్ల మన దేశ సరిహద్దుల్లో సైనిక పోస్టులు, స్థావరాలు, ఆయుధ గిడ్డంగులు వంటి కీలకమైన సమాచారం అందుతుంది. అందుకే ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా పాక్ వందల సంఖ్యలో డ్రోన్లను పంపింది. వీటిలో ప్రతి ఒక్కదానిని భారత ఎయిర్ డిఫెన్స్ గాల్లోనే పేల్చివేసినా.. కొన్ని మాత్రం జమ్ము, అమృత్ సర్, శ్రీనగర్ వరకు వచ్చాయి. ఈ సమయంలో అవి ఎంతో సమాచారాన్ని సేకరించే అవకాశం ఉన్నదని సైనిక నిపుణులు పేర్కొంటున్నారు. మిస్సైళ్ల ఖరీదుతో పోల్చితే డ్రోన్లు అందులో పదోవంతుకంటే తక్కువ ఖర్చు అవుతుంది. అందుకే డ్రోన్లు యుద్ధ తంత్రంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి.

క్షిపణి, డ్రోన్ల మధ్య తేడా ఏమిటి

సాధారణంగా క్షిపణి పూర్తిగా స్వయం ప్రతిపత్తి కలిగినవి. అంటే ఒకసారి టార్గెట్ ను ఫిక్స్ చేసి ప్రయోగిస్తే.. అది ఎటువెళ్లినా దానిని వెంటాడుతూ లక్ష్యాన్ని చేధిస్తుంది. డ్రోన్లకు మానవ నియంత్రణ అవసరం. క్షిపణులను మాక్ వేగంతో అంటే ధ్వనికంటే ఎక్కువ వేగంతో దూసుకువెళ్తాయి కాబట్టి ఎయిర్ డిఫెన్స్ కు కూడా అందకుండా లక్ష్యాన్ని చేరుతాయి. కానీ, డ్రోన్ల వేగం చాలా తక్కువ అందువల్ల అవి సులభమైన టార్గెట్లు అవుతాయి. క్షిపణులను పేల్చేందుకు ఎస్ 400, ఆకాశ్ వంటి భారీ మిస్సైళ్లు అవసరం. డ్రోన్లను పేల్చేందుకు మీడియం రేంజ్ తుపాకులతోనూ వాటిని పడగొట్టవచ్చు. అందుకే పాకిస్తాన్‌లో తిష్టవేసిన భారత వ్యతిరేక ఉగ్రవాదుల శిబిరాలను భారత్ క్షిపణులతో సమూలంగా నాశనం చేసింది. ఈ దాడిలో 100మందికిపైగా ఉగ్రవాదులు హతమయ్యారు.

Next Story