త్వరపడండి.. జీహెచ్ఎంసీ, కంటోన్మెంట్‌లో స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్

by  |
త్వరపడండి.. జీహెచ్ఎంసీ, కంటోన్మెంట్‌లో స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ, కంటోన్మెంట్ ఏరియాల్లో సోమవారం నుంచి స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం కానుంది. వైద్యారోగ్యశాఖ, జీహెచ్ఎంసీ అధికారులు ఇంటింటికి తిరిగి టీకాలు పంపిణీ చేయనున్నారు. ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకోని వారితో పాటు, రెండో డోసు వేసుకోవాల్సిన వారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ప్రత్యేక కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ నిర్వహించడం పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బీఆర్కే భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ ఆగష్టు 23 తేదీ నుంచి 15 రోజుల పాటు కొనసాగుతుందన్నారు. జీహెచ్ఎంసీలోని 4,846 కాలనీలు, మురికివాడలతో పాటు కంటోన్మెంట్ జోన్‌లోని 360 ప్రాంతాలలో నిర్వహిస్తామన్నారు.

ఈ డ్రైవ్ ద్వారా హైదరాబాద్ లో 100 శాతం టీకా పంపిణీ చేస్తామన్నారు. దీని కోరకు జీహెచ్ఎంసీలో 175, కంటోన్మెంట్‌లో 25 మొబైల్ వ్యాక్సిన్ వాహనాలను సిద్ధం చేశామన్నారు. ప్రతి వాహనంలో ఇద్దరు టీకా వేసే సిబ్బంది, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటారన్నారు. ప్రతి కాలనీలో టీకాలు తీసుకోని వ్యక్తులను ముందుగానే గుర్తించి ఇంటింటికీ వ్యాక్సినేషన్ నిర్వహిస్తామన్నారు. టీమ్ ముందుగానే వ్యాక్సినేషన్ తేదీ సమయంతో పాటు టీకాల ఆవశ్యకతను వివరిస్తుందన్నారు. టీకాలు వేసిన తర్వాత ప్రతి ఇంటి తలుపుల మీద స్టిక్కర్ అతికిస్తామన్నారు.

అంతేగాక ప్రతి కాలనీలో స్పెషల్ డ్రైవ్ టీకాపై ఆడియో ప్రకటనతో పాటు బ్యానర్లు, ఆటో స్టిక్కర్లతో అవగాహన కల్పిస్తామన్నారు. 100% టీకాలు విజయవంతంగా పూర్తి చేసిన రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కాలనీలకు కమీషనర్ ప్రశంసా పత్రాన్ని అందజేస్తారన్నారు. ఈ సమావేశంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ , జీహెచ్ ఎంసీ కమీషనర్ లోకేశ్ కుమార్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ సీఇఓ అజిత్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా.శ్రీనివాస్ రావు, సీఎం ఓఎస్డి డా.గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story