సింగరేణి కార్మికులు డ్యూటీకి పోతలేరు.. కారణం..?

by  |
సింగరేణి కార్మికులు డ్యూటీకి పోతలేరు.. కారణం..?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: సింగరేణి బొగ్గు గని కార్మికులను కరోనా వైరస్ కలవరపెడుతోంది. వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో నిబంధనల ప్రకారం బొగ్గు సేకరణ జరపాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. యాజమాన్యం నుంచి స్పందన లేకపోవడంతో కార్మికులు స్వచ్ఛందంగా విధులకు హాజరు కావడం లేదు. గనుల్లో వైరస్ వ్యాప్తి విస్తరిస్తుండడంతో కార్మికులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియాలో అన్‌లాక్ తరువాత వందల సంఖ్యలో కరోనా బాధితులు వెలుగులోకి వస్తున్నారు. సింగరేణి కాలరీస్‌లో కూడా ఇద్దరు మృత్యువాత పడగా మరికొంత మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో మిగతా కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అండర్‌ గ్రౌండ్‌లో విధులు నిర్వర్తించే కార్మికులు నిత్యం అతి తక్కువ ఆక్సిజన్ ప్రాంతంలో డ్యూటీలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలామంది కార్మికులు ఊపిరితిత్తుల సమస్యలు బాధపడుతున్నారు. అండర్‌ గ్రౌండ్‌లో ఆక్సిజన్ కన్నా విషవాయువు కూడా ఉంటుంది. దీంతో సింగరేణి కార్మికులకు అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కార్మికులు పని చేసే స్థలాలు దుమ్ము, ధూళి, విషవాయుల ప్రభావంతో అవయవాలు దెబ్బతిని ఉంటాయి. కార్బన్ మోనాక్సైడ్, మీథేన్ లాంటి విష వాయువులతో కార్మికులు అనారోగ్య సమస్యలతో భాదపడుతుంటారు. సింగరేణి వ్యాప్తంగా దాదాపు 60 శాతం మంది కార్మికులు ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని ఓ అంచనా. అండర్ గ్రౌండ్, ఓపెన్ కాస్ట్ గనులు, కన్వేయర్ బెల్ట్, సీహెచ్‌పీ, సీఎస్పీల్లో పని చేసే కార్మికులు దుమ్ము మధ్య పని చేస్తుండడంతో కార్మికులు ఎక్కువగా అనారోగ్యానికి గురవుతుంటారు.

భౌతిక దూరం అసాధ్యమే..

సింగరేణిలో భౌతిక దూరం పాటిస్తూ పని చేయడం అసాధ్యమేనని కార్మికులు చెప్తున్నారు. సమూహంగా పని చేస్తేనే బొగ్గు ఉత్పత్తి సాధ్యపడుతుంది. భూగర్భ గనుల్లో నలుగురు, ఐదుగురు కార్మికులు కలిసి చేసే పనులే అధికంగా ఉంటాయి. దీంతో కార్మికుల్లో వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశలు ఎక్కువగా ఉంటాయి. రామగుండ రీజియన్ లో జీడీకే 2 గ్రూపుల్లో వైరస్ బాధితులు ఎక్కువవుతుండడం, కార్మికులు ఒకరిద్దరు చనిపోవడంతో మిగతా కార్మికులు గనులను మూసివేయలంటూ ఆందోళనకు దిగారు. ఇటీవల జీడీకే 7 ఇంక్లైన్ గనిలో విధులు నిర్వహించే కార్మికులు కరోనా బారిన పడడంతో అనారోగ్యానికి గురయ్యారు. ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఇలాంటి పరిస్థితుల్లో కార్మికుల్లే స్వచ్చందంగా విధులను బహిష్కరిస్తున్నారు. రామగుండంలో 12 వేల పై చిలుకు కార్మికులు ఉంటే వీరిలో 40 శాతం మంది కరోనా భయంతో విధులకు హాజరు కావడం లేదు. గనుల వద్ద కార్మికులు కొవిడ్ 19 నిబంధనలకు అనుగుణంగా డ్యూటీలు వేయాలని లేదా లాక్‌డౌన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేస్తున్నారు. సింగరేణి యాజమాన్యం మాత్రం స్పందనను తెలియజేయడం లేదు.

Next Story