సుప్రీంకోర్టు చెప్పినా వినను.. సిద్దిపేట కలెక్టర్ సంచలన వ్యాఖ్యలు (వీడియో)

by  |
Siddipet Collector Venkatram Reddy
X

దిశ ప్రతినిధి, మెదక్: ‘నేను మోనార్కుని.. ఎవరి మాటా వినను.’ అంటూ ఓ సినిమాలో సినీ నటుడు ప్రకాశ్ రాజ్ చెప్పిన మాటలు సరిగ్గా సిద్దిపేట కలెక్టర్‌కు వర్తిస్తాయి. ఎందుకంటే అతని తీరు అలాగా ఉంటుంది మరీ. గతంలో పలు సందర్భంలో వివాదాల్లో ఇరుక్కున సిద్దిపేట కలెక్టర్ తాజాగా మరోమారు వివాదాల్లో చిక్కుకున్నారు. సోమవారం సిద్దిపేట సమీకృత కలెక్టర్ కార్యాలయంలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలనే అంశంపై జిల్లా, మండల వ్యవసాయ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై రైతులు, సీడ్ కంపెనీ యజమానులు, డీలర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కలెక్టర్ తీరుపై సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

చెండాడుతా.. వెంటాడుతా..

సోమవారం సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో వరి విత్తనాలను డీలర్ అమ్మినట్టుగా తెలిస్తే ఈ క్షణం నుండి వారి పట్ల చెండాడుతా.. వెంటాడుతా అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆయన ఏం మాట్లాడాడంటే.. ‘‘జిల్లాలో రైతు డీలర్ వద్ద కిలో వరి విత్తనాలు కొన్నా.. అమ్మినా నేను కలెక్టర్‌గా ఉన్నంతకాలం డీలర్ దుకాణం బంద్ అని, సుప్రీంకోర్టు నుండి ఆర్డర్ తెచ్చినా ఓపెన్ కాదు. నో క్వశ్చన్. మీరు ఎవరితోనైనా ఫోన్ చేయించి షాపు ఓపెన్ చేయించినా వినేది లేదు. నేను తెరవాలనుకున్న మూడు నెలలు పొడగిస్తా.. దయచేసి డీలర్లు సహకరించాలి. సిద్దిపేట జిల్లాలో సుమారుగా 350 షాపులు ఉన్నాయి. ఈ క్షణం నుండి షాపుల్లో కిలో ప్యాడి(వరి) అమ్మినట్టు తెలిస్తే ఆ షాపు క్లోజ్.. సీజ్.. ఆ షాపు గురించి హైకోర్టు ఆదేశాలు గానీ, ప్రజాప్రతినిధుల ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి రిక్వెస్ట్ చేసినా.. ఓపెన్ కావు. నేను కలెక్టర్‌గా ఉన్నంత కాలం సీజ్. ఆ షాపు కాకుండా వేరే షాపు నుండి బిజినెస్ చేస్తున్నారని తెలిస్తే దాన్ని కూడా సీజ్ చేస్తా. ఈ క్షణం నుండి చెండాడుతా.. వెంటాడుతూ.. ఖబడ్డార్.. మై ఇన్స్ట్రక్షన్స్ ఆర్ క్లియర్. ఏఈవో, అగ్రికల్చర్ ఆఫీసర్ సమక్షంలో కిలో వరి విత్తనాలు అమ్మినట్టు తెలిస్తే ఏఈవో సస్పెండ్, స్టాక్ కొట్టండి, షాపు మీద నిఘా పెట్టండి. డీలర్లు కూడా మనకు సహకరించే వ్యక్తులే కానీ మనల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులు కాదు.’’ అంటూ కలెక్టర్ మాట్లాడిన వీడియో ప్రస్తుతం ఉమ్మడి మెదక్ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చక్కర్లు కొడుతోంది.

వివాదాలకు కేరాఫ్ సిద్దిపేట కలెక్టర్..

సిద్దిపేట జిల్లా ఏర్పడిన నాటి నుండి జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కొనసాగుతున్నారు. అయితే, పలు సందర్భాల్లో కలెక్టర్ హోదాలో హుందాగా వ్యవహరించాల్సిన ఆయన వివాదాల్లో చిక్కుకుంటున్నారు. సిద్దిపేట జిల్లాగా ఏర్పడి కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించి కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న మొదటిరోజు నుండి వివాదాల్లో నిలుస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వే్ల్‌లో పర్యటించిన సందర్భంలో సిద్దిపేట కలెక్టర్‌ని గజ్వేల్ ఎమ్మెల్యే అనుకోవాలని చెప్పినప్పటి నుండి తన తీరు మారింది. సీఎం చెప్పినట్టుగా తాను ఓ అధికారిని అన్న విషయాన్ని మరిచి సీఎంలా వ్యవహరిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంలో టీఆర్ఎస్ టికెట్ ఆశించినట్టు సోషల్ మీడియాలో వార్తలు ట్రోల్ అయ్యాయి. దీనిపై ఎలాంటి సమాధానం చెప్పలేదు. ఆ తర్వాత కోవిడ్ నిబంధనలు పాటింపు విషయంలోనూ అందర్ని మాస్కు వేసుకోండని చెప్పిన కలెక్టర్ తాను మాత్రం ఏ మీటింగ్‌కి వెళ్లిన మాస్కు ధరించి కన్పించలేదు. ఆ తర్వాత సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనరేట్, కలెక్టరేట్ కార్యాలయాల ప్రారంభం రోజున సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కడం మరో వివాదాస్పందంగా మారింది. ఈ విషయంపై సహచర ఐఏఎస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆరోజు ఫాదర్స్ డే కావున సీఎం కేసీఆర్ తండ్రి సమానులైనందునే ఆయన కాళ్లు మొక్కానంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత జరిగిన పలు సందర్భాల్లోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా.. వ్యవసాయ సమీక్షలో మాట్లాడిన తీరుతో మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.

కలెక్టర్ తీరుపై ఆగ్రహం..

కలెక్టర్ మాట్లాడిన వీడియో చూసిన రైతులు, ప్రతిపక్ష నాయకులు, రైతు సంఘాల నాయకులు, ఫెర్టిలైజర్ షాపు వ్యాపారులు తమదైన శైలిలో కలెక్టర్‌పై విరుచుకుపడుతున్నారు. రైతులకు తమ కిష్టమైన పంట పండించుకునే స్వేచ్ఛ కూడా లేదా.. అధికారులు చెప్పినట్టు రైతులు వినడం ఏంటంటూ కొందరు కామెంట్లు చేస్తుండగా.. వరిపంట వేయద్దంటే ప్రభుత్వం ప్రాజెక్టులు ఎందుకు నిర్మించినట్టు..? రైతులకు ఉచిత కరెంటు ఎందుకిస్తున్నట్టు? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు మాటలు కూడా విననంటున్న కలెక్టర్‌కి భారత రాజ్యాంగం పట్ల గౌరవం ఉందా లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులను భయపెడుతున్నారా కలెక్టర్ గారు.. అన్ని చెరువుల్లో వాటర్ నిండి మా భూములు జాలు వారుతున్నాయి. ఇలాంటి సమయంలో వరి పంట తప్పా ఏ పంట వేయరాదు.. ఏ పంట వేస్తే పండుతుందో మీరే చెప్పాలి. లేక వ్యవసాయం మీరే చేసి చూపించాలి. ఇంతకష్టపడి కాళేశ్వరం నీరు తెచ్చింది చూసి మురుసుకోవడానికేనా.. కరువులో కూడా ఒక్క ఎకరం పండించుకొని హ్యాపీగా ఉన్నామంటూ కలెక్టర్ తీరుపై రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకుల్లాగా చెండాడుతా.. వెంటాడుతా.. ఖబడ్దార్ అంటూ కలెక్టర్‌గా మాట్లాడటం సరైనదేనా.. రాజ్యాంగ బద్ధమైన అధికార పదవిలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడటం సరికాదు. ఒకవేళ రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి ఉంటే.. కలెక్టర్ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లో చేరండి తప్పా కలెక్టర్‌గా ఉంటూ రాజకీయ నాయకునిగా వ్యవహరిస్తామంటే ఊరుకునేది లేదంటూ ప్రతిపక్ష నాయకులు హెచ్చరిస్తున్నారు. మరి కలెక్టర్ తీరుపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Next Story