ఐపీఎల్‌లో సత్తాచాటారు.. ప్రపంచకప్ జట్టులో చోటు కొట్టేశారు

by Dishanational3 |
ఐపీఎల్‌లో సత్తాచాటారు.. ప్రపంచకప్ జట్టులో చోటు కొట్టేశారు
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ ముగిసిన వెంటనే టీ20 వరల్డ్ కప్ ప్రారంభంకానుంది. ఈ పొట్టి ప్రపంచకప్‌కు మంగళవారం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ నాయకత్వంలో 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. మొదటి నుంచి ప్రపంచకప్ జట్టులో ఐపీఎల్-17లో ప్రదర్శన కీలకమవుతుందని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టే ఐపీఎల్ రాణిస్తున్న వారికి ప్రపంచకప్ జట్టులో చోటు దక్కింది. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్, యుజువేంద్ర చాహల్ తిరిగి జాతీయ జట్టులో చోటు సంపాదించారు.

2022 డిసెంబర్‌లో కారు ప్రమాదం తర్వాత పంత్ ఆటకు దూరమైన విషయం తెలిసిందే. ఐపీఎల్-17తో తిరిగి మైదానంలోకి అడుగుపెట్టిన అతను ఈ సీజన్‌లో అదరగొడుతున్నాడు. 11 మ్యాచ్‌ల్లో 398 పరుగులు చేశాడు. దీంతో అతన్ని మెయిన్ వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు. అలాగే, స్పిన్నర్ చాహల్ ఫామ్ లేమితో గతేడాది జట్టులో స్థానం కోల్పోయాడు. వన్డే వరల్డ్ కప్‌కు కూడా అతన్ని పక్కనపెట్టారు. ఈ సీజన్‌లో రాజస్థాన్ తరపున అతను 9 మ్యాచ్‌ల్లో 13 వికెట్లతో పర్పుల్ క్యాప్‌ రేసులో ఉన్నాడు. దీంతో కుల్దీప్‌కు జోడీగా చాహల్‌ను తీసుకున్నారు.

మరోవైపు, జాతీయ జట్టులోకి వస్తూ పోతున్న సంజూ శాంసన్‌ చోటుపై సందిగ్ధం నెలకొన్నా.. ఐపీఎల్‌లో అతని ప్రదర్శనతో స్థానం ఖాయం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో 9 మ్యాచ్‌ల్లో 161కిపైగా స్ట్రైక్‌రేట్‌తో 385 పరుగులు చేశాడు. ఐపీఎల్-17 ప్రారంభానికి ముందు అసలు జాబితాలోనే లేని శివమ్ దూబె చెన్నయ్ తరపున అదరగొట్టి రేసులోకి వచ్చాడు. మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడుతున్న అతను చెన్నయ్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. దూబె 9 మ్యాచ్‌ల్లో 172.41 స్ట్రైక్‌రేటుతో 350 పరుగులు చేశాడు.

Next Story