గత ఎన్నికలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నాం

by Disha Web Desk 15 |
గత ఎన్నికలో  ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నాం
X

దిశ, మధిర : గత ఎన్నికల్లో అప్రజాస్వామిక బీఆర్ఎస్ పార్టీని బండకేసి బాది ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నామని , రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని బొంద పెట్టి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి గా చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని ఇల్లిందాలపాడు గ్రామ సమీపంలోని శ్రీరస్తు ఫంక్షన్ హాల్ లో మధిర నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుస్థిర పరిపాలన అందిస్తున్నామని , కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజలకు ఒక్కొక్కటిగా పథకాలను అమలు చేస్తూ ఇచ్చిన వాగ్దానాలను అమలుచేయడం జరిగిందన్నారు. ఎన్నికల హామీలు ఇచ్చిన విధంగానే అమలు

చేశాం కాబట్టే ఇప్పుడు మరొకసారి ప్రజల వద్దకు వెళ్లగలుగుతున్నామన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామాల్లో తీరుగుతుంటే.. అధికారంలో ఉన్నప్పుడు హామీలు అమలు చేయకుండా.. మళ్లీ ఇప్పుడు వస్తున్నారా అని ప్రజలు ప్రశ్నిస్తుంటే మొఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియడం లేదన్నారు. గత ప్రభుత్వం హయాంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేశారు కాబట్టే ప్రజలు కేసీఆర్ కు తగిన గుణపాఠం చెప్పారన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కి పట్టిన గతే బీజేపీకి పడుతుందని అన్నారు. రానున్నది కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో పేదలకు 3,500 ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని, ఎన్నికల కోడ్ పూర్తవ్వగానే

అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రెండు గదుల ఇందిరమ్మ ఇండ్లు మొదలు పెడతామన్నారు. ప్రభుత్వం ఆధికారంలోకి వచ్చిన వెంటనే మూడు నెలల్లోనే 90 శాతం మంది రైతులకు రైతు బంధు వేశామన్నారు. రైతులకు పెండింగ్ లోనున్న ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించామన్నారు. కేసీఆర్ మీటింగ్ పెట్టి ఆయనే కరెంట్ కట్ చేసుకుంటాడని, ట్విట్టర్ లో మాత్రం కరెంట్ కట్ అంటూ పెడతాడన్నారు. కేసీఆర్ నాటకాలు ప్రజలు గమనించారని, ఇంకా ఆయన ఆటలు సాగమన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, బేబీ స్వర్ణ కుమారి, భద్రాచలం ట్రస్ట్ బోర్డ్ మాజీ చైర్మన్ ఆయిలూరి వెంకటేశ్వర రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పువూళ్ల దుర్గాప్రసాద్, జిల్లా నాయకులు కోటా రాంబాబు పాల్గొన్నారు.

Next Story

Most Viewed