సొంత జిల్లాలో సీఎం జగన్ కు భారీ షాక్

by  |
CM Jagan
X

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు ఉపఎన్నిక ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఈ ఉపఎన్నికను వైసీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరోవైపు గట్టి పోటీ ఇచ్చేందుకు టీడీపీ కూడా వ్యూహరచన చేస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని జనసేన నిర్ణయించింది. వైసీపీ మాత్రం గతంలో వచ్చిన మెజారిటీ కంటే మరింత మెజారిటీ కోసం ప్రణాళిక రచిస్తోంది. ఇలాంటి తరుణంలో అట్లూరు మండలం చిన్నమరాజుపల్లె గ్రామస్తులు రాజకీయ పార్టీలకు షాక్ ఇచ్చారు. బద్వేలు ఉపఎన్నికను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. తమ గ్రామంలో ఎవ్వరూ ఓట్లు వేయరని స్పష్టం చేశారు.

గత 40ఏళ్లుగా తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని వేడుకుంటున్నామని, అయితే ఇప్పటి వరకు రోడ్డు వేయలేదని వారు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో తమ గ్రామానికి వచ్చి ఓట్లు అడగడం, ఓట్లు వేయించుకొని గెలిచిన తరవాత ఏ నాయకుడు తమ గ్రామం వైపు కన్నెత్తి చూడటంలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి రోడ్డు వేసేంత వరకూ ఏ రాజకీయ పార్టీ నాయకులను తమ గ్రామంలోకి అనుమతించేది లేదంటూ హెచ్చరించారు. ఈ మేరకు గ్రామ పొలిమేరలో ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు హెచ్చరిక బోర్డులు సైతం పెట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ప్రజలు ఇలాంటి షాకింగ్ డెసిషన్ తీసుకోవడంతో అధికారుల్లో టెన్షన్ నెలకొంది. ఇకపోతే బద్వేలు ఉప ఎన్నిక పోరు మరింత వేగవంతమైంది. నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ఈనెల 8 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఈనెల 30న పోలింగ్..నవంబర్ 2న ఫలితాలు వెల్లడికానున్న సంగతి తెలిసిందే.

Next Story