వరి వద్దన్న ముఖ్యమంత్రి మనకు వద్దు : షర్మిల

by  |
వరి వద్దన్న ముఖ్యమంత్రి మనకు వద్దు : షర్మిల
X

దిశ, కామారెడ్డి : రైతు సమస్యల పరిష్కారం కోసం అవసరం అయితే తాను ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. సోమవారం ఆమె రైతు ఆవేదన యాత్రలో భాగంగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో గత నెలలో వరి ధాన్యం కుప్పపై మృతి చెందిన రైతు కుమ్మరి రాజయ్య కుటుంబాన్ని పరామర్శించారు. మృతుని భార్య, ఇద్దరు పిల్లలకు ధైర్యం చెప్పారు. కుమారునికి హైదరాబాద్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని, కూతురు చదువుకు సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. 25 వేల ఆర్థిక సహాయం అందజేశారు.

అనంతరం మీడియాతో షర్మిల మాట్లాడుతూ.. వరి ధాన్యం మొలకలు రాకముందే కొనుగోలు చేసి ఉంటే రాజయ్య చనిపోయే వాడు కాదన్నారు. ఈ చావుకు సీఎం కేసీఆర్ కారణం కాదా.. ఆయన ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. చావు డప్పు మొదలు పెట్టాలని ఆదివారం టీఆర్ఎస్ పార్టీ నాయకులకు సీఎం చెప్పారని, రైతుకు చావు డప్పు కొట్టింది మీరు కాదా అని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. మీరు చావు డప్పు కొట్టడం వల్లే కదా 70 రోజుల్లో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంది అని ప్రశ్నించారు. చావు డప్పులు కొట్టేందుకే మిమ్మల్ని సీఎం చేశారా.. ఇంకా ఎందుకు సీఎం పదవిలో ఉన్నారు. ఎందుకు ఇంతమంది చావుకు డప్పులు కొడుతున్నారని ప్రశ్నించారు.

ఏడేళ్లలో 7 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.. ఏడేళ్లలో ఒక్క నోటిఫికేషన్, ఒక్క ఉద్యోగం అయినా ఇవ్వలేదు. ఎండనక, వాననక, ఎరువులు, విత్తనాలు దొరుకక, వానలు ఎప్పుడు వస్తాయో తెలియక, అప్పులు తెచ్చి కష్టపడి రైతు వరి ధాన్యం వేస్తే కనీసం దాన్ని కొనుగోలు చేసే ఇంగితం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పాపం చేశారని రైతులపై కక్ష కట్టారన్నారు. కక్ష కట్టకపోతే వరి వేయడానికి వీల్లేదని ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించారు. మీరు అధికారంలో ఎందుకు ఉండాలి. వరి వద్దనడానికి మీరెవరని సూటిగా ప్రశ్నిస్తున్నానన్నారు. వరికి మద్దతు ధర ఉందంటే దాని అర్థం ఏంటన్నారు. పంటను పండిస్తే ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొంటుదన్న భరోసా ఇవ్వడమే మద్దతు ధర అన్నారు. అలాంటి వరిని వేయొద్దు అనే హక్కు సీఎంకు ఎక్కడ ఉందని ప్రశ్నించారు. అపరమేధావి, 80 వేల పుస్తకాలు చదివి పక్కన పడేశాను అని చెప్పుకునే సీఎం కేసీఆర్‌కు తెలంగాణలో బావులు, చెరువులు, కాల్వల కిందనే భూములు ఉన్నాయని, అందులో వరి పంటనే పండుతుందన్న విషయం తెలియదా అన్నారు.

అలాంటప్పుడు ఎవరిని అడిగి యాసంగిలో వరి వేయమని సంతకం పెట్టారు. ఏ అధికారం ఉందని కేంద్రానికి లేఖ ఇచ్చారని ప్రశ్నించారు. మీ రాజకీయ లబ్ది కోసం ఇంతమంది రైతులను బలి చేస్తారా అని నిలదీశారు. సన్నవడ్లు వేసుకొమ్మని, ఆఖరి గింజ వరకు మేము కొంటాము, మళ్ళీ కొనుగోలు కేంద్రాలు తెరవమని మాటలు మారుస్తున్నారన్నారు. అమ్మకు అన్నం పెట్టని వాడు పిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తానని కేసీఆర్ లాంటి వారు చెప్పారన్నారు. 70 రోజుల్లో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వారికి ఒక్క రూపాయి సహాయం చేయలేదన్నారు. మన రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే దిక్కులేదు గాని హర్యానాలో రైతులు చనిపోతే 3 లక్షలు ఇస్తారట అని ఎద్దేవా చేశారు. మనవాళ్ళు రైతులు కాదా.. వారివి ప్రాణాలు కాదా.. వారికి విలువ లేదా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ అవలంబించే విధానం అలాగే ఉందన్నారు.

చనిపోయిన ప్రతి రైతు కుటుంబానికి 25 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఏ సీజన్ ఏదైనా రైతులు వరి వేసుకునే హక్కు వారికి ఉందని, దాన్ని కొనుగోలు చేసే బాధ్యత కేసీఆర్‌దే అన్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారని, దీనిపై మీ స్పందన ఏంటని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ వరి కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే నని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకుని కొనుగోలు చేస్తారా.. ఎక్స్ పోర్ట్ చేస్తారా.. పక్క రాష్ట్రాలకు అమ్ముకుంటారా అన్నది సీఎం కేసీఆర్ పనితనం మీద ఆధారపడి ఉందన్నారు. ఇక్కడి రైతులకు కేసీఆర్ మాట ఇచ్చారు కాబట్టి ఆయనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కొన్నాక ఆ వడ్లను రా చేస్తారా.. బాయిల్ చేస్తారా.. బంగారం చేస్తారా అనేది రైతులకు సంబంధం లేదన్నారు. వరి ధాన్యం కొనడం, ఉద్యోగాలు ఇవ్వడం, పరిపాలన చేయడం చేతగాకనే చేతగాని వారి మాదిరిగా ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఆమరణ దీక్షకు కూర్చుని, ప్రాణం పోయినా సరే రైతులకు అండగా ఉంటానని చెప్పారు.


Next Story