ఇండియన్స్‌కు నచ్చని వర్క్ ఫ్రమ్ హోమ్‌..

by  |
ఇండియన్స్‌కు నచ్చని వర్క్ ఫ్రమ్ హోమ్‌..
X

దిశ, ఫీచర్స్ : కరోనా పాండమిక్ కారణంగా చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ కల్పించాయి. ఇండియన్స్‌కు మొదట్లో ఈ కల్చర్ నచ్చినా ఆ తర్వాత విసుగు చెందారని అధ్యయనంలో తేలింది. ఏడాదిన్నరగా ఈ విధానం పట్ల భారతీయులు అయిష్టతతో ఉన్నారని అమెరికన్ బిజినెస్ అండ్ ఎంప్లాయిమెంట్ ఓరియెంటెడ్ ఆన్‌లైన్ సర్వీస్ కంపెనీ తన తాజా సర్వేలో వెల్లడించింది. భారత్‌లోని పలు కంపెనీల్లో పనిచేస్తున్న 1,000 మందికి పైగా ఉద్యోగులపై ఈ స్టడీ నిర్వహించారు. కాగా వీరిలో 72% మంది WFH తమ కెరీర్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందని, అందుకే ఆఫీస్ నుంచి పని చేయడమే మంచిదని అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై కంపెనీలు తమ ఉద్యోగుల ఆసక్తిని పరిగణలోకి తీసుకుని ముందుకెళ్లాలని లేదంటే డిప్రెషన్ లేదా పనిఒత్తిడి వారి పర్ఫార్మెన్స్‌ను తగ్గిస్తుందని సైకియాట్రిస్టులు సూచిస్తున్నారు.

బాస్‌తో ఇంటరాక్షన్ :

సర్వేలో పాల్గొన్న 71% మంది ఆఫీస్ నుంచి పనిచేయడం వల్ల బాస్, సీనియర్ల వద్ద తమకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని భావిస్తున్నారు. ఆఫీసుకు వెళ్లడం అంటే బాస్‌తో రోజూ టచ్‌లో ఉండటమని.. ఇది ప్రమోషన్, సాలరీ ఇంక్రిమెంట్‌కు సాయపడుతుందని నమ్ముతున్నారు. అదే ఇంటి నుంచి పనిచేస్తున్నప్పుడు ఆన్‌లైన్‌లో మాత్రమే ఉన్నతాధికారులతో టచ్‌లో ఉండగలమని, ఉత్తమ ఫలితాలను అందించదని విశ్వసిస్తున్నారు. 72% మంది ఆఫీస్‌కు వెళ్లి పనిచేసినపుడు అనేక ఫన్ మూమెంట్స్‌లో పాల్గొనవచ్చని భావిస్తున్నారు. వర్క్ ఫ్రమ్‌ హోమ్‌లో ఇన్నాళ్లుగా అవన్నీ కోల్పోయామని ఫీల్ అవుతున్నారు.

వృత్తిపరంగా ప్రయోజనాలు :

ఆఫీస్‌లోని సహోద్యోగులతో కలిసి పనిచేయడం ద్వారా కొత్త విషయాలను నేర్చుకునే అవకాశం ఉంటుందని 55% మంది ఉద్యోగులు అనుకుంటున్నారు. ఇది వృత్తిపరంగా తమకు ప్రయోజనం చేకూరుస్తుందని, కెరీర్‌లో మరింత ముందుకు సాగడానికి సాయపడుతుందని భావిస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌లో కొలీగ్స్‌తో ఇంటరాక్షన్స్ లేనందున ఆ చాన్స్ లేదు.

పెరుగుతున్న వర్క్ ప్రెజర్ :

ఇంటి నుంచి పని చేయడం వల్ల వర్క్ పెరిగిందని, షిఫ్ట్ టైమింగ్స్ కంటే ఎక్కువసేపు పని చేయాల్సి వస్తోందని సర్వేలో పాల్గొన్న 35% మంది ఉద్యోగులు తెలిపారు. అయితే ఆఫీస్‌లో ఇదేవిధంగా షిఫ్ట్ సమయాల కంటే ఎక్కువ పనిచేస్తే అదనపు బోనస్ లభిస్తుందని 89% మంది ఉద్యోగులు నమ్ముతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌ వల్ల ఒత్తిడి తదితర సమస్యలను ఎదుర్కొంటున్నట్లు 34% మంది ఉద్యోగులు చెప్పారు.

బ్యాలెన్స్ చేయడం కష్టం :

భారతదేశంలో నిర్వహించిన ఈ సర్వేలో పాల్గొన్న 86% వ్యక్తులు.. హైబ్రిడ్ వర్క్ కల్చర్‌ను సమర్థించారు. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని బ్యాలన్స్ చేసుకోవడంలో సవాళ్లు ఎదురవుతున్నాయని, ఆఫీస్ నుంచి పని చేస్తున్నప్పుడు బ్యాలెన్స్‌ చేయొచ్చుగానీ ఇంటి నుంచి పనిచేస్తే చాలా కష్టపడాల్సి ఉంటుందని వెల్లడించారు.

Next Story