మళ్లీ నష్టాల్లోకి జారిన సూచీలు!

by  |

దిశ, వెబ్‌డెస్క్: రెండు రోజులపాటు అధిక నష్టాల్లో కొనసాగిన దేశీయ ఈక్విటీ మార్కెట్లు సోమవారం కోలుకుంటున్న సంకేతాలిచ్చాయి. అయితే ఇవి మళ్లీ తిరిగి నష్టాల్లోకి జారాయి. మంగళవారం ట్రేడింగ్‌లో సూచీలు సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ కీలక రంగాల్లో అమ్మకాల ఒత్తిడి అధికమవడంతో పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, ఆసియా మార్కెట్లలో మిశ్రమ కదలికలు, దేశీయంగా కీలక రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కారణంగా చివరి వరకు ఒడిదుడుకులను ఎదుర్కొన్న తర్వాత కూడా స్టాక్ మార్కెట్లు నష్టాల నుంచి బయటపడలేకపోయాయి.

ముఖ్యంగా మెటల్, ఇంధన రంగాల్లో మదుపర్లు అధికంగా అమ్మకాలకు సిద్ధపడ్డారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 109.40 పాయింట్లు కుదేలై 60,029 వద్ద, నిఫ్టీ 40.70 పాయింట్లు నష్టపోయి 17,888 వద్ద ముగిసింది. నిఫ్టీలో మెటల్ అధికంగా బలహీనపడగా, రియల్టీ, పీఎస్‌యూ బ్యాంక్ రంగాలు పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో మారుతీ సుజుకి, టైటాన్, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, ఎల్అండ్‌టీ షేర్లు లాభాలను దక్కించుకోగా, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, రిలయన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, డా రెడ్డీస్, పవర్‌గ్రిడ్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.72 వద్ద ఉంది.

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story