లాభాలు సాధించిన స్టాక్ మార్కెట్లు

by  |
లాభాలు సాధించిన స్టాక్ మార్కెట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు బుధవారం లాభాలను సాధించాయి. ఉదయం ప్రారంభం నుంచే సానుకూలంగా కదలాడిన సూచీలు, అనంతరం ఆర్‌బీఐ ప్రకటనతో చివరి వరకు అదే జోరును కొనసాగించాయి. కీలక రంగాల షేర్లు మెరుగ్గా ర్యాలీ చేయడంతో పాటు కరోనా సంక్షోభం నుంచి బయటపడేందుకు చిన్న సంస్థలకు ఆర్‌బీఐ ప్రోత్సాహకాలు స్టాక్స్‌లో ఉత్సాహాన్ని నింపాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఆర్‌బీఐ ప్రకటనలకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో మదుపర్ల సెంటిమెంట్ బలపడింది.

అయితే, స్టాక్ మార్కెట్లలో ఆర్‌బీఐ గవర్నర్ ప్రకటనలపై పెద్దగా ఉత్సాహామేమీ కనబడలేదని, భారీగా ప్యాకేజీతో పాటు మారటోరియంపై ఏదైన ప్రకటన ఉంటుందని ఇన్వెస్టర్లు అంచనా వేశారని, కానీ అలా జరగలేదని నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే, ఫార్మా, బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాక్స్ మెరుగ్గా ర్యాలీ చేశాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 424.04 పాయింట్లు ఎగసి 48,677 వద్ద ముగియగా, నిఫ్టీ 121.35 పాయింట్లు లాభపడి 14,617 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఫార్మా అత్యధికంగా 4 శాతం ర్యాలీ చేసింది. బ్యాంకింగ్, ప్రైవేట్ బ్యాంక్, పీఎస్‌యూ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ, మెటల్ రంగాలు పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్, హిందూస్తాన్ యూనిలీవర్ మాత్రమే నష్టాలను చూడగా, మిగిలిన అన్ని షేర్లు లాభాలు సాధించాయి. ముఖ్యంగా సన్‌ఫార్మా ఏకంగా 5.94 శాతం ర్యాలీ చేసింది. కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, డా రెడ్డీస్, టైటాన్, టీసీఎస్ షేర్లు లాభాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.86 వద్ద ఉంది.

Next Story

Most Viewed