వరుసగా రెండోరోజు నష్టపోయిన స్టాక్ మార్కెట్లు!

by  |
వరుసగా రెండోరోజు నష్టపోయిన స్టాక్ మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండోరోజూ నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలకు తోడు ఇటీవల నమోదైన అధిక లాభాల స్వీకరణతో సూచీలు డీలాపడ్డాయి. వీటితో పాటు కీలక రంగాలైన మెటల్, బ్యాంకింగ్ రంగాల్లో మదుపర్లు లాభాలను వెనక్కి తీసుకోవడంతో స్టాక్ మార్కెట్లు నష్టపోయాయని విశ్లేషకులు తెలిపారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 337.78 పాయింట్లు కోల్పోయి 49,564 వద్ద ముగియగా, నిఫ్టీ 124.10 పాయింట్లు నష్టపోయి 14,906 వద్ద ముగిసింది.

నిఫ్టీలో అత్యధికంగా మెటల్ ఇండెక్స్ 3 శాతం పతనమయ్యాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రైవేట్ బ్యాంక్, ఎఫ్ఎంసీజీ రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎంఅండ్ఎం, ఇండస్ఇండ్ బ్యాంక్, టైటాన్, ఎల్అండ్‌టీ, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాలను దక్కించుకోగా, ఓఎన్‌జీసీ, సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, కోటక్ బ్యాంక్ షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.12 వద్ద ఉంది.



Next Story

Most Viewed