ఆల్ టైం రికార్డ్ సృష్టించిన సెన్సెక్స్..

by  |
bsc
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారత చరిత్రలో నిలిచిపోయే రికార్డును నమోదు చేశాయి. మొట్టమొదటిసారిగా సూచీలు సరికొత్త శిఖరాలను అధిగమించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ తొలిసారిగా 60,000 మైలురాయిని దాటింది. మొదటిసారిగా 1990లో 1,000 పాయింట్ల మార్కును నమోదు చేసిన సెన్సెక్స్ అనంతరం ఎన్నో ఒడిదుడుకులను చూసి శుక్రవారం(సెప్టెంబర్ 24న) భారత స్టాక్ మార్కెట్ల చరిత్రలో అద్భుతమైన ఘట్టాన్ని ఆవిష్కరించింది. శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో మార్కెట్లు ఉదయం నుంచి లాభాల్లోనే కదలాడాయి. మిడ్-సెషన్‌కు ముందు 60 వేలకు దిగువకు వెళ్లినప్పటికీ అనంతరం పుంజుకున్నాయి. నిఫ్టీ కూడా 18 వేల పాయింట్లకు చేరువగా ర్యాలీ చేశాయి.

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలకు తోడు దేశీయంగా కీలక పరిణామాల మధ్య స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయి. ఆసియా మార్కెట్లు ఆటుపోట్లకు గురైనప్పటికీ మిగిలిన అంశాల మద్దతుతో దేశీయ సూచీలు స్థిరంగా 60 వేల వద్ద కొనసాగాయి. ఓ దశలో సెన్సెక్స్ ఆల్‌టైమ్ గరిష్ఠం 60,333 వద్ద ర్యాలీ చేయగా, నిఫ్టీ 17,947 రికార్డు గరిస్థాల స్థాయిని తాకింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 163.11 పాయింట్లు ఎగసి 60,048 వద్ద ర్యాలీ ముగిచింది. నిఫ్టీ 30.25 పాయింట్ల లాభంతో 17,853 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఐటీ, ఆటో, రియల్టీ రంగాలు పుంజుకోగా, మెటల్, ఎఫ్ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంక్ రంగాలు నీరసించాయి.

sensex

సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఏషియన్ పెయింట్, ఎంఅండ్ఎం, హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, మారుతీ సుజుకి, ఇన్ఫోసిస్ షేర్లు లాభాలను సాధించాయి. టాటా స్టీల్, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, హిందూస్తాన్ యూనిలీవర్, ఎన్‌టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, ఆల్ట్రా సిమెంట్, పవర్‌గ్రిడ్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.76 వద్ద ఉంది.


Next Story

Most Viewed