దివ్యపై 12 కత్తిపోట్లు..పోస్టుమార్టంలో సంచలనాలు

24

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ నడిబొడ్డున దారుణ హత్యకు గురైన బీటెక్ స్టూడెంట్ దివ్య పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. దివ్య శరీరంపై మొత్తం 12 బలమైన కత్తిపోట్లు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదిక వచ్చింది. గొంతుపై తీవ్రంగా దాడి చేయడం వల్లే దివ్య చనిపోయినట్లు డాక్టర్లు నిర్థారించారు. యువతి గొంతు లోపలి భాగం వరకూ కత్తి దిగడంతో ప్రాణాలు విడిచినట్లు రిపోర్టులో ఉంది. గురువారం మధ్యాహ్నం మాచవరం పోలీస్‌స్టేషన్ పరిధిలోని క్రీస్తురాజుపురంలో జరిగిన ఈ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.

తనను ప్రేమించడం లేదనే దివ్య తేజస్వినిపై కత్తితో దాడి చేసినట్లు నిందితుడు నాగేంద్ర అలియాస్ చిన్నస్వామి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. మంగళగిరిలో తామిద్దరం పెళ్లి చేసుకున్నామని, ఆమె తండ్రి వల్లే ఈ పరిస్థితులు తలెత్తాయని ఆరోపిస్తూ సృహకోల్పోయినట్లు తెలుస్తోంది. స్కానింగ్ ప్రక్రియ పూర్తి అయ్యాక నాగేంద్ర స్టేట్‌మెంట్ రికార్డు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. యువతిపై దాడి చేసిన తర్వాత నిందితుడు నాగేంద్ర కూడా ఆత్మహత్యకు యత్నించడంతో పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నాగేంద్రబాబు స్థానికంగా కార్పెంటర్‌గా పనిచేసేవాడని, దివ్య బీటెక్‌ చదువుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.