భర్త కాలిపోతున్నా పట్టించుకోని భార్య..!

by  |
భర్త కాలిపోతున్నా పట్టించుకోని భార్య..!
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: బావమరిది చనిపోయాడని అత్తవారింటికి వచ్చిన ఆ సాఫ్ట్‌‌వేర్ ఇంజినీర్‌ను దారుణంగా హత్య చేశారు. కళ్లముందే చనిపోతున్నా ఎవరూ అతడిని కాపాడే ప్రయత్నం చేయలేదు. సమాచారం అందుకుని పోలీసులు వచ్చేసరికి మంటల్లోనే కాలిపోతున్నా బంధువుల నుంచి స్పందన లేకపోవడంతో అనుమానించారు పోలీసులు. విచారణ అక్కడి నుంచే ప్రారంభించాలని భావించి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టి, నిందితులను అరెస్ట్ చేశారు.

విస్తుపోయే నిజాలు..

జగిత్యాల జిల్లా బల్వంతాపూర్‌లో ఈ నెల 23న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పవన్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణ చేపట్టిన పోలీసులు విస్తుపోయే నిజాలను గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల పవన్ భార్య కృష్ణవేణికి సంబంధించిన బంగారం చోరీకి గురైంది. దొంగతనం చేసింది తన అత్తింటి వారేననే అనుమానంతో పవన్ తరుచూ భార్యతో చెప్పేవాడు. ఇదే సమయంలో మృతుడు పవన్ యూ ట్యూబ్‌తో పాటు వివిధ రకాల పుస్తకాలను తెప్పించుకుని చేతబడి చేయడం ఎలా అనే వివరాలపై ఆరా తీశాడు. అనూహ్యంగా అతడి బావమరది జగన్ గుండెపోటుతో మరణించాడు. పవన్ చేతబడి చేసే విషయంపై అవగాహన పెంచుకుంటున్నాడని తెలుసుకున్న అత్తింటి వారు అతడిపై అనుమానంతో ఉన్నారు. తమ సోదరుడు జగన్ మరణానికి కారకులెవరని తాంత్రికుడిని అడగగా మీ కుటుంబానికి చెందిన వారి హస్తం ఉందని చెప్పారు. దీంతో వారి అనుమానానికి బలం చేకూరింది.

పథకం ప్రకారం..

జగన్ మృతికి పవనే కారణమని అనుమానించిన అత్తింటి వారు పకడ్బంధీగా పథకం వేశారు. పవన్‌ను జగన్ ఫోటో ముందే చంపి ప్రతీకారం తీర్చుకునేలా ప్లాన్ చేశారు. పవన్ బల్వంతపూర్ చేరుకోగానే జగన్ ఫోటోను ఏర్పాటు చేసిన గదిలోకి పంపించారు. వెంటనే మరో బావమరది విజయ్, చనిపోయిన జగన్ భార్య సుమలత తలుపులు వేశారు. అప్పటికే రెడీగా ఉంచిన దాదాపు 15 లీటర్ల పెట్రోల్‌ను కిటికి గుండా పవన్‌ను పంపించిన గదిలో పోసి నిప్పంటించారు. తన భర్త కళ్లేదుటే ఆహుతవుతున్నా కూడా భార్య కృష్ణవేణి మాత్రం పట్టించుకోలేదు. అయితే పవన్ హత్య విషయం గురించి నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఓ వ్యక్తి కాలిపోతున్నా కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడం ఏంటీ..? అతడి భార్య కూడా కాపాడే ప్రయత్నం ఎందుకు చేయలేదు అనే అనుమానంతో లోతుగా విచారణ చేస్తే అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఏ3గా భార్య..

పవన్ హత్య కేసులో అతడి భార్య కృష్ణవేణిని ఏ3గా చేర్చి కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు ఏడుగురు నిందితులపై పోలీసులు హత్య కేసు నమోదు చేయగా ఇందులో ఐదుగురు మహిళలే కావడం గమనార్హం. ఏ7గా ఉన్న నిరంజన్ రెడ్డే పోలీసులకు ఫోన్ చేసి మంజునాథ ఆశ్రమంలో వ్యక్తి కాలి బూడిదయ్యాడని చెప్పడం మరో ట్విస్ట్.


Next Story

Most Viewed