ఆ ప్రాజెక్టుల డీపీఆర్‌లు పంపండి

by  |
Godavari Board
X

దిశ, తెలంగాణ బ్యూరో : గోదావరి నది మీద నిర్మిస్తున్న ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లను వెంటనే పంపాల్సిందిగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సాగునీటిపారుదల శాఖ కార్యదర్శులకు గోదావరి నది యాజమాన్య బోర్డు శుక్రవారం లేఖ రాసింది. రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకెళ్తూ కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ గెజిట్ విడుదల చేసిన గంటల వ్యవధిలోనే గోదావరి బోర్డు రెండు రాష్ట్రాలకు లేఖలు రాయడం గమనార్హం. అపెక్స్ కౌన్సిల్ ఆమోదం, కేంద్ర జల సంఘం అనుమతి, గోదావరి బోర్డుకు డీపీఆర్‌లు సమర్పించకుండా చేపట్టిన ప్రాజెక్టుల నివేదికలను సమర్పించాల్సిందేనని సభ్యుడు పీఎస్ కుటియాల్ ఆ లేఖలో స్పష్టం చేశారు.

రెండు రాష్ట్రాలు గోదావరి నది మీద ప్రాజెక్టులను ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే నిర్మిస్తున్నాయని, వీటిపైన గతేడాది జూన్ 5వ తేదీన, ఆ తర్వాత అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చలు జరిగాయని పేర్కొన్నారు. వాటి డీపీఆర్‌లను సమర్పించడానికి రెండు రాష్ట్రాల ప్రతినిధులు అంగీకరించారని, కానీ ఏడాది దాటినా ఇప్పటివరకు అందలేదని తాజా లేఖలో ప్రస్తావించారు. తెలంగాణ నుంచి ఒక్క ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ కూడా అందలేదని, ఆంధ్రప్రదేశ్ నుంచి పాత డీపీఆర్‌లు మాత్రమే అందాయని, వాటిని సవరించి పంపాల్సిందిగా సమాచారం ఇచ్చామని ఉదహరించారు.

కేంద్ర జల సంఘం నుంచి అనుమతి లేకుండా, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం పొందకుండా ప్రాజెక్టులను నిర్మించడం ఉల్లంఘనల కిందికే వస్తుందని వివరించారు. గతేడాది జూన్ 10వ తేదీకల్లా సమర్పించనున్నట్లు జూన్ 5న జరిగిన గోదావరి బోర్డు సమావేశంలోనే హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. ఇదే విషయాన్ని గతేడాది జూలై 1వ తేదీన రాసిన లేఖలో రెండు రాష్ట్రాల ఇరిగేషన్ కార్యదర్శులకు బోర్డు లేఖ రాసి గుర్తుచేసిందని గుర్తు చేశారు. గతేడాది అక్టోబరులో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సైతం కేంద్ర జలశక్తి మంత్రి సమక్షంలో జరిగిన చర్చల సందర్భంగా డీపీఆర్‌లను సమర్పించడానికి రెండు రాష్ట్రాలు సమ్మతించాయని, కానీ ఇవ్వలేదని, ఇదే విషయాన్ని గతేడాది నవంబరు 17న బోర్డు ఒక లేఖ రాసి గుర్తుచేసిందని ఉదహరించారు.

ఇప్పటికైనా రెండు రాష్ట్రాలు అనుమతి లేకుండా నిర్మిస్తున్న ప్రాజెక్టుల డీపీఆర్‌లను వెంటనే బోర్డుకు సమర్పించాలని, ఈ దిశగా క్రిందిస్థాయి అధికారులకు అర్థం చేయించారని తాజా లేఖలో రెండు రాష్ట్రాల ఇరిగేషన్ కార్యదర్శులను బోర్డు సభ్యుడు కుటియాల్ కోరారు.


Next Story

Most Viewed