ప్రస్తుత ఏడాది వృద్ధి 9.3 శాతం : మూడీస్

by  |
ప్రస్తుత ఏడాది వృద్ధి 9.3 శాతం : మూడీస్
X

దిశ, వెబ్‌డెస్క్: 2021-22 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి 9.3 శాతంగా నమోదవుతుందని ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ అంచనా వేసింది. అయితే, 2022-23 ఆర్థిక సంవత్సరంలో మాత్రం 7.9 శాతానికి పరిమితమవుతుందని అభిప్రాయపడింది. కొవిడ్ సెకెండ్ వేవ్ కారణంగా దేశంలో అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్ ఆంక్షలు కఠినతరం చేయడంతో ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం ఉండొచ్చని, ఈ రంగం ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపింది. సెకెండ్ వేవ్ వల్ల దీర్ఘకాలం పాటు క్రెడిట్ రేటింగ్ ప్రతికూలత తప్పదని తెలిపింది.

వృద్ధి నెమ్మదిగానే కొనసాగుతుందని, బలహీనమైన ప్రభుత్వ ఆర్థిక పరిస్థితుల వల్ల ఆర్థిక రంగంలో నష్టాలు తీవ్రమవుతాయని మూడీస్ తన తాజా నివేదికలో పేర్కొంది. అయితే, గతేడాది కరోనా స్థాయిలో తీవ్రత ఉండే అవకాశాలు లేవని మూడీస్ పేర్కొంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థికవ్యవస్థ 7.3 శాతం క్షీణించింది. దీర్ఘకాలంలో వాస్తవ జీడీపీ వృద్ధి రేటు 6 శాతం ఉంటుందని మూడీస్ అంచనా వేసింది. కరోనా వల్ల ఉత్పన్నమయ్యే ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనక తప్పదని, రానున్న రోజుల్లో సవాళ్లు మరింత కఠినంగా ఉండొచ్చని మూడీస్ హెచ్చరించింది. ఇప్పటివరకు సెకెండ్ వేవ్ దేశంలోని కుటుంబాలకు, చిన్న వ్యాపారాలకు ఆర్థికంగా దెబ్బతీసింది. ఇది బ్యాంకుల లాభదాయకతను దెబ్బతీస్తుంది. అయితే, ఆర్‌బీఐ తీసుకున్న రుణ పునర్‌వ్యవస్థీకరణ,వివిధ చర్యలతో బ్యాంకింగ్ రంగం నష్టాలను తగ్గించగలదని మూడీస్ వెల్లడించింది.


Next Story

Most Viewed