ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి : ఎమ్మెల్యే సీతక్క

by  |
ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి : ఎమ్మెల్యే సీతక్క
X

దిశ, ములుగు : రాష్ట్రంలో అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని ఏఐసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రమోషన్లలో జరుగుతున్న అన్యాయాలకు నిరసన గా ఆదివారం హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద నిరసనగా మహాధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి ములుగు ఎమ్మెల్యే సీతక్క సంఘీభావం తెలిపి మహాధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. దేశంలో కొన్ని వందల ఏండ్లు గా ఎస్సీ, ఎస్టీ లు అణిచివేతకు గురవుతున్నారని అన్నారు.

అదేవిధంగా సామాజిక విద్య, ఆరోగ్య దోపిడీకి గురవుతున్నారని, దాదాపుగా రాష్ట్రంలో 30 వేల వరకు ఉన్న ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘాలకు ప్రభుత్వ గుర్తింపు ఇచ్చి స్టాఫ్ కౌన్సిల్ లో మెంబర్ షిప్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయాలని, అన్ని శాఖల్లో రిజేర్వేషన్ లు సక్రమంగా అమలు పరిచేందుకు హై లెవల్ పర్యవేక్షణ కమిటీని నియమించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం, ఉద్యోగ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story